స్థల వివాదంలో అవ్వమనుమరాలిపై దాడి
ABN , Publish Date - Jan 13 , 2024 | 10:50 PM
స్థల వివాదంలో జరిగిన దాడి తో మనస్తాపం చెందిన ధన్యాసి జయమ్మ, ఆమె మనవరాలు చాందిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.ఈ సంఘటన శనివారం కావలి మండలం గౌరవరంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు, గౌరవరం ఎస్సీ కాలనీకి చెందిన జయమ్మ కు, కందిపాటి వీరరాఘవు
మనస్తాపంతో బాధితుల ఆత్మహత్యాయత్నం
కావలి రూరల్, జనవరి13: స్థల వివాదంలో జరిగిన దాడి తో మనస్తాపం చెందిన ధన్యాసి జయమ్మ, ఆమె మనవరాలు చాందిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.ఈ సంఘటన శనివారం కావలి మండలం గౌరవరంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు, గౌరవరం ఎస్సీ కాలనీకి చెందిన జయమ్మ కు, కందిపాటి వీరరాఘవులుకు మధ్య నివాసాల సమీపంలో దారి విషయమై రెండు నెలలుగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో జయమ్మ లాయర్‌ను సంప్రదించి వీరరాఘవులుకు లీగల్ నోటీసు పంపారు. నోటీసు పంపినప్పటికీ వివాదంలో ఉన్న ఆస్థలంలో వీరరాఘవులు గోడ నిర్మించబోగా జయమ్మ, కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. వివాదాన్ని కోర్టులో తేల్చుకుందామని ఆమె చెప్పారు. దీంతో ఇరువర్గాలవారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం వివాదాస్పద స్థలం వద్దకు సీఐ శ్రీనివాసరావు, తన సిబ్బందితో చేరుకుని వీరరావులుకు అనుకూలంగా మాట్లాడారు. కాగా శనివారం వీరరాఘవులు వివాదాస్పద స్థలంలో మెట్ల నిర్మాణం చేస్తుండగా జయమ్మ, ఆమె కోడలు సుభాషిణి అడ్డుకున్నారు. వీరరాఘవులు, ఆయన భార్య నాగమ్మ, కుమారుడు వినోద్, వారి బంధువులు సుమారు 10 మంది కలసి అడ్డుకున్న తమపై దాడిచేసినట్లు జయమ్మ పేర్కొన్నారు. ఆ సమయంలో అడ్డువచ్చిన తనను, తన మనుమరాలి దూషించారని ఆమె తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన జయమ్మ, మనుమరాలు చాందిని ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు కావలిలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కాగా ఇరువర్గాల వారు పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
------------