Pawan Kalyan : అధికారులను బెదిరిస్తే సుమోటో కేసులు
ABN , Publish Date - Nov 11 , 2024 | 05:20 AM
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
వారిపై ఈగ వాలినా బెదిరించిన వారే బాధ్యులు
ఐపీఎస్‌లు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తప్పు.. సుమోటోగా చర్యలు
ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా ఊరుకోను
నేరగాళ్లకు కులమతాలు ఉండవు
సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలి
గతంలో సీఎం పర్యటనల పేరిట చెట్లు నరికారు
వాల్టా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం
అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక
అమరుల త్యాగాలు వృథా కానివ్వబోమని వ్యాఖ్య
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అధికారులకు ఇంకోసా రి హెచ్చరికలు వంటివి చేస్తే సుమోటోగా చర్యలు తీసుకుని, కేసులు పెడతామన్నారు. అధికారులపై ఈగ వాలినా, చిన్న గీత పడినా బెదిరింపులకు దిగిన వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రిటైర్ అయినా, సప్త సముద్రాలు దాటినా ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యల ను సుమోటోగా స్వీకరిస్తామని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఆదివారం గుంటూరులోని అరణ్యభవన్‌లో జరిగిన రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, అటవీ అమర వీరుల కుటుంబసభ్యులను సన్మానించారు. పవన్ ప్రసంగిస్తూ... ‘‘తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సప్త సముద్రాల ఆవ ల ఉన్నా వదలమని గత ముఖ్యమంత్రి అంటున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదు. కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులు ఎవరూ బెదిరింపులకు బెదిరిపోరు. 20 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని మభ్య పెట్టి గత ప్రభుత్వంలో పోలీసు అధికారులతో తప్పిదాలు చేయించారు. రోడ్డు మీద నిరసనను చూస్తున్న మహిళలపై కూడా హత్యాయత్నం కేసులు పెట్టారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పు డు పోలీసులు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా బాధ్యతగా వ్యవహరించమని కోరామే తప్ప.. ఏనాడూ అంతు చూ స్తామని మాట్లాడలేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం తప్పు. మీరు ఇంట్లో కూర్చుని రోడ్డు మీద ఆడబిడ్డల సంరక్షణ లేదని విమర్శలు చేస్తున్నారు. ఆడబిడ్డలపై దాడులు ఎప్పు డు మొదలయ్యాయి? రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉన్మాదులు ఎందుకిలా పేట్రేగిపోతున్నారు? గత ప్రభుత్వంలో పాలకులు బాధ్యతా రాహిత్యంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడేశారు.
నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం సతీమణిని తిట్టారు. ఇళ్లల్లోకి వచ్చి బిడ్డలను రేప్ చేస్తామని మాట్లాడారు. పాలించే నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడితే.. క్రిమినల్స్‌కు తప్పు లు చేసినా పర్వాలేదన్న ధైర్యం వస్తుంది. సామాజిక మార్పుతోనే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగుతాయి. నా కళ్ల ముందు ఏ ఆడబిడ్డకి ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోను. పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్ గా చూడొద్దు. నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు ఇబ్బంది పెడతారన్న ఆలోచన రాకూడదు. నేరగాళ్లకు కులమతాలు ఉండవు. ఎన్ని చట్టాలు తెచ్చి నా వాటిని అమలు చేసే వ్యక్తుల్లో చిత్తశుద్ధి లేకపోతే ఫలితం ఉండదు. నిర్భయ కేసు తర్వాత కూడా అలాం టి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలి. సంఘ విద్రోహ చర్యల కు పాల్పడి కులాల వెనుక దాక్కుంటామంటే కుదరదు. ఏ కులం అయినా, మతం అయినా తప్పు చేస్తే శిక్షించి తీరాలని ముఖ్యమంత్రి, డీజీపీకి చెప్పాం. ఆడబిడ్డల సంరక్షణకు ముందుగా చుట్టుపక్కన వారి పర్యవేక్షణ ఉండాలి. పూంచ్ సెక్టార్ మాదిరి విలేజ్ డిఫెన్స్ సిస్టం ఉండాలి. ప్రాంతాల వారీగా యువత, పెద్దల కలయిక తో డిఫెన్స్ కమిటీలు ఏర్పాటు కావాలి. విద్యాలయాల్లో నిరంతరం స్వీయ రక్షణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ అని పవన్ అన్నారు.
చెట్ల నరికివేతపై వాల్టా చట్ట ప్రకారం చర్యలు
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో రోడ్ల పక్కన చెట్లను ఇష్టారాజ్యంగా నరికేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయని, ఈ వ్యవహారంలో వాల్టా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెట్ల నరికివేతపై చర్యలు మొదలు పెడితే వైసీపీలో చాలామంది నాయకులు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుందన్నారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అటవీ అమర వీరుల త్యాగాలను వృథా కానివ్వమని చెప్పా రు. అటవీ రక్షణలో ఒక ఐఎ్‌ఫఎస్ అధికారితో పాటు 23 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
కర్మ వెంటాడుతుంది
సోషల్ మీడియాను దుర్వినియోగం చేయొద్దు: డిప్యూటీ సీఎం
కర్మ తప్పకుండా వెంటాడుతుందని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే ముందు వందసార్లు ఆలోచించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నా రు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఎక్స్ వేదికగా ఆయన సూచనలు, సలహా లు ఇచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మకమైన విమర్శలు మంచివి. అనేక విషయాలపై విభేదించవచ్చు, అసమ్మతిని వ్యక్తం చేయవచ్చు, అంతవరకే పరిమితం చేయాలి. కుటుంబాలు, వ్యక్తులు, మత విశ్వాసాలు, నిస్సహాయంగా, సౌమ్యంగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేయవద్దు. మీ దగ్గర అంగబలం, అర్థబలం, క్రిమినల్ ముఠాలున్నప్పటికీ సగటు పౌరుడిని ఎప్పటికీ బయపెట్టలేవు. గతంలో మాదిరిగా క్రిమినల్ గ్యాంగ్‌లు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవారు పోస్టులు చేసే ముందు వందసార్లు ఆలోచించాలి’ అనిపోస్ట్ చేశారు.