Share News

హద్దురాయి.. ఓ చరిత్ర కలదోయి...!

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:07 AM

రెండు శతాబ్దాల క్రితం నాటి చరిత్రకు అద్దంకి ప్రాంతంలోని ఓ సరిహద్దు రాయి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ప్రస్తుతం అద్దంకి, బల్లికురవ మండలాల సరిహద్దులో నామ్‌ రోడ్డు వెంబడి ఉన్న సరిహద్దు రాయి రెండు శతాబ్దాల క్రితం నెల్లూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉండేది. ఈ క్రమంలో రెండు జిల్లాల హద్దుగా అప్పట్లో ఆ రాయి ఆయా జిల్లాలకు స్వాగతం పలుకుతున్నట్లు ఏర్పాటైందని భావిస్తున్నారు. 1850 ప్రాంతంలో నెల్లూరు, కృష్ణా(అనంతరం కృష్ణా జిల్లాగా మార్పు చెందింది) జిల్లాలు మాత్రమే ఉన్నాయి.

హద్దురాయి.. ఓ చరిత్ర కలదోయి...!

రెండు శతాబ్దాలుగా పదిలం

నాడు నెల్లూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుగా అద్దంకి

నరసరావుపేట తాలూకా పరిధిలో బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాలు

అప్పట్లో ఆ ప్రాంతాలు కృష్ణా జిల్లాలో కలిసి ఉండేవి...

ఇక అద్దంకి ప్రాంతం నెల్లూరులో అంతర్భాగం

గుంటూరు జిల్లా ఏర్పాటుతో మారిన ముఖచిత్రం

మానవ పుట్టుక తర్వాత.. రాతి యుగం నుంచే అనేక పరిణామాలు వేగంగా మారిపోయాయి. తొలుత రాతితో నిప్పును కనుగొన్నాక నాగరికతలో అనుహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తొలినాళ్ల నుంచే రాళ్లకు, మానవులకు ఎన్నో విషయాలలో అవినాభావ సంబంధం ఉంది. అలాఅలా సమాజం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఊళ్ల సరిహద్దుల కోసమూ రాళ్లను వాడారు. అవి చిరస్థాయిగా ఉంటూ భావితరాలకు దిక్సూచిలా మారాయి. దాదాపు రెండు శతాబ్ధాల కిందట అద్దంకి ప్రాంతంలో వేసిన సరిహద్దు రాయి ఎంతో చరిత్రను సొంతం చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం..

అద్దంకి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి) : రెండు శతాబ్దాల క్రితం నాటి చరిత్రకు అద్దంకి ప్రాంతంలోని ఓ సరిహద్దు రాయి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ప్రస్తుతం అద్దంకి, బల్లికురవ మండలాల సరిహద్దులో నామ్‌ రోడ్డు వెంబడి ఉన్న సరిహద్దు రాయి రెండు శతాబ్దాల క్రితం నెల్లూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉండేది. ఈ క్రమంలో రెండు జిల్లాల హద్దుగా అప్పట్లో ఆ రాయి ఆయా జిల్లాలకు స్వాగతం పలుకుతున్నట్లు ఏర్పాటైందని భావిస్తున్నారు. 1850 ప్రాంతంలో నెల్లూరు, కృష్ణా(అనంతరం కృష్ణా జిల్లాగా మార్పు చెందింది) జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అద్దంకి కేంద్రంగా ఉన్న చంద లూరు తాలూకా నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది. బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాలతో కలిసి ఉన్న నరసరావుపేట తాలూకా కృష్ణా జిల్లా పరిధిలో ఉండేది. దీనికి సరిహద్దుగా కొప్పెరపాడు,చినకొత్తపల్లి రెవెన్యూ సరిహద్దులో రాయిఏర్పాటు చేశారు. మధ్యలో కొద్దికాలం ఒంగోలు కేంద్రంగా పల్నాడు జిల్లా, గుంటూరు కేంద్రంగా గుంటూరు జిల్లాలు ఏర్పాటైనా కొద్దికాలానికే రద్దు చేశారు.

1904లో గుంటూరు జిల్లా ఏర్పాటు తరువాత అద్దంకి తాలూకా రద్దై ఒంగోలు తాలూకాలో కలిసింది. బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాలు మాత్రం నరసరావుపేట తాలూకా పరిధిలో ఉండి గుంటూరు జిల్లాలో అంతర్భాగంగా మారాయి. 1970లో ఒంగోలు జిల్లా(1972లో ప్రకాశం జిల్లా)గా ఏర్పాటు తరువాత నరసరావుపేట తాలూకా పరిధిలోని సంతమాగులూరు, బల్లికురవ ప్రాంతాలను తొలగించి మళ్లీ అద్దంకి తాలూకా కేంద్రంగా చేసి కలిపారు.

నామ్‌ రోడ్డు విస్తరణలో వెలుగులోకి...

నాటి జిల్లాల హద్దు రాయి కాస్తా రోడ్డు మార్జిన్‌లో పడి పోయి నిరాదరణకు గురైంది. నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల(నామ్‌) ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ సమయంలో హద్దురాయి వెలుగులోకి వచ్చింది. దీంతో అద్దంకికి చెందిన రిటైర్డ్‌ తెలుగు ఉపాధ్యాయుడు, పురావస్తు పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి రెండు జిల్లాల సరిహద్దు రాయిగా గుర్తించి శాశ్వతంగా ఉండేలా నామ్‌రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకుపోయి భవిష్యత్‌ తరాలకు కూడా గుర్తు ఉండేలా కాంక్రీట్‌తో దిమ్మె వేయించి ఏర్పాటు చేయించారు.

Updated Date - Dec 27 , 2024 | 01:07 AM