కాకినాడ డీఎఫ్‌వోపై పవన్ సీరియస్
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:41 AM
కాకినాడ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) డి.రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్‌కల్యాణ్ విచారణకు ఆదేశించారు.
తన పేరు, పేషీ పేరు వాడారని ఫిర్యాదులు
విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) డి.రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్‌కల్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా నుంచి కాకినాడకు బదిలీపై వచ్చిన రవీంద్రనాథ్‌రెడ్డి.. పవన్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పుకొంటున్నారని.. మైనింగ్, అటవీ శాఖ రేంజర్లతో సమావేశాలు పెట్టి, మైనింగ్ వాహనాలు బయటకు వెళ్లడానికి వీల్లేదని, తాను చెప్పినప్పుడే పంపాలని హుకుం జారీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా.. తాను చూసుకుంటానని, డిప్యూటీ సీఎం పేషీతో, అవసరమైతే పవన్‌తో స్వయంగా మాట్లాడతానని చెప్పారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాలు తన దృష్టికి రావడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్‌రెడ్డిపై వెంటనే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తన పేరు, తన కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు.