Share News

వాగు భూమి హాంఫట్‌!

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:43 AM

అది పెద్దారవీడు మండలంలోనే అత్యంత విలువైన ప్రాంతం. నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే వ్యాపార కూడలి. అక్కడ అడుగు స్థలం ధర రూ.వేలలో పలుకుతోంది. అంతటి విలువైన ప్రాంతంలో మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడైన ఓ వ్యాపారవేత్తకు పలు వ్యాపారాలు ఉన్నాయి.

వాగు భూమి హాంఫట్‌!
జాతీయ రహదారిని ఆనుకుని వాగుభూమిలో వెలిసిన బంకులు

గుట్టుగా ఆక్రమించిన వైసీపీ నేత

ముందు బంకులు ఏర్పాటు చేసిన వైనం

మార్కెట్‌ ప్రకారం దాని విలువ రూ.10 కోట్లు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

మార్కాపురం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అది పెద్దారవీడు మండలంలోనే అత్యంత విలువైన ప్రాంతం. నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే వ్యాపార కూడలి. అక్కడ అడుగు స్థలం ధర రూ.వేలలో పలుకుతోంది. అంతటి విలువైన ప్రాంతంలో మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడైన ఓ వ్యాపారవేత్తకు పలు వ్యాపారాలు ఉన్నాయి. డివిజన్‌ మొత్తం మీద భూఅక్రమాల్లో ఆరితేరిన వ్యక్తి ఆయన. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ పెట్రోల్‌ బంకు పక్కన రూ.10 కోట్లకుపైగానే విలువైన వాగు భూమిపై కన్నేశాడు. అనుకున్నదే తడవుగా ప్రస్తుతం బడ్డీ బంకులు ఏర్పాటు చేయించాడు. వాటి మాటున ఆక్రమణ పర్వానికి తెరలేపాడు. ఈ విషయాన్ని గుర్తించి కొందరు చుట్టుపక్కల గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను తొలగించి వాగు భూమిని పరిరక్షించాలని కోరారు. అయితే ఆర్థికంగా ఎంతో బలవంతుడైన ఆ వ్యాపారవేత్త వ్యవహారంలో వేలుపెట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం కూడా వెనుకాడుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగిన భూఆక్రమణదారుల భరతంపట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. అయితే వైసీపీ సానుభూతిపరుడైన ఆ వ్యాపారవేత్త అక్రమాలపై మాత్రం యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.

బంకుల మాటున ఆక్రమణలు

పెద్దారవీడు మండలంలోని హనుమాన్‌ జంక్షన్‌ కుంట ప్రాంతం వ్యాపార కూడలిగా ఉంది. పేరుకు ఓ గ్రామంలాంటిదే అయినా కుంట చుట్టూ ఉండే ఓబులక్కపల్లి, తోకపల్లి, బోడిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాల భూములున్నాయి. చుట్టూ సుమారు 15 గ్రామాల నుంచి రైతులు, సామాన్య ప్రజలు వివిధ అవసరాలపై ఆ కూడలికి వస్తుంటారు. అక్కడ గొర్రెల మండి, ఫెస్టిసైడ్‌ దుకాణాలు, హోటళ్లు, లాడ్జీలు ఇలా మండల కేంద్రంకంటే ఎక్కువ ఆదాయం కుంటలోనే ఉంటుంది. అంతేకాక కుంట పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎకరం భూమి రూ.20 కోట్లకు పైనే పలుకుతోంది. మార్కాపురం పట్టణం తర్వాత అంతటిస్థాయిలో భూముల విలువలు ఉన్నది కుంటలోనే. ఇక్కడ ఎర్రగొండపాలెం, దోర్నాల, మార్కాపురానికి చెందిన చాలామంది వ్యాపారులు భూములు కొని వ్యాపారాలు చేస్తున్నారు. కుంట గ్రామం మధ్యలో నుంచే అనంతపురం- అమరావతి 544(ఎఫ్‌) జాతీయ రహదారి వెళ్తోంది. ఆ రహదారికి ఆనుకుని ఉన్న భూముల విలువ ప్రస్తుతం గజం రూ.లక్షల్లో ఉంది. ఇంతటి విలువైన ప్రాంతంలో జాతీయ రహదారికి ఆనుకుని పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు పెట్రోల్‌ బంకు ఉంది. దాని పక్కనే ఓబులక్కపల్లె రెవెన్యూ గ్రామ ఇలాకాకు చెందిన సర్వే నెంబర్‌ 37/4లో 1.48 ఎకరాల వాగు భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన వ్యాపారవేత్త ముందుగా బంకుల మాటున ఆక్రమణలకు తెరలేపాడు. రహదారి వెంట బంకులు నిర్మించి రూ.వేలల్లో అద్దెలకు ఇస్తున్నాడు. ప్రస్తుతం 8 వరకు బంకులు ఏర్పాటయ్యాయి. మరో 5 బంకులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాడు. బంకులతోపాటు వెనుకవైపువున్న వాగుభూమిని సుమారు అర ఎకరం మేర చదును చేశాడు. ఇంతా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు.


ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

హనుమాన్‌ జంక్షన్‌ కుంటలో జరుగుతున్న వాగు భూమి ఆక్రమణ విషయాన్ని బోడిరెడ్డిపల్లికి చెందిన కొందరు తోకపల్లె రెవెన్యూ సదస్సులో అధికారులకు వారంరోజుల క్రితం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామసభ ముగిసిన వెంటనే సాయంత్రం తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌, సర్వేయర్‌ గోపాల్‌రెడ్డిలు వాగుభూమి వద్దకు వెళ్లి పరిశీలించారు. అది వాగు భూమిగా సర్వేయర్‌ నిర్ధారించారు. వెంటనే ఆక్రమంగా ఏర్పాటు చేసిన బంకులు తొలగిస్తామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. ఏమైందో ఏమో ఇప్పటి వరకు రెవెన్యూ సిబ్బంది ఎవరూ అక్కడకు వెళ్లిన దాఖలాలులేవు. డివిజన్‌లోని మిగిలిన మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు వైసీపీకి చెందిన వ్యాపారవేత్త ఆక్రమణకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందినా ఆక్రమణల తొలగింపునకు అధికారులు మొగ్గు చూపడం లేదు. దీని ఆంతర్యమేమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. పెద్దమొత్తంలో వ్యాపారవేత్త నుంచి ముడుపులు అందడంతోనే ఆగిపోయారా..? ఎవరైనా అధికార పార్టీ నాయకుడు ఒత్తిడి చేశారా..? అని కుంట చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో చర్చ నడుస్తోంది.

Updated Date - Dec 31 , 2024 | 01:43 AM