87 రోజులే.. వైసీపీ సర్కారుకు కౌంట్ డౌన్
ABN , Publish Date - Jan 15 , 2024 | 07:34 AM
అమరావతి దేవతల రాజధాని.. దానిని రాక్షసులు చెరబట్టారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. ఇక మిగిలింది 87 రోజులేనని.. లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఏడాది ఇదే ప్రాంతంలో జనసేన–టీడీపీ ప్రభుత్వంలో అద్భుతమైన సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటామని.. బంగారంలాంటి రాజధానిని నిర్మించుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
మళ్లీ వైసీపీ వస్తే ఏపీని మర్చిపోవడమే
రాజధాని రైతుల పోరాటానికి, ధైర్యానికి హ్యాట్సాఫ్
మీ గెలుపు 5 కోట్ల ఆంధ్రుల గెలుపు.. రైతులతో బాబు
టీడీపీ–జనసేన కలవడానికి రైతుల ఆవేదనే కారణం
బంగారంలాంటి రాజధానిని నిర్మించుకుందాం: పవన్
రాజధాని గ్రామం మందడంలో
ఉభయుల ‘భోగి సంకల్పం’
మంటల్లో చీకటి జీవోల దహనం
దేవతల రాజధానిలో రాక్షస వధ
ఇప్పుడు అమరావతిలో సైకో వధ
మంచి రోజులు వస్తున్నాయి..
విశాఖ ఆర్థిక రాజధాని
కర్నూలులో హైకోర్టు బెంచ్
గుంటూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): అమరావతి దేవతల రాజధాని.. దానిని రాక్షసులు చెరబట్టారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. ఇక మిగిలింది 87 రోజులేనని.. లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఏడాది ఇదే ప్రాంతంలో జనసేన–టీడీపీ ప్రభుత్వంలో అద్భుతమైన సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటామని.. బంగారంలాంటి రాజధానిని నిర్మించుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని మందడం గ్రామంలో ఆదివారం నిర్వహంచిన ‘పల్లె పిలుస్తోంది రా.. కదలిరా!’ కార్యక్రమంలో టీడీపీ–జనసేన ‘భోగి సంకల్పం’ తీసుకున్నాయి. కార్యక్రమానికి హాజరైన ఇరు పార్టీల అధినేతలకు రాజధాని రైతులు, మహిళలు మంగళహారతులు, జయజయధ్వానాలతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ భోగి మంటల్లో చీకటి జీవోల ప్రతులను వేసి తగలబెట్టారు. ప్రభుత్వం సృష్టించిన అధిక ధరలు, కరెంటు చార్జీలు, నిరుద్యోగ సమస్యలను అగ్నికి ఆహుతిచ్చి భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. రాజధాని మహిళలు వేసిన సంక్రాంతి ముగ్గులను పరిశీలించి వారిని అభినందించారు. సంప్రదాయ చిహ్నాలైన గంగిరెద్దులు, జోడెడ్ల బండిని పరిశీలించారు. చంద్రబాబు నాగలి భుజానికెత్తుకోగా, పవన్ చర్నాకోలను చేబూనారు. మహిళలు చేసిన పొంగళ్లను ఇద్దరూ రుచిచూశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.
అవిగవిగో మంచి రోజులు..
‘రాక్షస వధ అయిపోయింది.. సైకో వధ కూడా త్వరలోనే జరుగుతుంది. మంచి రోజులు వస్తున్నాయి.. శుభ గడియలు తలుపు తడుతున్నాయి.. ప్రజల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది’ అని చంద్రబాబు చెప్పారు. రాజకీయ హింసను, అక్రమ కేసులను, మోసపు హామీలను, బడుగు, బలహీనవర్గాల ఉసురు తీస్తున్న మదాన్ని.. మొత్తంగా జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో తగులబెట్టామని తెలిపారు. ‘అమరావతిపై తెచ్చిన చీకటి జీవోలను ఇక్కడే దహనం చేశాం. పేదల పరిపాలనను ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఇది నేనూ, పవన్ కల్యాణ్ కలిసి చెబుతున్న మాట.. మన రాజధాని అమరావతే. రాజధాని నిర్మాణంతోపాటు విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి పూర్వ వైభవం తీసుకొస్తాం!. రాతి యుగం పోవాలి.. స్వర్ణయుగం రావాలి..’ అని తన సంకల్పం ప్రకటించారు. భోగి రోజున పాత వస్తువులను మంటల్లో వేసి, ఆ మంటల్లో కాచిన నీళ్లతో స్నానం చేసి పాపాలు పోవాలని కోరుకున్నట్లుగా.. ఈ అసమర్థ ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోలు మంటల్లో వేసి, అది సృష్టించిన సమస్యలు పోవాలని కోరుకున్నామన్నారు. ‘అప్పులు తెచ్చి పంచడం కాదు.. సంపద సృష్టించి పంచుతాం. 2047కల్లా ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా నంబర్ వన్ అనిపించుకునేలా చేసేందుకు కృషి చేస్తా. అమరావతిలో పోలీసులు చేసిన అరాచకాలు రాక్షసులు కూడా చేసి ఉండరు. రేపటి రోజున వాళ్లే రైతులకు సెల్యూట్ చేస్తారు.. చేయిస్తా. బాత్‌రూములపై డ్రోన్లు ఎగరేయడం, పాదయాత్రకు వెళ్తే తినడానికి చోటు కూడా ఇవ్వకుండా రోడ్డుమీదకు తోసేయడం వంటి దారుణాలకు తెగించిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగేళ్లుగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి, ధైర్యానికి హ్యాట్సాఫ్. వారి గెలుపు అమరావతి గెలుపు మాత్రమే కాదు.. అది ఐదు కోట్ల ఆంధ్రుల గెలుపు. అన్నదాతల త్యాగం వృఽథా కాదు’ అని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని సూచించారు. వారు ఇకనైనా మారాలని, తమ ఉద్యోగం, కుటుంబం కోసం సంకల్పం తీసుకోక తప్పదన్నారు.
నాలుగేళ్ల కిందట పీడపట్టింది..: పవన్
నాలుగేళ్ల క్రితం ఈ రాష్ట్రానికి పీడ పట్టిందని.. ఆ పీడను ఈరోజున భోగి మంటల్లో తగులబెట్టామని పవన్ చెప్పారు. వచ్చే ఏడాది ఇదే ప్రాంతంలో జనసేన–టీడీపీ ప్రభుత్వంలో అద్భుతమైన సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటామన్నారు. ఇవి విప్లవంతో కూడిన సంక్రాంతి వేడుకలని.. ఈ సంక్రాంతితో క్రాంతులతోపాటు కొత్త కాంతులను తీసుకొస్తామని తెలిపారు. ‘టీడీపీ– జనసేన కలవడానికి అమరావతి రైతుల ఆవేదన, ఏడుపే కారణం. భూములిచ్చిన ఆడబిడ్డలకు మేం అండగా ఉంటాం. మీరు ఏ లక్ష్యంతో అయితే పొలాలు ఇచ్చారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తాను. వైసీపీ అన్ని వర్గాలనూ మోసం చేసింది. కౌలు రాలేదని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే ముళ్ల కంచెలు దాటి వచ్చాను. టీడీపీ, జనసేన కలువకూడదని వైసీపీ ఎన్నో కుట్రలు పన్నింది.. మేం కలువకుండా ఉంటే మళ్లీ అధికారంలోకి రావచ్చని జగన్ భావించాడు. తిరిగి వైసీపీ వస్తే ఏపీని మరచిపోవడమే. రాష్ట్రం చీకటైపోతుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మేం కలిసి నడుస్తున్నాం. జై అమరావతి నినాదంతో పాటు జై ఆంధ్రా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని తెలిపారు.
• రాజధానిలో 35 వేల ఎకరాలున్నాయి. అంటే రూ.3 లక్షల కోట్ల సంపద. దానిని జగన్ పాడుబెట్టాడు. ఆ భూమిని వినియోగించుకునే సంపద సృష్టించి ప్రజలకు ఇస్తా. – చంద్రబాబు
• పేరులో రైతును పెట్టుకుని రైతులను ఏమాత్రం లెక్కచేయని పార్టీ వైసీపీ. కౌలు ఇవ్వకుండా రైతులను వేధిస్తుంటే నిర్బంధాలు, ముళ్ల కంచెలు దాటి అమరావతి రైతుల కోసం వచ్చాను.
– పవన్ కల్యాణ్