Share News

అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:42 AM

నామినేటెడ్‌ పదవుల విషయంలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అలాగే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు జనసేన, బీజేపీలను కూడా కలుపుకుపోయి అవసరమైన మేరకు వారికీ పదవులు కేటాయించాలనుకున్నారు.

అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యం

మిత్రపక్షాలకు కూడా నామినేటెడ్‌ పదవులపై టీడీపీ నేతల విస్తృత చర్చ

వెలిగొండ ప్రాజెక్టు, పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ పీఠంపై ప్రధాన సమీక్ష

రేపు అమరావతిలో భేటీ, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం

ఒంగోలులో సమావేశమైన మంత్రులు, శాసనసభ్యులు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

నామినేటెడ్‌ పదవుల విషయంలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అలాగే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు జనసేన, బీజేపీలను కూడా కలుపుకుపోయి అవసరమైన మేరకు వారికీ పదవులు కేటాయించాలనుకున్నారు. ప్రధానంగా సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవిపైన, వెలిగొండ నిర్మాణ పనులపైన సమీక్షించుకున్న నేతలు అమరావతిలో సమావేశం కావాలని, అవకాశం దొరికితే సీఎంను కలవాలని తీర్మానించుకున్నారు. ఉమ్మడి ప్రకాశంకు చెందిన ఇద్దరు మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, స్వామిలతోపాటు అందుబాటులో ఉన్న ఎమ్యెల్యేలు మంగళవారం మధ్యాహ్నం ఒంగోలులోని ఎమ్మెల్యే జనార్దన్‌ ఇంట్లో సమావేశమయ్యారు. మంగళవారం జరిగిన జడ్పీ సమావేశానికి మంత్రులతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సోమవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో నేతలంతా మాట్లాడుకుని జడ్పీ సమావేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే జనార్దన్‌ ఇంట్లో మంత్రులు రవికుమార్‌, స్వామిలతోపాటు ఎమ్మెల్యేలు జనార్దన్‌, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌లు భేటీ అయ్యారు. డ్రోన్‌ సమ్మిట్‌ పనుల్లో ఉన్న ఎమ్మెల్యే సాంబశివరావు అందుబాటులో లేని విజయ్‌కుమార్‌, కొండయ్యలు హాజరుకాలేదు.

పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ పదవిపై ప్రధాన చర్చ

నామినేటెడ్‌ పదవుల అంశంపై ప్రధాన చర్చ జరిగింది. అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజికవర్గాల వారికీ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు మంత్రులతోపాటు కొత్తగా వచ్చిన కార్పొరేషన్‌ పదవులు కూడా తూర్పు ప్రాంతానికే దక్కాయి. దీంతో భవిష్యత్తులో నామినేటెడ్‌ పదవుల విషయంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలని ఉగ్ర ప్రతిపాదించారు. ఆ వెంటనే మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు ఇంతవరకూ ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని, కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు. జిల్లాస్థాయిలో సెంట్రల్‌ బ్యాంక్‌, డీసీఎంఎస్‌, కోల్‌ సొసైటీ, పొగాకు సమాఖ్య, వక్ఫ్‌బోర్డు, గ్రంథాలయం, ఓడా చైర్మన్‌ తదితర పదవులపై చర్చ జరిగింది. వీటిని అన్ని ప్రాంతాలు, సామాజికవర్గాలకు అవకాశం కల్పించేలా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు. అదేసమయంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన, బీజేపీల అంశం కూడా చర్చకొచ్చింది. ఆ పార్టీ నేతలతో కూడా చర్చించి రాష్ట్ర పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వారికి అవకాశాలు ఇచ్చి ముందుకుపోవాలని నిర్ణయించుకున్నారు. మంత్రులు రవి, స్వామిలు చేసిన ప్రతిపాదనలకు మిగిలిన వారు అంగీకారం తెలిపారు.

వెనక్కివచ్చే ప్రసక్తే లేదు

ఈ సందర్భంగా సెంట్రల్‌ బ్యాంక్‌ పదవిపై వారి మధ్య చర్చ సాగినట్లు తెలిసింది. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌ ఇప్పటికే డాక్టర్‌ సీతారామయ్య పేరును ఆ పదవికి ప్రతిపాదించారు. ఆయనతోపాటు కొత్త ప్రకాశం జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ఆయన సిఫార్సు లేఖపై సంతకాలు చేయగా, మంత్రి రవి, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావులు అందరితో మాట్లాడి నిర్ణయిద్దామంటూ సంతకాలు చేయలేదని తెలిసింది. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా ఆయన్ను నియమిస్తే ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు చేసుకోగలరా? అని ఉగ్ర ప్రశ్నించినట్లు తెలిసింది. దామచర్ల అందుకు ఆయన సిద్ధం అని చెప్పగా మంత్రి రవి జోక్యం చేసుకుని మీరు చెప్పండని సీతారామయ్యను అడిగినట్లు సమాచారం. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని, ఎన్నికలు వచ్చినా తాను అన్నివిధాలా సిద్ధమేనని డాక్టర్‌ సీతారామయ్య చెప్పినట్లు తెలిసింది. అలాగైతే తమకు ఇబ్బందిలేదని, సమావేశంలో ఎక్కువమంది మద్దతు ఇచ్చినట్లు సమాచారం. మంత్రి రవి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ మరికొందరు ఎమ్మెల్యేలు లేనందున గురువారం అమరావతి ప్రాంతంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుందామని, అక్కడికి డాక్టర్‌ కూడా రావాలని చెప్పినట్లు తెలిసింది.

వెలిగొండపై పట్టు

వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని, ఈ విషయమై ప్రభుత్వం స్పందించకపోవడంతో పశ్చిమప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. తక్షణం పనులపై ఉన్నత స్థాయిలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వెంటనే రవికుమార్‌, స్వామి నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడుకు ఫోన్‌ చేసి ఆ విషయంపై మాట్లాడారు. ఈ విషయాన్ని సీఎం వద్ద చర్చించాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా మిగిలిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు కూడా ఉంటే బాగుంటుందని భావించి గురువారం అమరావతిలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధలు, ఇన్‌చార్జిలు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సీఎంను కలవాలని కూడా తీర్మానించారు.

Updated Date - Oct 23 , 2024 | 01:42 AM