Share News

అన్నీ సమకూర్చితే ప్రైవేటు కన్నా మిన్న

ABN , Publish Date - Nov 14 , 2024 | 10:46 PM

చీరాల ఏరియా వైద్యశాల పలు ప్రైవేటు ఆసుపత్రులకన్నా మిన్నగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ అనివార్యం. దీంతో పాటు వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల ప్రేమతో మెలగాలి. సేవా భావం ఉండాలి. రాజకీయ నాయకులు, మీడియా తదితర సిఫార్సులను ఒకింత పక్కన పెట్టాలి. అందుకు సంబంధీకులకు స్వీయ నియంత్రణ ఉండాలి. ఆసుపత్రికి వచ్చిన రోగి వ్యాధిని బట్టి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఏరియా వైద్యశాలపై ఉన్న అపోహలు తొలుగుతాయి. నిరుపేదలకు పారదర్శమైన వైద్యసేవలు అందుతాయి. అందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అన్నీ సమకూర్చితే  ప్రైవేటు కన్నా మిన్న

చీరాల ఏరియా వైద్యశాలలో ఖాళీ పోస్టుల భర్తీ అనివార్యం

ఉన్న వనరులను వినియోగించుకోవాలి

అదనపు వనరులను సమకూర్చుకోవాలి

అవినీతి ఆరోపణలకు చెక్‌ చెప్పాలి

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ క్రియశీలకంగా వ్యవహరించాలి

సిఫార్సులను కాస్త పక్కన పెట్టాలి

చీరాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : చీరాల ఏరియా వైద్యశాల పలు ప్రైవేటు ఆసుపత్రులకన్నా మిన్నగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ అనివార్యం. దీంతో పాటు వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల ప్రేమతో మెలగాలి. సేవా భావం ఉండాలి. రాజకీయ నాయకులు, మీడియా తదితర సిఫార్సులను ఒకింత పక్కన పెట్టాలి. అందుకు సంబంధీకులకు స్వీయ నియంత్రణ ఉండాలి. ఆసుపత్రికి వచ్చిన రోగి వ్యాధిని బట్టి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఏరియా వైద్యశాలపై ఉన్న అపోహలు తొలుగుతాయి. నిరుపేదలకు పారదర్శమైన వైద్యసేవలు అందుతాయి. అందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

100 పడకల ఆసుపత్రి.. కార్మికుల కొరత

చీరాల ఏరియా వైద్యశాల 100 పడకల ఆసుపత్రి. అయితే అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది, కార్మికుల కొరత వెంటాడుతోంది. వైద్యుల భర్తీ త్వరలో జరుగుతుందని చెప్తున్నారు. ఇదిలావుంటే సెక్యూరిటీ, శానిటేషన్‌కు సంబంధించి గతంలో 50 పడకల అసుపత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు అదే సంఖ్య కొనసాగుతోందని చెప్తున్నారు. ఆ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకు ఉన్నతాధికారులు చొరవ చూపాలి.

వైద్యులు..విధులు

వైద్యులు ఉదయం 9 గంటలకు విధుల్లో చేరాలి. సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 9 గంటల వరకు ఒక డ్యూటీ డాక్టర్‌ ఉంటారు. 10 రోజులకు ఒకసారి ఒకరి వంతు వస్తుంది. డ్యూటీ డాక్టర్‌ సమయంలో ఏదన్నా ఎమర్జెన్సీ కేసు వస్తే, సంబంధిత డాక్టరుకు సమాచారం తెలిపి పిలిపించి వైద్యం చేయించాలి. తప్పనిసరి పరిస్థితి అయితే వేరే ఆసుపత్రికి రిఫర్‌ చేస్తారు.

పోస్టుమార్టం.. ఆరోపణలు

పోస్టుమార్టం సాధారణంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేయాలి. ప్రత్యేక సందర్భాల్లో సూర్యాస్తమయం తరువాత పోస్టుమార్టం చేయాల్సివస్తే ఆర్డీవో అనుమతి అవసరం. సాధారణంగా డ్యూటీ డాక్టర్‌ ఎవరైతే ఉంటారో ఆ సమయంలో వచ్చిన మృతదేహాలను వారే పోస్టుమార్టం చేయాలి. ఇది కూడా రోస్టర్‌ విధానం అమలవుతుంది. నెలకు సుమారు 20 నుంచి 30 పోస్టుమార్టంలు జరుగుతుంటాయి. పోస్టుమార్టంకు సంబంధించి కొందరు మృతుల కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రముఖుని కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే పోస్టుమార్టం నేపథ్యంలో వారిని విసిగించి రూ.15వేలు తీసుకున్నారని, ఓ నిరుపేద కుటుంబంలో యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.10వేలు వసూలు చేశారని ఓ దశలో విస్తృత ప్రచారం జరిగింది. వసూలు చేసే మొత్తంలో కాస్త అటు, ఇటు ఉన్నా పోస్టుమార్టం ప్రక్రియకు ఎంతో కొంత ముట్టచెప్పక తప్పడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

సిఫార్సులను ఒకింత పక్కన పెట్టాలి

ఏరియా వైద్యశాలలో సిఫార్సుల ప్రభావం పెరిగింది. కొందరు ప్రజాప్రతినిధులమని, వారి ముఖ్య అనుచరులమని, మీడియా అని, మరికొందరు ప్రముఖులమని చెప్తూ రోగుల తరపున వకాల్తా పుచ్చుకుని వారు చెప్పిన వారికి వెంటనే వైద్యం చేయాలని డిమాండ్‌ చేస్తుంటారు. ఇది నిజమైనా తాము కాదని చెప్పలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆసుపత్రి వర్గాలలో పులువురు చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో సిఫార్సుల కన్నా వచ్చే రోగుల సమయం, వ్యాధి ప్రాధాన్యతను బట్టి సకాలంలో వైద్యం అందిస్తే ఆసుపత్రికి మరింత ఆదరణ పెరుగుతుంది.

షుగర్‌ .. గర్భకోశ వ్యాధులు .. కంటి సమస్యలు

చీరాల నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువ. అందులో ఎక్కువ మందికి ఘగర్‌ సమస్య. మగ్గంపై నూలు పోగును తాకుతూ చేసే ప్రక్రియలో ఘగర్‌ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. గుంటమగ్గంపై నేత నేసే మహిళలకు గర్భకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, దారపు పోగులను నిశితంగా చూస్తూ చేసే పనికాకవడంతో కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయని గతంలో ఏరియా వైద్యశాలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో వెల్లడైంది. ఆసుపత్రిలో కంటి విభాగపు వైద్యునికి అసిస్టెంట్‌ లేకపోవడంతో అందరికీ సేవలు సకాలంలో అందడం లేదు. షుగర్‌, గర్భకోశ వ్యాధులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని చెప్తున్నారు.

రోగుల పట్ల ప్రేమతో మెలగాలి

ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల పట్ల వైద్యులు, సిబ్బంది ప్రేమతో మెలగాలి. కేవలం ఉద్యోగ ధర్మమే కాకుండా కొంత సేవా భావం కలిగి ఉండాలి.

తల్లీ, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఉంది.. మహాప్రస్థానం వాహనం లేదు

ప్రస్తుతం ఆసుపత్రి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు రెండు ఉన్నాయి. దీంతో కాన్పు తరువాత ఆ వాహనాల్లో సంబంధీకులను వారివారి ఇళ్లకు ఉచితంగా చేరుస్తున్నారు. మహాప్రస్థానం వాహనం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉంది. తరువాత వైసీపీ వచ్చాక అది కనుమరుతైంది. దీంతో మృతదేహాలను తీసుకెళ్లేందుకు సంబంధీకులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.

స్ట్రెక్చర్లు .. వీల్‌ చైర్‌లు

సాధారణంగా ఏరియా వైద్యశాలకు వచ్చే కేసుల్లో సాధారణ వ్యాధి గ్రస్థులతో పాటు, రోడ్డు ప్రమాదాలు, కొట్లాటలు, రైలు ప్రమాదాలలో గాయపడినవారు ఎక్కువగా ఉంటారు. కొన్ని సమయాల్లో వృద్ధులు వస్తుంటారు. అలాంటి సందర్భాల్లో స్ట్రెక్చర్లు, వీల్‌ చైర్‌లు అత్యవసరంగా అందుబాటులో ఉండాలి. పలు సందర్భాల్లో అవి అందుబాటులో లేక సంబంధిత క్షతగాత్రులు లేదా రోగుల వెంట వచ్చిన వారే ఆసుపత్రిలోకి తీసుకెళుతున్న సం దర్భాలు పదేపదే పునరావృత్తం అవుతున్నాయి. అది ఆసుపత్రికి చెడ్డ పేరు తెస్తుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అదనపు వనరులను సమకూర్చుంటే ఏరియా వైద్యశాల ప్రైవేటు వైద్యశాలల కన్నా మిన్న అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు

సమష్టి కృషి చేస్తాం

రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉమ్మడిగా కృషి చేస్తాం. చిన్న, చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం. అందుకు ఆసుపత్రికి వచ్చేవారు కూడా సహకరించాలని కోరుతున్నాం. సిఫార్సుల ప్రభావంతో కొంత ఇబ్బంది ఉండడం వాస్తవమే. పోస్టుమార్టం నేప థ్యంలో వచ్చే ఆరోపణలు గతంలో ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయంటే బాధితులు ఎవరైనా మా దృష్టికి తెస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మహాప్రస్థాన వాహనం పునరుద్ధరణ, ఖాళీల భర్తీకి కమిషనర్‌కు నివేదించాం. ఆసుపత్రిలో అంతా ఉచితమే. ఇన్‌పేషెంట్లకు దాతలు భోజనం అందిస్తున్నారు.

- డాక్టర్‌ సుభాషిణి, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌, చీరాల

Updated Date - Nov 14 , 2024 | 10:46 PM