Share News

సింగరాయకొండలో వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:01 AM

సింగరాయకొండ మండలంలో అధికారపార్టీ వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మండలంలోని సింగరాయకొండ, మూలగుంటపాడు, పాకల తదితర గ్రామాల నుంచి వైసీపీకి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు ఆపార్టీకి గుడ్‌బై చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 120 కుటుంబాల వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

 సింగరాయకొండలో వైసీపీకి భారీ షాక్‌
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే స్వామి, సత్య, రాఘవరెడ్డి

ఆ పార్టీని వీడిన 120 కుటుంబాలు

సింగరాయకొండ, ఏప్రిల్‌ 26 : సింగరాయకొండ మండలంలో అధికారపార్టీ వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మండలంలోని సింగరాయకొండ, మూలగుంటపాడు, పాకల తదితర గ్రామాల నుంచి వైసీపీకి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు ఆపార్టీకి గుడ్‌బై చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 120 కుటుంబాల వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించటానికి ప్రజలు టీడీపీ కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను కోరుకునే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

దామచర్ల, మాగుంట కుటుంబాలకు అభివృద్ధే అజెండా

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ దామచర్ల, మాగుంట కుటుంబాలు అభివృద్ధే అజెండాగా రాజకీయాలలో కొనసాగుతున్నాయని అన్నారు. ఈ రెండు కుటుంబాలకు వైసీపీ నేతలలా దోచుకోవడం, దాచుకోవడం తెలియదని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయటమే తెలుసని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. మూర్ఖపు జగన్‌రెడ్డి పాలనలో ఉద్యోగ ఆవకాశాలు లేక యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాండేజ్‌ వేసుకొని నాటిస్తున్న జగన్‌రెడ్డి కావాలా.. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించే చంద్రబాబు కావాలో ప్రజలే తెల్చుకోవాలన్నారు. వైసీపీ ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా యర్రచందనం, గంజాయి స్మగ్లర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైసీపీ కొండపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్‌ పోటీచేస్తున్నారని, ఆ ఇరువురు వలస నేతలను ఓడించాలని సత్య పిలుపునిచ్చారు. స్థానికులైన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సత్య కోరారు.

మాగుంట కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ టీడీపీలోకి రావాలి - రాఘవరెడ్డి

మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ సింగరాయకొండ మండలంతో మాగుంట కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. స్థానికంగా పెరల్‌ డిస్టలరీని ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు. మాగుంట కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ టీడీపీలోకి రావాలని కోరారు. కొండపిలో 20 వేల పైచిలుక మెజారిటీ వచ్చే విధంగా టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా పచిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు యన్నాబత్తిన మురళి, నేలపాటి శంకర్‌, మూలగుంటపాడు మాజీ వైస్‌ సర్పంచ్‌ మూళ్లపూడి సత్యనారాయణ, వైసీపీ మండల జేసీఎస్‌ కన్వీనర్‌ తన్నీరు సుబ్బారావు, వార్డు సభ్యులు పాదర్తి కోటేశ్వరరావు, మోటుపల్లి గోవిందరావు, షేక్‌ మున్నా వారి ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు, పాకల పోతయ్యగారి పట్టపుపాలెంకు చెందిన ప్రళయకావేరి రోశయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు, షేక్‌ జిలానీబాషా వారు అనుచరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు అడకా స్వాములు, టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు చీమకుర్తి కృష్ణ, షేక్‌ సందానీబాషా, కూనపురెడ్డి సుబ్బారావు, పాకల సర్పంచ్‌ సైకం చంద్రశేఖర్‌, గోళ్లమూడి శ్రీనివాసరెడ్డి, మందలపు గాంధీ చౌదరి, చంటి, మించల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:01 AM