Share News

మెగా డీఎస్సీ ఇంకెప్పుడు?

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:37 AM

రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు.

మెగా డీఎస్సీ ఇంకెప్పుడు?

నోటిఫికేషన్‌కు బాలారిష్టాలు

బడులు తెరిచేనాటికి కొత్త టీచర్లు కొలువుదీరేనా?

అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలలు వాయిదా

తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత

డీఎస్సీ ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలలు

తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం

మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యమని వాదన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి, భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్‌ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ తన నివేదిక సమర్పించిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు కదలనుంది. మరోవైపు పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుపుతామని, కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. మొత్తం 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే పెట్టారు. ఆ వెంటనే జూలై 1న డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే చాలావరకు ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఇంతవరకూ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12న బడులు తెరుచుకుంటాయి. ఈ ఐదు నెలల్లోపే కొత్త టీచర్ల ఎంపిక, వారికి శిక్షణ పూర్తిచేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.

డీఎస్సీకి వరుస బ్రేకులు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయితే సన్నద్ధతకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరారని, ఆ మేరకు 3నెలలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 6న డీఎస్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పూర్తిచేసింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో నోటిఫికేషన్‌కు మరోసారి బ్రేక్‌ పడింది. వర్గీకరణ సిఫారసుల కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం... మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిషన్‌ కొద్దిరోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో 2నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తే బడులు తెరిచే నాటికి భర్తీ ప్రక్రియ పూర్తికావడం సాధ్యం కాదు. గతంలో ఎప్పుడూ ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తికాలేదు. అందులోనూ ఇప్పుడు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ కావడంతో మరింత సమయం అవసరం.


నిరుద్యోగుల ఎదురుచూపులు

సీఎం తొలి సంతకం పెట్టినప్పటినుంచీ బీఈడీ చదివిన నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు టెట్‌ నిర్వహించినా కనీసం 4లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ లేకపోవడంతో ఆశావహుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందోనని వారంతా ఆత్రుతగా ఉన్నారు. కానీ వివిధ కారణాలతో డీఎస్సీ వాయిదా పడుతూ వస్తోంది. బడుల్లో టీచర్ల సంఖ్యను తగ్గించేలా గత జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేయాలని నిర్ణయించడంతో, కొత్త ఉపాధ్యాయుల అవసరం పెరగనుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలల్లోనూ అదనపు టీచర్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోగా బడుల పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తిచేయనుంది. బడులు తెరిచే నాటికి కొత్త పాఠశాలల వ్యవస్థ అమల్లోకి వస్తే టీచర్ల అవసరం కూడా మరింత పెరుగుతుంది.

Updated Date - Dec 28 , 2024 | 03:37 AM