104 ఉద్యోగుల ఆందోళన
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:42 PM
సమస్యల పరిష్కారం కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సమస్యల పరిష్కారం కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ 104 ఉద్యోగుల విషయంలో అరబిందో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. వారిని బానిసలుగా చూస్తున్నదని మండిపడ్డారు. కనీస వేతనాలు ఇవ్వకపోగా ప్రభుత్వం అంగీకరించిన స్లాబ్ సిస్టం అమలు చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్, ఈఎ్‌సఐలలో యాజమాన్యం వాటా కట్టకుండా మోసం చేసిందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ సొమ్మును రికవరీ చేసి కార్మికుల ఖాతాలో జమచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే కొత్త ఉద్యోగాలలో 104 సిబ్బందికి వెయిటేజ్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 104 ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి కె.రవివర్మ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ నెలరోజులుగా వివిధ పద్ధతుల్లో ఆందోళనలు చేస్తున్నా అరబిందో యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం దారుణంగా ఉందన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో శ్రీధర్‌రెడ్డి, నరేంద్ర, సుబ్బయ్య, శ్రీకాంత్, ఉదయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్వేత, స్వాతి, పావని తదితరులు పాల్గొన్నారు.