ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:00 PM
పట్టణంలోని ఓ లాడ్జీలో మంగళవారం యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు, అన్నమయ్య జిల్లా పెనమలూరు మండలం కంభాలకుంట గ్రామానికి చెందిన సింగనమల వెంకటేష్(23)కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవ
ఉదయగిరి రూరల్, జనవరి 30: పట్టణంలోని ఓ లాడ్జీలో మంగళవారం యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు, అన్నమయ్య జిల్లా పెనమలూరు మండలం కంభాలకుంట గ్రామానికి చెందిన సింగనమల వెంకటేష్(23)కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఉదయగిరి చాకలవీధిలోని తన అక్క సైదాపురం నాగమణి వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఐదేళ్లుగా మర్రిపాడు మండలం రామానాయుడుపల్లికి చెందిన మేస్త్రీ చీమలదిన్నె రమణయ్య వెంట తెలంగాణలో బేల్దారీ పనులకు వెళుతుండేవాడు. ఈ క్రమంలో వెంకటేష్ సంక్రాంతికి మేస్త్రీతోపాటు ఉదయగిరికి వచ్చాడు. ఈనెల 14న రమణయ్య లాడ్జీలో ఓ గదిని అద్దెకు తీసుకొని తెలంగాణకు కూలీలను తీసుకెళ్లేందుకు గ్రామాల్లో తిరుగుతున్నాడు. నాలుగు రోజుల క్రితం తన అక్క ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంకటేష్ మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఈ విషయం మేస్త్రీకి తెలపడంతో మళ్లీ ఎక్కడికైనా వెళ్లిపోతాడేమోనని గ్రహించి మేస్త్రీ, నాగమణి కుమారుడు కలిసి వెంకటేష్‌ను తీసుకువచ్చి లాడ్జీలో ఉంచి బయట తాళం వేసి, టీ తాగేందుకు వెళ్లారు. తిరిగి వచ్చి ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా వెంకటేష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉండడాన్ని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వేల్పుల గిరిబాబు తన సిబ్బందితో లాడ్జీకి చేరుకున్నారు. తలుపులను ధ్వంసం చేసి మృతదేహాన్ని కిందకు దింపి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
---------