వ్యవసాయ పనులు ముమ్మరం
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:05 AM
జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు, కూలీలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు తెరపి ఇవ్వడంతో పంటల్లో అంతరసేద్యం, కోతకు వచ్చిన పంట కోతలు, కలుపుతీత, తెగుళ్ల నివారణ మందుల పిచికారీ, ఇంకా వేయాల్సిన పంటల సాగు తదితర పనులు జోరందుకున్నాయి.
బిజీబిజీగా రైతులు, కూలీలు
జోరుగా ఖరీఫ్ పంటల కోతలు
రబీ పైర్లలో పురుగు నివారణ, కలుపుతీత పనులు
విస్తారంగా పొగాకు, శనగ, ఇతర పంటల సాగు
ఒంగోలు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు, కూలీలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు తెరపి ఇవ్వడంతో పంటల్లో అంతరసేద్యం, కోతకు వచ్చిన పంట కోతలు, కలుపుతీత, తెగుళ్ల నివారణ మందుల పిచికారీ, ఇంకా వేయాల్సిన పంటల సాగు తదితర పనులు జోరందుకున్నాయి. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్ పంటల్లో మూడొంతులు కోత దశకు, రబీ పైర్లు విత్తడం పూర్తవుతుంది. ఈఏడాది రెండు సీజన్లలోనూ ఒకింత జాప్యం జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో సరైన వర్షాలు లేక పంటల సాగు ఆలస్యమైంది. నవంబరులో ఒకసారి, ఈనెల తొలి వారంలో మరోసారి విస్తారంగా వర్షాలు కురిసి రబీ సాగు జాప్యమైంది. ప్రస్తుతం వర్షాలు తెరపి ఇవ్వడంతో ముమ్మరంగా పంటలు వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో సుమారు లక్షా 62వేల హెక్టార్లలో పంటలు వేశారు. అత్యధికంగా 70వేల హెక్టార్లలో కంది సాగు చేశారు. 22వేల హెక్టార్లలో మిర్చి, 13వేల హెక్టార్లలో పత్తి, పది వేల హెక్టార్లలో వరి వేశారు. ఇతర పంటలు ఒక మోస్తరుగా సాగయ్యాయి. ప్రస్తుతం ముందుగా వేసిన వరి పంట కోతలు, నూర్పిళ్లు జరుగుతున్నాయి. త్రిపురాంతకం, దర్శి ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది. కంది కాయదశకు చేరుకోగా.. పత్తి తీతలు, మిర్చి పచ్చికాయల కోతలు జరుగుతున్నాయి. ఇక రబీ సీజన్‌లో ఇప్పటి వరకూ సుమారు 65వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంటలు వేశారు. అందులో అత్యధికంగా పొగాకు, శనగ, మినుము ఉన్నాయి. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 20వేల హెక్టార్లలో పొగాకు, 15వేల హెక్టార్లలో శనగ, పదివేల హెక్టార్లలో వరి, పదివేల హెక్టార్లలో మినుము, 4వేల హెక్టార్లలో మిర్చి, 6వేల హెక్టార్లలో ఆలసంద సాగు చేశారు. ఈ పొలాల్లో ఇటీవల వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగింది. అన్ని స్థాయిల్లోని ఇంచుమించు అన్ని పంటల్లో తెగుళ్లు, పురుగుల దాడి పెరిగింది. దీంతో రైతులు కలుపుతీతలు, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు శనగ పంటలలో ఇడుపులు, లేతపైరు దెబ్బతింటే తిరిగి వేయడం చేస్తున్నారు. తాజాగా పొగాకు, మిర్చి నాట్లు వేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.