Share News

ఒంగోలులో పేకాట శిబిరంపై దాడి

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:02 AM

ఒంగోలు నగరంలో మంగళవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకొని రూ.2.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఒంగోలులో పేకాట శిబిరంపై దాడి
శిబిరం నిర్వహిస్తున్న భవనం ఇదే, లోపల మందు ఏర్పాట్లు

అదుపులో 12 మంది జూదరులు

రూ.2.32 లక్షలు స్వాధీనం

కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు

ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రైడ్‌

ఒంగోలు క్రైం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో మంగళవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకొని రూ.2.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగమూరు రోడ్డులో ఓ భవనంలో గది అద్దెకు తీసుకొని పేకాట శిబిరం నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. పి.శివ అనే వ్యక్తి నగరంలో ఉన్న జూదరులకు ఫోన్లు చేసి పిలిపించి శిబిరంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆడిస్తున్నాడు. అందుకుగాను ఒక్కొక్కరి వద్ద రూ.1000 నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నాడు. అంతేకాకుండా వారికి అవసరమైన డబ్బు కూడా శివే ఫైనాన్స్‌ చేస్తున్నాడు. చాలాకాలంగా ఈ శిబిరం నడుస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. శిబిరం నిర్వాహకుడు శివకు ఇంకా అనేక స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. పేకాటకు వెళ్లిన వారిని రోజుకొక ప్రదేశానికి తీసుకెళ్లి ఆడిస్తుండడం గమనార్హం. పేకాట శిబిరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఆదేశాల మేరకు ఒంగోలు తాలూకా సీఐ ఆజయ్‌కుమార్‌ తనసిబ్బందితోపాటు ఏఆర్‌ పోలీసులతో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ చెప్పారు. పేకాట శిబిరం నిర్వహించే ప్రాంతమైన మంగమూరు రోడ్డులో పలు పాఠశాలలతోపాటు ముఖ్యులు నివాసం ఉంటారు. అదీ రోడ్డు పక్కనే మొదటి అంతస్తును అద్దెకు తీసుకొని పేకాట ఆడిస్తుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 12:02 AM