బాబోయ్ కుక్కలు!
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:26 AM
మార్కాపురం పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కుక్కల సంఖ్య పెద్ద ఎత్తున పెరి గింది.
మార్కాపురం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కుక్కల సంఖ్య పెద్ద ఎత్తున పెరి గింది. గతంలో శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా శునకాలు ఉండేవి. కానీ ప్రధాన పట్టణంలో కూడా ప్రస్తుతం విపరీతంగా కుక్కలు తిరుగు తున్నాయి. పగటి సమయంలో ఎలావున్నా రాత్రి వేళల్లో వాటి వలన ప్రజలు బెంబేలెత్తి పోవాల్సి వస్తోంది. బైక్‌పై వెళ్లే వారిని అవి వెంబడిస్తుండటంతో వాటికి భయపడి కింద పడి గాయాలపాలైన వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. ఒకటి రెండు కుక్కలైతే ఫర్వాలేదు. పదికిపైగా ఉండే గుంపు ఒక్కసారిగా వెంటపడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు కుక్కల ఉత్పత్తి పెరగకుండా పునరుత్పత్తి నియంత్రణ ఆపరేషన్లు చేయించేవాళ్లు. ప్రస్తుత పాలకవర్గం, అధికార యంత్రాంగం ఈ సమస్యపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడంలేదు. దీంతో పురప్రజలకు శునకాల బాధ తప్పడంలేదు.