మెరుగైన బోధన అందించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:22 AM
సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో శుక్రవారం సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఇతర సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పది, ఇంటర్‌లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలి
అధికారులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒక్క ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరిక
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో శుక్రవారం సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఇతర సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024-25 విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆ దిశగా ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక, ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. విద్య, ఆరోగ్య భద్రతకు సంబంధించి విద్యార్థుల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేస్తూ పక్కాగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. వసతి గృహాల్లో ట్యూటర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణ కోసం పంచాయతీ, మునిసిపాలిటీల నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్టల్ భవనాల మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు కోసం రూ.24 కోట్ల డీఎంఎఫ్ నిధులకు తాను అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో సంక్షేమశాఖ అధికారులు లక్ష్మానాయక్, అంజల, పార్థసారధి, అర్చన, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎ్‌స సూరిబాబు, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, డీపీవో వెంకటనాయుడు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల జిల్లా కోఆర్డినేటర్ జయ పాల్గొన్నారు.
జనవరిలోపు మరమ్మతులను పూర్తిచేయాలి
సంక్షేమ వసతి గృహాల మరమ్మతులను జనవరి ఆఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయడంతోపాటు నాణ్యతను కూడా పర్యవేక్షించాలన్నారు. ఇతర ఇంజనీరింగ్ విభాగాలకు శాఖాపరమైన పనులు ఉన్నందున సమగ్ర శిక్ష అభియాన్‌కు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని వసతి గృహాలను, ఏపీఈడబ్ల్యూఐడీసీకి మిగిలిన నియోజకవర్గాల్లోని వసతి గృహాలను కేటాయించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ భాస్కర్‌బాబు, సమగ్ర శిక్ష అభియాన్ ఈఈ ఎం.మన్నయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ దేవానంద్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.