Share News

వీసీ నియామకాలకు ‘నామినీ’ల కొరత

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:06 AM

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) నియామకం విషయంలో నామినీల కొరత కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి 17 యూనివర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి.

వీసీ నియామకాలకు ‘నామినీ’ల కొరత

  • ఒకేసారి 17 వర్సిటీలకు నోటిఫికేషన్లు.. సెర్చ్‌ కమిటీలో సభ్యుల కోసం అగచాట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) నియామకం విషయంలో నామినీల కొరత కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి 17 యూనివర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసింది. సెప్టెంబరు 28 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 2,500కు పైగా దరఖాస్తులు అందాయి. అయితే, వీరిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. సెర్చ్‌ కమిటీల నియామకం కోసం ఉన్నత విద్యాశాఖ నామినీల పేర్లు ఇవ్వాలని లేఖలు రాసింది. ఇదిలావుంటే, ఒకేసారి 17 వర్సిటీలకు వీసీలను నియమిస్తున్నందున సీనియర్‌ ప్రొఫెసర్లంతా దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారు సెర్చ్‌ కమిటీలో ఉండకూడదు. దీంతో ఇంతమంది నామినీలను ఒకేసారి నామినేట్‌ చేయడం పెద్ద సమస్యగా మారింది. గతంలో ఒకేసారి ఇన్ని నివర్సిటీలకు నోటిఫికేషన్లు జారీకాలేదు. దీంతో ఒకేసారి ఇన్ని సెర్చ్‌ కమిటీలు వేయాల్సిన అవసరం రాలేదు. గత ప్రభుత్వంలో వీసీలుగా నియామకమైనవారు ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.


అప్పుడూ ఇప్పుడూ ఆయనే: వైసీపీ హయాంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న కె. హేమచంద్రారెడ్డి వీసీల నియామకాల్లో చక్రం తిప్పేవారు. వైస్‌ చైర్మన్‌ కె. రామ్మోహన్‌రావు కూడా కీలకంగా వ్యవహరించేవారు. ప్రభుత్వం మారాక చైర్మన్‌ రాజీనామా చేశారు. దీంతో రామ్మోహన్‌రావుకు ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ బాధ్యతలను అప్పగించారు. గత ప్రభుత్వంలో ఏయూ వీసీ పోస్టు కోసం ఆయన అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సిఫారసుతో ప్రయత్నించినా పదవి దక్కలేదు. అయితే, ఈ ప్రభుత్వంలో వీసీల నియామకంలోనూ ఆయనే కీలకంగా మారారు. పైగా ఆంధ్రా, కృష్ణా వర్సిటీలకు ఆయన దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నత విద్యామండలికి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా ఉంటూ వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే పారదర్శకత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో చైర్మన్‌తో అంటకాగిన ఆయన్ను కీలక హోదాలో కొనసాగిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. వీసీ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆయన రహస్యంగా ఉంచుతున్నారు. దీనికి కారణం ఆయన కూడా దరఖాస్తు చేసుకోవడమేనని తెలుస్తోంది.

Updated Date - Oct 11 , 2024 | 06:06 AM