Share News

Andhra Pradesh : ఎవరి ‘కంట్రోల్‌’లో ఆ అధికారి?

ABN , Publish Date - May 25 , 2024 | 05:08 AM

ఎన్నికల విధుల్లో ఉండగా ఆ అధికారి వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. కీలక బాధ్యతల్లో ఉన్న పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయ భాస్కరెడ్డి పోలింగ్‌ రోజు ఉద్దేశపూర్వకంగానే కొన్ని గంటల పాటు కంట్రోల్‌ రూమ్‌ను వదిలేసి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాను ఓటు వేసేందుకు వెళ్లినట్టు అయన చెబుతున్నారు.

Andhra Pradesh : ఎవరి ‘కంట్రోల్‌’లో ఆ అధికారి?

మాచర్లలో పోలింగ్‌ జరుగుతుండగానే

కంట్రోల్‌ రూమ్‌ను వదిలేసిన డీపీవో

నరసరావుపేట, మే 24 : ఎన్నికల విధుల్లో ఉండగా ఆ అధికారి వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. కీలక బాధ్యతల్లో ఉన్న పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయ భాస్కరెడ్డి పోలింగ్‌ రోజు ఉద్దేశపూర్వకంగానే కొన్ని గంటల పాటు కంట్రోల్‌ రూమ్‌ను వదిలేసి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాను ఓటు వేసేందుకు వెళ్లినట్టు అయన చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్‌ బ్యాలెట్‌ను విధిగా వినియోగించుకోవాలి. అందుకు విరుద్ధంగా డీపీవో వ్యవహరించడం గమనార్హం. పోలింగ్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

ఒక్కొక్క నియోజకవర్గం పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించారు. మాచర్ల నియోజకవర్గానికి డీపీవో విజయ భాస్కరరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించారు. మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. అయితే, దీనిపై నివేదికను విజయ భాస్కరరెడ్డి ఇవ్వలేదని తెలిసింది. పైగా పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన జరిగాకే డీపీవో ఓటు వేసేందుకు కంట్రోలు రూమ్‌ను వదలి వెళ్లినట్టు సమాచారం. దీనిపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కంట్రోలు రూమ్‌ నుంచి బయటకు వెళ్లేందుకు ఎవరు ఆయనకు అనుమతి ఇచ్చారనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. విజయభాస్కరరెడ్డి మాత్రం... తనకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఒంగోలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నట్టు తెలిసింది.

పోలింగ్‌కు ముందే ఆయనపై ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎన్నికల అధికారికి ఆ ఫిర్యాదులను పంపించినా, వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపలేదని తెలుస్తోంది. విజయభాస్కరరెడ్డి తీరుపై ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Updated Date - May 25 , 2024 | 06:55 AM

News Hub