Share News

సాగని వేట.. గడవని పూట

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:29 AM

వరుస అల్పపీడనాలతో తీరంలోని మత్స్యకారులు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జూలై నుంచి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడుతూనే ఉన్నాయి.

సాగని వేట.. గడవని పూట
కొత్తపట్నం తీరంలో ఒడ్డున ఉన్న బోట్లు

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు

మత్స్యకారుల ఇక్కట్లు

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

కొత్తపట్నం (ఒంగోలునగరం), అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : వరుస అల్పపీడనాలతో తీరంలోని మత్స్యకారులు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జూలై నుంచి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆగస్టు చివరివారంలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. సెప్టెంబరు మొదటివారంలో మరో తుఫాన్‌ అతలాకుతలం చేసింది. దాని కారణంగా కురిసిన భారీవర్షాలకు విజయవాడ నగరం మునిగిపోయింది. వారం క్రితం మరో వాయు గుండం తమిళనాడులో తీరం దాటింది. మళ్లీ సోమవారం నుంచి అల్పపీడనం ఏర్పడ టంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. ఇలా నెలల తరబడి వేట లేకపోవ డంతో వారు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తీరం వెంబడి ఉన్న 72 తీరప్రాంత గ్రామాల్లో నివాసం ఉంటున్న మత్స్యకారుల్లో 90శాతం మంది చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేటకు పోనిదే కుటుంబం గడవటం కష్టంగా మారుతోంది. రెండు మూడు నెలలుగా నెలలో వారంపాటు కూడా వేట సాగడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెక్కాడితేనే డొక్కాడేది

జిల్లాలో ఎక్కువమంది మత్స్యకారులు అవుట్‌బోట్‌ మోటార్ల మీదే వేట సాగిస్తున్నారు. సంప్రదాయ పడవలకు ఇంజన్లు అమర్చుకుని సముద్రంపైకి వెళ్తారు. వేకువజామునే వేటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తారు. ఇన్‌బోట్‌ మోటార్లు, మర పడవల మీద వేట సాగించే వారు తక్కువగానే ఉంటారు. అవుట్‌ బోట్‌ మోటార్లు మీద వేట చేసి జీవించే మత్స్యకారులకు నెలల తరబడి వేట సాగటం లేదు. ఇన్‌బోట్‌, పెద్ద పడవలకు కూడా సముద్రంపైనే లంగరు వేసి ఉంచి మత్స్యకారులు తీరం చేరతారు. వరుస అల్పపీడనాల కారణంగా సముద్రం ఏమాత్రం వేటకు అనుకూలించడం లేదని వారు వాపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తమ బతుకులు తుఫాన్ల కారణంగా ఇబ్బందుల్లో పడ్డాయంటూ ఆవేదన చెందుతున్నారు. వాయుగుండాల కారణంగా తీరప్రాంత గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఒకవైపు ఆకలి ఇంకోవైపు చలితో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ గంగపుత్రులు వాపోతున్నారు. మత్స్యకారుల్లో ఆర్థికంగా ఇబ్బంది లేని వారు కొందరే. రోజూ వేటకు పోతేనే ఆ పూటకు తిండి గడిచే కుటుంబాలే అధికంగా ఉన్నాయి. సముద్రం కాస్తన్నా శాంతిస్తే వేటకు పోదామనుకుంటున్న సమయంలో మళ్లీ మరో తుఫాన్‌ అంటూ హెచ్చరికలు వస్తుండటంతో మత్స్యకారులు కలవరపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం బియ్యం అయినా పంపిణీ చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 01:29 AM