Share News

సీఎం దృష్టికి డీసీసీబీ అక్రమాలు

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:26 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లాయి. బ్యాంకుపై ప్రభుత్వానికి ఫిర్యాదు, తదనుగుణంగా విజిలెన్స్‌ విచారణ నేపథ్యంలో సీఈవో కోటిరెడ్డిని అక్కడి బాధ్యతల నుంచి తొలగించడంతోపాటు శాఖపరంగా సెక్షన్‌ 51 విచారణ కోరుతూ కలెక్టర్‌ లేఖ రాసిన విషయం విదితమే.

సీఎం దృష్టికి డీసీసీబీ అక్రమాలు

ఉద్యోగుల్లో అలజడి

సహకారశాఖ అధికారులపై కలెక్టర్‌ సీరియస్‌

ఐదేళ్లకు సంబంధించిన అన్ని పుస్తకాల పరిశీలన

డిస్మిస్‌ ఉద్యోగికి జీతాలు చెల్లింపునకు బ్రేక్‌

నేడు బ్యాంకు పాలక మండలి సమావేశం

ఒంగోలు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లాయి. బ్యాంకుపై ప్రభుత్వానికి ఫిర్యాదు, తదనుగుణంగా విజిలెన్స్‌ విచారణ నేపథ్యంలో సీఈవో కోటిరెడ్డిని అక్కడి బాధ్యతల నుంచి తొలగించడంతోపాటు శాఖపరంగా సెక్షన్‌ 51 విచారణ కోరుతూ కలెక్టర్‌ లేఖ రాసిన విషయం విదితమే. అయితే తగు స్థాయిలో చర్యలు లేవు. ఈ నేపథ్యంలో స్థానికంగా, అలాగే రాష్ట్ర స్థాయి సహకార అధికారుల వ్యవహారశైలిపై ‘అక్కడంతే’ శీర్షికన ఈనెల 2న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం అన్ని వర్గాల్లోనూ కలకలం రేపింది. దీంతో బ్యాంకులో అసలు ఏమి జరుగుతుందన్న దానిపై అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు విచారించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ విషయం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. పీడీసీసీ బ్యాంకులో పరిస్థితిపై ఒకవైపు ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగా, మరో వైపు సీఎం దృష్టికి కూడా జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికార పార్టీ నేతలు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో మొత్తం వ్యవహారం, అధికారుల పాత్రపై సీఎంవో నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు సంబంధిత అధికారులలో అలజడి రేపాయి. దీంతో ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చిన సహకారశాఖ ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి అయిన జేసీ గోపాలకృష్ణ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

ఉన్నత న్యాయస్థానానికి వెళ్లండి

గతంలో బ్యాంకు పాలకవర్గం డిస్మిస్‌ చేసిన ఉద్యోగికి రూ.82 లక్షలు పెండింగ్‌ వేతనం పేరుతో చెల్లింపునకు బ్యాంకు అధికారులు చేసిన ప్రతిపాదనను జేసీ తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయంలో వేతనం కోసం సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించినప్పుడు తగుస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోకుండా వ్యవహరించి కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చేలా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రశ్నించిన జేసీ వేతనం చెల్లింపునకు బ్రేక్‌వేయడంతో పాటు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

కలెక్టర్‌ బంగ్లాకు ఫైళ్లు

బ్యాంకు పరిణామాలపై తొలి నుంచి సీరియస్‌గా ఉన్న కలెక్టర్‌ అన్సారియా ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో మరింత దృష్టిపెట్టారు. బ్యాంకులో పరిస్థితిపై తాను ప్రభుత్వానికి లేఖలు రాసే సమయంలో ఉద్దేశపూర్వకంగా జిల్లా సహకారశాఖ అధికారులు తప్పుదోవ పట్టించారని భావించడంతోపాటు బ్యాంకు పర్యవేక్షణాధికారులు కూడా తగు విధంగా స్పందించలేదని అభిప్రాయానికి ఆమె వచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు సహకార శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అదేసమయంలో బ్యాంకులో 2019-24 మధ్య కాలంలో అసలేం జరిగిందన్న దానిపై దృష్టి సారించారు. ఆ సమయంలో జరిగిన త్రిసభ్య, పర్సన్‌ ఇన్‌చార్జిలతో కూడిన పాలక మండలి సమావేశాలు, చేసిన నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌ పుస్తకాలు, మరికొన్ని కీలక పైళ్లను ఆ శాఖ అధికారుల ద్వారా గత రాత్రి తన బంగ్లాకు తెప్పించుకొన్నట్లు తెలిసింది. వాటిని పరిశీలించడంతోపాటు సదరు అధికారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. అన్నింటినీ తాను స్వయంగా పరిశీలిస్తానని, ఎక్కడ తప్పులు జరిగినా బాధ్యులైన వారిని క్షమించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది.


తక్షణం పాలక మండలి సమావేశం

తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం బ్యాంకు పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని పర్సన్‌ ఇన్‌చార్జి అయిన జేసీ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తొలుత బ్యాంకు నిబంధనావళి ప్రకారం సమావేశం ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సూచించిన జేసీ తాజా పరిణామాల నేపథ్యంలో తక్షణం పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆ సమావేశంలో ఏమి చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది.

డీఆర్సీలో డీసీసీబీపై చర్చ

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన డీఆర్సీ సమావేశంలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే జనార్దన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బ్యాంకులో అవకతవకలు జరిగినట్లు తనకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఇన్‌చార్జీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 05 , 2024 | 01:26 AM