ఒక్క చాన్సే చివరి చాన్స్ కావాలి! జగన్ నైజం దోపిడీ, విధ్వంసమే: చంద్రబాబు
ABN , Publish Date - Apr 20 , 2024 | 11:53 AM
జలగన్న జగన్‌కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు.
- ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు
- విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు
- ప్రజాగళంలో టీడీపీ అధినేత బాబు
- ఆలూరు, కణేకల్లులో భారీ సభలు
కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జలగన్న జగన్‌కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని.. దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌రెడ్డి శవ రాజకీయాలు చేస్తూ లాభపడాలని చూస్తున్నాడన్నారు. ‘గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నాడు. గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా..? జన్మనిచ్చిన తల్లికే భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా? తండ్రిలేని బిడ్డ అన్నాడు. ఒక్క చాన్స్ అన్నాడు. ముద్దులు పెట్టాడు. తల నిమిరాడు. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఐదేళ్ల పాలనలో మీలో ఎవరైనా బాగుపడ్డారా’ అని ప్రశ్నించారు. అధికార మదంతో విర్రవీగుతున్నాడని.. అందుకే ఆయనకు ‘జే గన్‌రెడ్డి’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాకపోతే మరెలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆయన్ను గెలిపిస్తే.. ఢిల్లీకి వెళ్లి ఫైరవీలు చేసుకున్నాడని.. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశాడని.. అన్ని రంగాలను సర్వనాశనం చేశాడని విమర్శించారు. రూ.13 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దైన్య పరిస్థితి తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ ఐదుగురు బాగుపడితే.. రాష్ట్రం బాగుపడినట్లా అని నిలదీశారు. మోసం చేయడంలో జగన్ దిట్టని.. అబద్ధాలు చెప్పడం ఆయనకు పుట్టుకతో వచ్చిన విద్యని విమర్శించారు. ఆయన తమపై నోరు పారేసుకుంటున్నాడని, తామూ బూతులు తిట్టాలంటే ఒక్క నిమిషం పట్టదని అన్నారు. మీకు భవిష్యత్ కావాలా..? అరాచక పాలనలోనే ఉంటారా అని ప్రజలను అడిగారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని తరిమేయాలని పిలుపిచ్చారు. జరుగనున్న కురుక్షేత్రంలో ధర్మానిదే విజయమని.. జగన్ ఇంటికి పోవడం తథ్యమన్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో పేదలను లక్షాధికారులుగా మార్చే బాధ్యత తనదని చెప్పారు.