Share News

2024 భలే మార్పు

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:51 AM

జిల్లా ఏర్పాటు అనంతరం పరిశీలిస్తే ఈ ఏడాది రాజకీయంగా చాలా ప్రత్యేకమైంది. రమారమి రెండు దశాబ్దాల అనంతరం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్తి ఆధిక్యం లభించగా ఒంగోలు లోక్‌సభ లాంటి స్థానంలో 25 ఏళ్ల అనంతరం ఆపార్టీ జెండా ఎగిరింది. అదేసమయంలో అనూహ్య పరాజయాలతో వైసీపీ పునాదులు కూడా కదిలిపోయాయి.

2024 భలే మార్పు
మార్కాపురంలో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పక్కన మాగుంట, కందుల (ఫైల్‌)

తారుమారైన రాజకీయం

అనూహ్య విజయాలు కూటమి సొంతం

టీడీపీకి పూర్తి ఆధిక్యం

వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ

పట్టు కోల్పోయిన ఆ పార్టీ నేతలు

కీలక నాయకులకు కలసిరాని కాలం

మారిన పాలన తీరుతెన్నులు

గాడిలో అన్ని వ్యవస్థలు

పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యం

రాజకీయం పూర్తిగా మారింది. ఈ ఏడాదిలో పాలకులే కాదు పాలన తీరుతెన్నులు కూడా మారిపోయాయి. నేతల్లో కొందరికి చేదు అనుభవాలు ఎదురైతే మరికొందరికి రాజసం దక్కింది. ఇంకొందరిని అదృష్టదేవత వరించింది. తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ పుటల్లో 2024 ప్రత్యేక స్థానాన్ని పొందగలిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడాది ఆరంభం (వైసీపీ పాలన చివర్లో) ప్రజలను భయకంపితులను చేసిన భూఆక్రమణలు, రాజకీయ పైరవీలు, అక్రమ కేసులు, రౌడీయిజం లాంటివి కనుమరుగై సహజసిద్ధమైన పాలన వచ్చింది. వ్యవస్థలన్నీ గాడిలో పడ్డాయి. ఇందుకు పోలీసు శాఖ నిదర్శనం. తారుమారైన రాజకీయ నాయకుల చరిత్రలు, అంతకుమించి పాలక పక్షంలో జిల్లాకు అత్యధిక పదవులు దక్కడం ముఖ్యమైన రాజకీయ ఘట్టాలుగా చెప్పుకోవచ్చు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లా ఏర్పాటు అనంతరం పరిశీలిస్తే ఈ ఏడాది రాజకీయంగా చాలా ప్రత్యేకమైంది. రమారమి రెండు దశాబ్దాల అనంతరం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్తి ఆధిక్యం లభించగా ఒంగోలు లోక్‌సభ లాంటి స్థానంలో 25 ఏళ్ల అనంతరం ఆపార్టీ జెండా ఎగిరింది. అదేసమయంలో అనూహ్య పరాజయాలతో వైసీపీ పునాదులు కూడా కదిలిపోయాయి. 1983-85, 94నాటి విజయాల కన్నా ఈ ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో టీడీపీకి లభించిన గెలుపు ఘనమైనదంటే అతిశయోక్తి కాదు. అలాగే పులివెందుల తరహా పటిష్టమైనదిగా భావించిన ఒంగోలు లోక్‌సభ స్థానంలో, గత ఎన్నికల్లో 80వేలకు పైన ఆధిక్యం సాధించిన గిద్దలూరు అసెంబ్లీలో వైసీపీ కలలో కూడా ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కొంది. నాయకులుగా చాలామందికి ఈ ఏడాది కలిసిరాగా.. కరణం బలరాం, బాలినేనిలాంటి కీలక నేతలు పరాజయం పాలయ్యారు. జిల్లాతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్న మాగుంట కుటుంబ వారసుల్లో ఒకరైన మాజీ ఎంపీ పార్వతమ్మ కన్నుమూయడం విషాదం. అదే కుటుంబానికి చెందిన శ్రీనివాసులరెడ్డికి అదృష్టం కలిసొచ్చి మళ్లీ పార్లమెంట్‌కు వెళ్లగలిగారు. దామచర్ల సత్య, బాలాజీ, దినకర్‌, మర్రెడ్డి, విజయ్‌కుమార్‌లాంటి ఎందరో అధికార అందలం ఎక్కగలిగారు. గొట్టిపాటి రవి, స్వామిలు అమాత్యులుగా, జిల్లాలో కీలక నాయకులుగా మారారు. కొత్తగా శాసనసభలో అడుగుపెట్టాలని తహతహలాడిన ఒకరిద్దరిని అదృష్టం వరించగా కొందరిని దురదృష్టం వెంటాడింది

మారిన పరిస్థితులు

ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్‌ ప్రాంతాల్లో భూఆక్రమణలు.. వాటిపై సిట్‌ ఏర్పాటు, వేధింపులు, గ్రానైట్‌ రంగంలో కడప నుంచి జిల్లాకు దిగుమతి అయిన జగన్‌ గ్యాంగ్‌ ఆగడాలు, ప్రజాప్రతినిధుల హంగూ ఆర్భాటాలు ఈ ఏడాది ప్రారంభంలో కనిపిం చిన దృశ్యాలు. ఈ ఏడాది మేలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పుతో ఆ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అక్రమ కేసులు లేవు. హత్యలు లేవు. రాజకీయ వేధింపులు లేవు. భూఆక్రమణలు కనిపించడం లేదు. వెరసి రాజకీయ వేధింపుల నుంచి విముక్తితో ప్రజలు, ఉద్యోగులకు ప్రశాంత జీవితం ప్రారంభమైంది. గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. గతప్రభుత్వ వేధింపులతో ఇబ్బందుల్లో ఉన్న గొట్టిపాటి రవికుమార్‌, స్వామి మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలవడమే కాక ప్రాధాన్యం కలిగిన శాఖలకు మంత్రులయ్యారు. ముఖ్యమంత్రికి నమ్మకస్థులుగా మనగలుగుతున్నారు.

పదవుల్లో జిల్లాకు ప్రాధాన్యం

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పాలక పదవులు ఉమ్మడి జిల్లాకు అధికంగా దక్కాయి. ఉమ్మడి జిల్లాలో ఇద్దరికీ అందునా కీలకమైన టీడీపీ నుంచే మంత్రి పదవులు దక్కడమే విశేషంగా భావించారు. ఆ తర్వాత నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో తొలి జాబితాలోనే నాలుగు కీలకమైన కార్పొరేషన్లు లభించాయి. దామచర్ల సత్య, లంకా దినకర్‌ లాంటి వారు తొలిసారిగా ప్రభుత్వ పదవులను అలంకరించగలిగారు.

గెలిచినా కలిసిరాని కాలం

ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకించి టీడీపీలో గెలిచినా పర్చూరు, ఒంగోలు ఎమ్మెల్యేలకు కాలం కలిసిరాలేదు. ముఖ్యంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్‌ విజయం సాధించడంతోపాటు గడిచిన ఐదేళ్లు బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బండిని ముందుకు లాగారు. కానీ ఆయన ఎమ్మెల్యేగానే మిగిలారు. ఆ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులయ్యారు. ప్రకాశం జిల్లాలో క్లిష్ట సమయంలో పార్టీ బాధ్యతలు మోసిన దామచర్ల జనార్దన్‌ ఒంగోలు ఎమ్మెల్యేగా మంచి విజయం సాధించినా ఇతర పదవులు దక్కలేదు.

మాగుంటను వరించిన అదృష్టం

అప్పట్లో కాంగ్రెస్‌కు, ప్రస్తుతం వైసీపీకి పులివెందుల తర్వాత ఆస్థాయిలో ఒంగోలు లోక్‌సభ స్థానం బలమైనదిగా పేరుంది. అందునా మాగుంట కుటుంబం నుంచి శ్రీనివాసులరెడ్డి ఎంపీగా ఉండటం కూడా కలిసొచ్చింది. కానీ జగన్‌ చేసిన పొరపాటో, మాగుంట అదృష్టమో గాని వైసీపీ టికెట్‌ నిరాకరణతో ఆయన టీడీపీలో చేరారు. కూటమి పార్టీల వేవ్‌లో రెండున్నర దశాబ్దాల అనంతరం టీడీపీ తరఫున ఆయన గెలవడం విశేషం.

ఉగ్ర, అశోక్‌లకు గుర్తింపు

తెలుగుదేశం పక్షాన కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసిం హారెడ్డి, అశోక్‌రెడ్డిల గెలుపులకు మంచి గుర్తింపు లభించింది. నిజానికి ఆ ఇద్దరు పోటీ చేసిన స్థానాలు వైసీపీకి బలమైనవైనప్పటికీ టీడీపీ గెలుపులో కూటమి పార్టీల అనుకూల వాతావరణంతోపాటు ఆ ఇద్దరు నాయకుల వ్యక్తిగత కృషి దాగుందనే విషయాన్ని అధిష్ఠానం గుర్తించి ప్రోత్సహించింది.


బాలినేని, కరణం, ఆదిమూలపులకు కలిసిరాలేదు

బాలినేని, కరణం, ఆదిమూలంకు కలిసిరాని కాలంగా చెప్పవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్‌కు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం కూడా దక్కలేదు. వివిధ రకాలుగా ఆయా సందర్భాల్లో జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని ఈ ఏడాది ఆరంభానికి ఎమ్మెల్యేలుగా ఉన్న కరణం బలరాంలు మాజీలయ్యారు. మాజీ మంత్రి మహిదర్‌రెడ్డికి తాను అంటిపెట్టుకున్న వైసీపీలో పోటీచేసే అవకాశమే దక్కలేదు. గతంలో రాష్ట్రంలో రెండో ఘనవిజయం సాధించిన అన్నా రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఎక్కడ నుంచో వచ్చి ఒంగోలు లోక్‌సభకు పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పరాజయం పాలయ్యారు. అనుహ్యంగా టికెట్‌ దక్కించుకున్న చంద్రశేఖర్‌కు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందటం అదృష్టమే. గతంలో పలు చేదు అనుభవాలను ఎదుర్కొన్నఎంఎం కొండయ్య యాదవ్‌ చీరాల ఎమ్మెల్యే అయ్యారు. చివర్లో టికెట్‌ దక్కించుకున్న ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నుంచి ఎమ్మెల్యే కాగలిగారు. క్లిష్టమైన నియోజకవర్గంలో అదృష్టాన్ని పరిక్షించుకున్న యువనాయకులు ఎరిక్షన్‌బాబు, కుటుంబ నేపథ్యంతో రంగంలోకి వచ్చిన గొట్టిపాటి లక్ష్మిలకు అదృష్టం కలిసికాక ఓటమిపాలయ్యారు.

అస్తమించిన పార్వతమ్మ

జిల్లాలో ప్రత్యేకించి ఒంగోలు లోక్‌సభలో తమదైన ముద్ర వేసుకున్న మాగుంట కుటుంబ తొలి వారసురాలు దివంగత ఎంపీ సుబ్బరామరెడ్డి సతీమణి పార్వతమ్మ ఈఏడాదిలోనే అస్తమించారు.

Updated Date - Dec 31 , 2024 | 01:51 AM