Share News

‘భూ’చోళ్లు!

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:24 AM

మండలంలోని దరిమడుగు గ్రామంలో భూఅక్రమాలు రోజుకొకటి వెలుగులోకొస్తున్నాయి. గురువారం ఇడుపూరు రెవెన్యూ గ్రామసభలో ఓ వైసీపీ నేత జాతీయ రహదారిని అనుకుని ఉన్న రూ.కోట్ల విలువైన ఆర్‌అండ్‌బీ స్థలాన్ని కొట్టేశాడని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌ వెళ్లి పరిశీలించి సిబ్బందితో అక్కడ ఆక్రమణలు తొలగించారు.

‘భూ’చోళ్లు!

గత ప్రభుత్వంలో యథేచ్ఛగా ఆక్రమణలు

ప్రభుత్వ భూములకు పట్టాలు సృష్టించి అమ్మకం

మార్కాపురం సమీప గ్రామాల్లో రూ.కోట్ల విలువైన భూములు విచ్చలవిడిగా విక్రయం

రెవెన్యూ సదస్సుల్లో భారీగా ఫిర్యాదులు

కొరడా ఝుళిపిస్తున్న అధికారులు

ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు

‘చేతిలో అధికారం ఉంది. వెనుక రాజకీయ బలముంది. అధికార యంత్రాంగం చెప్పుచేతల్లో ఉంది. ఇంకేముంది.. ఏం చేసినా అడిగే దిక్కులేదు. ఎంత దోచుకున్నా ఆపే ధైర్యం లేరు. ఏది ఆక్రమించినా అడ్డుకునేవారు లేరు’.. గత వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల తీరిదీ.. ప్రభుత్వ భూములనూ, చెరువులనూ ఆక్రమించి పట్టాలు సృష్టించి అమ్మి రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో తాజాగా జరుగుతున్న రెవెన్యూ గ్రామసభల్లో ఈ అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మార్కాపురానికి సమీపంలోని దరిమడుగులోనూ, పక్కనున్న పెద్దనాగులవరం లోనూ రూ.కోట్ల విలువైన భూముల అక్రమం బయటపడింది. ఇదంతా దరిమడుగుకు చెందిన వైసీపీ నేత, మండలస్థాయి మాజీ ప్రజాప్రతినిధి నేతృత్వంలో కొనసాగింది.

మార్కాపురం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దరిమడుగు గ్రామంలో భూఅక్రమాలు రోజుకొకటి వెలుగులోకొస్తున్నాయి. గురువారం ఇడుపూరు రెవెన్యూ గ్రామసభలో ఓ వైసీపీ నేత జాతీయ రహదారిని అనుకుని ఉన్న రూ.కోట్ల విలువైన ఆర్‌అండ్‌బీ స్థలాన్ని కొట్టేశాడని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌ వెళ్లి పరిశీలించి సిబ్బందితో అక్కడ ఆక్రమణలు తొలగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారం అండతో దరిమడుగులో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్మేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడంతో భూ ఆక్రమణలు బయటికొస్తున్నాయి. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆధారాలతో సహా గ్రామస్థులు అక్రమాలపై ఫిర్యాదులు చేస్తుండటంతో అధికారులు కూడా క్షణం ఆలస్యం చేయకుండా వాటిని స్వాఽధీనం చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా బినామీలను అడ్డుపెట్టుకుని భూబాగోతాలను నడిపించిన మాజీ మండలస్థాయి ప్రజాప్రతినిఽధిపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

చెరువును చెరబట్టిన వైసీపీ నేత

మండలంలోని దరిమడుగు గ్రామం 959 సర్వే నెంబర్‌లోని పలు సబ్‌ డివిజన్‌లలో సుమారు 40 ఎకరాల మేర మహమ్మద్‌ సాహేబ్‌ కుంట (చెరువు) ఉంది. గతంలో ఈ చిన్నపాటి చెరువు నిండితే చుట్టుపక్కల పొలాల్లోని బోర్లకు సమృద్ధిగా నీళ్లు వస్తాయి. అంతేకాక గ్రామానికి చెందిన పశువుల దాహార్తి తీరేది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామానికి చెందిన మాజీ మండలస్థాయి ప్రజాప్రతినిధి తొలుత చెరువులోని గ్రావెల్‌పై కన్నేశాడు. పట్టణానికి సమీపంలో ఉండటం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు మట్టి తోలేందుకు అనువైన వ్యాపారంగా మలుచుకున్నాడు. ట్రిప్పుకు ఇంతని లెక్కగట్టి అక్రమంగా మట్టి తరలింపునకు తెరలేపి గత ఐదేళ్లూ యథేచ్ఛగా గ్రావెల్‌ వ్యాపారం సాగించాడు. ఇంతటితో ఆగక జాతీయ రహదారి పక్కనే 959/2బిలో ఉన్న 2 ఎకరాల చెరువు స్థలంపై కూడా కన్నేశాడు. దానిని కొట్టేసేందుకు వెనుకవైపు ఉన్న 2 ఎకరాల పట్టా భూమిని అతని బినామీ పేరున తక్కువ ధరకు కొన్నాడు. తొలుత పట్టాభూమిలో వెంచర్‌ వేసి అమ్మకాలు చేపట్టాడు. కొన్నాళ్లకు చెరువు భూమికి విలువ పెరిగింది. వెనుక సర్వే నెంబర్‌ వేసి సుమారు 1.20 ఎకరాల మేర చెరువు భూమిని కూడా అమ్మేశాడు. కరోనా సమయంలో ఈ తంతు మొత్తం జరిగింది. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ ధరల ప్రకారం ఆ భూమి మొత్తం విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. అప్పట్లో అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదులు చేసినా నియోజకవర్గ స్థాయిలో రాజకీయ అండదండలు ఉండటంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ యంత్రాంగాలు మిన్నకుండిపోయాయి.

ఇవిగో మరిన్ని అక్రమాలు

గ్రామానికి చెందిన మండలస్థాయి మాజీ ప్రజాప్రతినిధి అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సమీపంలో ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన 0.70 సెంట్ల భూమిని కూడా ఇదే తరహాలో కొట్టేశాడు. కూటమి అధికారంలోకి రావడంతోనే వెనుకన ఉన్న పట్టా భూమిని ఒంగోలుకు చెందిన ఓ ట్రాక్టర్‌ షోరూమ్‌ వారికి అమ్మేశాడు. ఓ మాజీ మంత్రి ఇంజనీరింగ్‌ కళాశాల పక్కనే ఉన్న మరో చిన్నపాటి చెరువుకు సంబంధించిన భూమిని కూడా ఇదేవిధంగా పక్కనే వెంచర్‌ వేసి ఆక్రమించుకున్నారు. గ్రామంలోని ఆటోనగర్‌ ప్రాంతంలో అసైన్‌మెంట్‌ భూములను బినామీ పేర్లతో సుమారు 20 ఎకరాల మేర గత ప్రభుత్వ హయాంలో కొట్టేసినట్లు తెలిసింది. ఆటోనగర్‌ ప్రాంతంలోని పెద్దనాగులవరం గ్రామానికి చెందిన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో సర్వే నెంబర్‌ వేసి అమ్మి రూ.కోట్లలో దండుకున్నారు. ఇవేకాక గ్రామంలో ఎలాంటి భూసమస్యలున్నా ఆయన ప్రమేయం తప్పక ఉంటుందని గ్రామస్థులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇంతటి స్థాయిలో అక్రమాలు చేస్తున్నా ఎక్కడా అతని పేరున కానీ, కుటుంబ సభ్యుల పేరున కానీ ఒక్క పత్రం కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంతా అతని అనుయాయులైన బినామీల పేరుతోనే అక్రమాలను కొనసాగించాడు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు గ్రామంలో అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి సమగ్రంగా విచారించి ఆ వైసీపీ నేత కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:24 AM