Share News

గ్రీవెన్స్‌ డే వెలవెల

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:11 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొట్టడంతో వెలవెలబోయింది. తహసీల్దార్‌ కవిత ఒక్కరే విధులకు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ డే వెలవెల

పలు శాఖల అధికారులు గైర్హాజరు

డుమ్మాకొట్టినవారిపై చర్యలు : తహసీల్దార్‌

బల్లికురవ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొట్టడంతో వెలవెలబోయింది. తహసీల్దార్‌ కవిత ఒక్కరే విధులకు పాల్గొన్నారు. మిగిలిన అధికారులు హాజరు కాలేదు. సుదూర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సంబంధిత శాఖల అధికారులు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇటీవల అధికారులు హాజరుకావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని, ఎవరూ సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా ఎంతో విలువైన గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో అందరు అధికారులు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

హాజరుకానివారిపై కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం

గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కాకపోయినా, విధులకు డుమ్మా కొట్టినా వారిపై కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని తహసీల్దార్‌ కవిత తెలిపారు. వచ్చే వారం నుంచి అందరు అధికారులు హాజరయ్యేలా చర్యలు చేపడతామన్నారు. సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెస్తే సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Dec 02 , 2024 | 11:11 PM