Share News

చిగురించిన ఆశలు

ABN , Publish Date - Oct 30 , 2024 | 02:17 AM

దుర్భిక్ష ప్రాంతానికి ఆశాదీపమైన వెలిగొండ ప్రాజెక్ట్‌పై ప్రజల ఆశలు మరోసారి చిగురించాయి. నిర్మాణ తీరుతెన్నులపై నిశిత పరిశీలన చేస్తూ.. ఆర్భాట హామీలు లేకుండా లొసుగులను చూస్తూ.. ముగ్గురు మంత్రులు సాగించిన పర్యటన, చెప్పిన మాటలు అందుకు తోడ్పడ్డాయి.

చిగురించిన ఆశలు
వెలిగొండ మొదటి సొరంగంలోకి వెళ్లి పరిశీలిస్తున్న మంత్రులు నిమ్మల, డోలా తదితరులు

నిశిత పరిశీలనలు

వచ్చే నెలలో వెలిగొండ పనులు పునఃప్రారంభం

గుండ్లకమ్మను పూర్తిచేస్తాం

చెరువుల మరమ్మతులకు నిధులిస్తాం

గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే పరిష్కార మార్గాల అన్వేషణ

పశ్చిమ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, అధికారులతో ముగ్గురు మంత్రుల పర్యటన

దుర్భిక్ష ప్రాంతానికి ఆశాదీపమైన వెలిగొండ ప్రాజెక్ట్‌పై ప్రజల ఆశలు మరోసారి చిగురించాయి. నిర్మాణ తీరుతెన్నులపై నిశిత పరిశీలన చేస్తూ.. ఆర్భాట హామీలు లేకుండా లొసుగులను చూస్తూ.. ముగ్గురు మంత్రులు సాగించిన పర్యటన, చెప్పిన మాటలు అందుకు తోడ్పడ్డాయి. ఎన్నికల హామీలను అమలు చేస్తామంటూ ప్రాథమిక దశలో నీటి విడుదల సమయాన్ని ప్రకటించకుండా పనుల పునఃప్రారంభానికి ముహూర్తం నిర్ణయించడం మంత్రుల పర్యటనలో ముఖ్యాంశమైంది. వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రాంతంలో మంగళవారం నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవి, డీఎస్‌బీవీ స్వామిలు యావత్తు అధికారులు, జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులతో కలిసి సాగించిన పర్యటన సఫలీకృతమైంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలోని పశ్చిమప్రాంత ఆశాజ్యోతి వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టిసారించింది. త్వరలో పనుల పునఃప్రారంభానికి సిద్ధమైంది. రమారమి 20ఏళ్ల నుంచి ప్రాజెక్ట్‌ నిర్మాణం అడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతూ ఎన్నికల సమయంలో పార్టీలకు వాగ్దానాల బాణిగా నిలిచిన విషయం విదితమే. 2019 ఎన్నికల్లో పార్టీలన్నీ ఆ ప్రాజెక్ట్‌పై హామీల వర్షం కురిపించాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పనులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. అనేక అడ్డంకుల మధ్య నీటి విడుదలకు అవకాశం లేకుండానే ఈ ఏడాది ఎన్నికలకు ముందు జగన్‌ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయగా, ప్రజలు మరోమారు దగా పడ్డారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల సమయంలో మళ్లీ టీడీపీ, వైసీపీలు హామీల వర్షం కురిపించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా పాలకులు వెలిగొండ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో ప్రజల్లో మరోమారు అనుమానాలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో మంగళవారం జరిగిన పర్యటన ప్రజల్లో ఆశలను చిగురింపజేసింది.

ఆసాంతం నిశిత పరిశీలన

ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంత్రులు నిశిత పరిశీలన చేశారు. ఉదయమే దోర్నాల వద్ద అతిథిగృహంలో మంత్రి రామానాయుడు సమీక్షించారు. అనంతరం టన్నెల్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. మొదటి టన్నెల్‌ పనులు పూర్తయినా నీటి విడుదలకు ప్రారంభంలోనే భారీగా మట్టి, ఇతర వ్యర్థపదార్థాలు అడ్డంకులుగా ఉండడాన్ని గుర్తించారు. రెండో టన్నెల్‌లో 7 కి.మీ లైనింగ్‌ నిర్మాణం కూడా జరగకపోవడాన్ని పసిగట్టారు. రెండో టన్నెల్‌ పూర్తికావడానికి మొదటి టన్నెల్‌ వద్ద ఉన్న మట్టిని తీసివేయడానికి మరో ఏడు నెలలకుపైగా సమయం పడుతుందని గుర్తించారు. ఆతర్వాత మంత్రులు, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు బైక్‌లపై కాలువలపై ప్రయాణించి వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువే ధ్వంసమైనట్లు కనిపించగా, పిల్ల కాలువల పనులు పూర్తిగాని విషయం తేటతెల్లమైంది. అక్కడి నుంచి గొట్టిపడియ రిజర్వాయర్‌ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ రూ.73 కోట్లతో నిర్మించిన మంచినీటి సరఫరా పథకం ఇంకా అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు పైపులైన్లు నిర్మించాలి. ఆ పనుల జోలికే ఇంతవరకూ వెళ్లలేదు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వాసితుల సమస్యలు ఎక్కడివి అక్కడే నిలిచిపోగా, పునరావాస గ్రామాల ఏర్పాటు పనులు అడుగు ముందుకు పడని విషయం స్పష్టమైంది. ఆ తర్వాత మార్కాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ముగ్గురు మంత్రులు మొత్తం ప్రాజెక్టు రూపురేఖలను సమీక్షించారు. తద్వారా గతంలో ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడం అధికారికంగా వెల్లడి కావడమేగాక, గత నాలుగు నెలలుగా ప్రాజెక్ట్‌ పనులు పూర్తిగా ఆగిపోయినట్లు తెలుసుకున్నారు.


నవంబరులో పనులు పునఃప్రారంభం

మొత్తం పరిస్థితిని తెలుసుకున్నాక మంత్రి రామానాయుడు నవంబరులో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు రవి, స్వామిలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సాగు,తాగునీరు అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు రెండు పర్యాయాలు వెలిగొండపై సమీక్ష చేశారని రామానాయుడు తెలిపారు. ఇప్పుడు కూడా ఆయ నసూచన మేరకు తాము పరిశీలించామని, పూర్తి నివేదికను సీఎంకు ఇస్తామని చెప్పారు. ఇప్పటికైతే నవంబరులో పనులు ప్రారంభిస్తామని చెప్పగలనంటూ నీటి విడుదల సమయాన్ని సీఎం ఉన్నత స్థాయిలో సమీక్ష అనంతరమే వెల్లడిస్తామని చెప్పారు. కనీసం రూ.3వేల కోట్లు అవసరం ఉందని చెబుతూ రాష్ట్రంలో పోలవరం తర్వాత వెలిగొండకు సీఎం ప్రాధాన్యం ఇచ్చారని, అందువల్ల నిధుల కేటాయింపు చేస్తారని తెలిపారు.

గుండ్లకమ్మ, సాగునీటి చెరువులపైనా దృష్టి

ప్రకాశం జిల్లా అభివృద్ధిపట్ల సీఎం శ్రద్ధతో ఉన్నారని మంత్రి నిమ్మల తెలిపారు. గుండ్లకమ్మ గేట్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో సాగునీటి చెరువుల నిర్వహణకు నిధులను విడుదల చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మరికొన్ని రిజర్వాయర్లు, సాగర్‌ కాలువల బాగు చేపడతామని తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు జనార్దన్‌, నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, విజయ్‌కుమార్‌, నాగేశ్వరరావు, ఇన్‌చార్జులు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మి, కార్పొరేషన్‌ చైర్మన్లు దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, లంకా దినకర్‌తోపాటు టీడీపీ నేతలు, కలెక్టర్‌ అన్సారియాతోపాటు ముఖ్య అధికారలు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 02:17 AM