Share News

మద్యం మాకే!

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:14 AM

ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించే లిక్కర్‌పై వైసీపీ నాయకుల ఎత్తులు.. కుయుక్తులు ఆరంభమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత కూడా యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారు ఈ విషయంలోనూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అధికారదర్పం ప్రదర్శిస్తున్నారు.

మద్యం మాకే!

ప్రభుత్వ వైన్‌ షాపుల సిబ్బందికి వైసీపీ నేతల హుకుం

ప్రత్యర్థి పక్షం వారికి అమ్మితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు

మేము కోరిన బ్రాండ్లు తెప్పించాలి.. అడిగినంత సరుకు ఇవ్వాలి!

ఎన్నికల వేళ ఎక్కడికక్కడ భారీగా నిల్వలు

దుకాణాల నుంచి నేరుగా గ్రామాలకు సరఫరా

ఇతర రాష్ట్రాల నుంచీ పెద్దఎత్తున దిగుమతి

లిక్కర్‌ కోసం ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్లు వెచ్చించేందుకు సిద్ధం

కొన్నిచోట్ల అదనంగా నాటుసారా, కల్లు

ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించే లిక్కర్‌పై వైసీపీ నాయకుల ఎత్తులు.. కుయుక్తులు ఆరంభమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత కూడా యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారు ఈ విషయంలోనూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అధికారదర్పం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల నుంచి మద్యాన్ని తమకే విక్రయించాలని, ప్రత్యర్థిపక్షం వారికి అమ్మితే ఖబడ్దార్‌ అంటూ సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. తదనుగుణంగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ప్రభుత్వ దుకాణాల నుంచి నేరుగా గ్రామాలకు మద్యం పంపి నిల్వచేసే ప్రక్రియకు శ్రీకారం పలికారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, సొంత పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రగిలించుకునేందుకు అభ్యర్థులు మద్యాన్ని పంపిణీ చేసే విషయం జగమెరిగిన సత్యం. ఈ పర్యాయం కూడా మద్యం కోసం ఉమ్మడి జిల్లాలో రమారమి రూ.100 కోట్లకుపైన వెచ్చించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రూ.50 కోట్ల మేర అడ్వాన్స్‌లు కూడా చెల్లించగా, కొన్నిచోట్ల అక్రమ నిల్వలు కూడా ప్రారంభమయ్యాయి.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఎన్నికలలో గత రెండు దశాబ్దాలుగా లిక్కర్‌ పాత్ర కీలకంగా మారింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభకు జనసమీకరణలో మద్యం ప్రభావం ఏస్థాయిలో ఉందో స్పష్టమైంది. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, అలాగే ఆయా ప్రాంతాల్లో పార్టీశ్రేణులు నిత్యం ఓటర్లను ఆకట్టుకునే ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ఆయా పోలింగ్‌ కేంద్రాల వారీ మద్యం బాటిళ్లు సరఫరా చేయడం గత కొన్ని ఎలక్షన్స్‌ నుంచి అధికమైంది. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే.. మద్యం సేకరణకు ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ప్రయత్నాలు చేస్తునట్లు వెల్లడైంది. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు, జిల్లాతో సంబంధం ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. విపక్ష తెలుగుదేశం పార్టీ దర్శి మినహా మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్‌లతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. దీంతో వారు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అవసరమైన ఎన్నికల ప్రచార సామగ్రిని సమకూర్చుకోవడంతోపాటు లిక్కర్‌ కొనుగోలుకు పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రభుత్వ దుకాణాల్లోనే అసలు తంతు

ప్రభుత్వ వైన్‌షాపుల్లో మద్యం విక్రయానికీ ఎన్నికల కోడ్‌కు సంబంధం లేదు. పైగా ప్రభుత్వ దుకాణాలకు అవసరమైన మద్యంను తీసుకునేందుకు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఏరోజుకారోజు పెద్దమొత్తంలో ఆర్డర్‌ పెట్టి మద్యం తెప్పించుకొని విక్రయించుకునే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి ఆ వైపు మళ్లింది. ఇక్కడే అధికారపార్టీ నేతలు తమ పవర్‌ చూపుతున్నారు. షాపుల్లో పనిచేసే ఉద్యోగులను పిలిచి మేము చెప్పిన ప్రకారం, మేము అడిగిన కంపెనీ మద్యాన్ని ఎక్కువగా తెప్పించి మేము పంపిన వ్యక్తులకే ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అంతేకాక ఆ మండలంలోని ఆయా గ్రామాలకు నేరుగా సరఫరా చేయాలని కూడా కొన్నిచోట్ల ఆదేశాలు ఇచ్చారు. బెల్టుషాపులకు సరఫరా చేసినట్లే ఆయా గ్రామాల్లో మేము చెప్పిన వారికే మద్యం కేసులు చేరవేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఇటీవల ఒక వైసీపీ సమావేశంలో ఆ పార్టీ కీలక నేత ‘మీ గ్రామాలకే మద్యం వస్తుంది. మద్యం దుకాణాల వారు ఇప్పటి నుంచి మే 13వ తేదీ వరకు మనం చెప్పిన వారికే విక్రయిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగిపోయాయి. నిశ్చింతగా ఉండండి’ అంటూ ఆ పార్టీశ్రేణులను చెప్పడం గమనార్హం.

అధికార పార్టీ నేతల ‘మందు’చూపు

లిక్కర్‌ కొనుగోలు విషయంలో పలుచోట్ల వైసీపీ నేతలు, అభ్యర్థులు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ల యజయినుతు భారీగా మద్యం తెప్పించుకొని ఆయా పార్టీలకు అమ్ముకునే అవకాశం ఉంది. అయితే బార్ల నిర్వాహకులు ముందుగా డబ్బులు కట్టి మద్యం తెచ్చుకోవాలి. అలా వచ్చిన మద్యానికి సంబంధించి రోజువారీ విక్రయించిన వివరాలను అధికారులకు చూపించాలి. దీంతో ఎన్నికల సమయంలో పోటీకి సిద్ధమని ముందే నిర్ధారించుకున్న అభ్యర్థులు కొన్ని షాపుల వారికి డబ్బులు చెల్లించి అధికమొత్తంలో లిక్కర్‌ తెప్పించుకోగలిగారు. అలా వచ్చిన మద్యాన్ని రోజువారీ సేవించే వారికి విక్రయిస్తునట్లు చూపిస్తున్న యజమానులు దాన్ని వారు ఒప్పందం కుదుర్చుకున్న అభ్యర్థులకు సరఫరా చేశారు. కొందరు బార్ల యజమానులైతే మద్యంను వారి వద్ద అక్రమంగా నిల్వ ఉంచి అభ్యర్థులు కోరిన ప్రకారం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్లిప్పు చూపిస్తే సరుకు

ఆయా బార్లలో మద్యం కొనుగోలు చేసిన అభ్యర్థులు పార్టీశ్రేణులకు స్లిప్పులు ఇస్తే వాటిని చూపించి బార్ల నుంచి మద్యం తీసుకెళ్లే విధంగా ప్లాన్‌ చేశారు. ఈ ప్రక్రియ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కార్పొరేషన్‌ అయిన ఒంగోలు, మునిసిపాలిటీలు అయిన మార్కాపురం, కందుకూరు చీరాల, నగర పంచాయతీలైన గిద్దలూరు. కనిగిరి, దర్శి, చీమకుర్తి, అద్దంకి తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి కోడ్‌ అమల్లోకి వచ్చేవరకు బార్లకు ప్రభుత్వం అడిగినంత లిక్కర్‌ కూడా సరఫరా చేసింది. అయితే కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత బార్లకు ఎడాపెడా మద్యం సరఫరా చేయకుండా నియంత్రించింది. జిల్లాలో బార్ల నిర్వాహకుల్లో అన్ని పార్టీల మద్దతుదా రులు ఉన్నా రు. రాజకీ యంగా సంబంధం లేని వారూ ఉన్నారు. వ్యాపార వ్యవహారం కాబట్టి అధికారపార్టీ వారికి పెద్ద మొత్తంలో సరఫరా చేసినా ఇతర పార్టీల వారికి అంతో ఇంతో మద్యంను విక్రయించారు.

పశ్చిమప్రాంతంలోనూ భారీగానే కొనుగోలు

ఇప్పటి నుంచి మే 13వ తేదీ పోలింగ్‌ జరిగే రోజు వరకు మద్యం కోసం అభ్యర్థులు ఎంతో కొంత వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. ఓటింగ్‌కు చివరి వారంరోజులు పోలింగ్‌ కేంద్రాల వారీ మద్యం సరఫరా చేసేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో ఒక పార్టీ రూ.4.00కోట్ల విలువైన మద్యం కొనుగోలుకు డబ్బులు చెల్లించింది. అదేసమయంలో అధికారపక్షానికి సంబంధించి రూ.6.00 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఏర్పాట్లు జరిగిపోయాయి. చివరకు అభ్యర్థుల ఎన్నికల వ్యయం తక్కువగా ఉంటుందని భావిస్తున్న పశ్చిమప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రూ.4కోట్లకుపైగా మద్యం సరఫరాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఒక ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో అధికారపార్టీ పక్షాన రూ.3కోట్లకు, విపక్ష పార్టీ నుంచి రూ.1.65 కోట్లు మద్యానికి వెచ్చిచేందుకు సిద్ధమయ్యారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా..

విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ర్టాల మద్యం దిగుమతి ఒక క్రమపద్ధతిలో జరిగిపోయింది. ఇటు తెలంగాణ, అటు కర్ణాటక.. ఇంకోవైపు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ర్టాల నుంచి ముందుగానే మద్యం సేకరించుకున్న కొందరు ప్రస్తుతం అభ్యర్థులకు అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మేదరమెట్ల సమీపంలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభకు జిల్లా నలుమూలల నుంచి వెళ్లిన ప్రతి వాహనంలో మద్యం ఏరులై పారడం కనిపించింది.

ఇప్పటికే కొన్ని గ్రామాలకు చేరిన మద్యం

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోని గ్రామాలకు మద్యం కేసులు చేర్చి నిల్వ పెడుతున్నారు. ఆ మండలంలోని ప్రభుత్వ వైన్‌షాపుల నుంచే ఈ మద్యం గ్రామాలకు చేరి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిల్వ చేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలో ఈ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. కాగా ఆయా మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యర్థిపక్షం వారు మద్యం అడిగితే విక్రయించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్నిచోట్ల వారికి అడపాదడపా మద్యం ఇస్తున్నారు. చాలా షాపుల నుంచి వైసీపీ వారికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తూ టీడీపీ పక్షం వారికి రహస్యంగా విక్రయిస్తున్నారు. అందుకు గాను ఒక్కో మద్యం కేసుపై రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేసి లబ్ధి పొందుతున్నారు.

రూ.100 కోట్ల విలువైన మద్యం సరఫరాకు సిద్ధం

నాటుసారా, కల్లు లాంటి మత్తు పానీయాలను కూడా అవకాశం ఉన్న మేరకు సేకరించి సరఫరా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నియోజకవర్గాల వారీ సరాసరిన ఒక్కో అభ్యర్థి రూ.3.5కోట్ల ప్రకారం మద్యం కొనుగోలుకు సిద్ధం కాగా, అధినేతల ఎన్నికల ప్రచార సభల సమయంలో సరఫరా చేసే మద్యం వ్యయం అదనం. అలా మొత్తంగా అసెంబ్లీ లేక పార్లమెంట్‌ అభ్యర్థుల పక్షాన ఒక్కో పార్టీ రూ.4కోట్లకు పైనే మద్యం కోసం ఖర్చుచేయనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీలు కేవలం మద్యం కోసమే రూ.100 కోట్లు వెచ్చించబోతున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 01:14 AM