Share News

కునారిల్లుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:20 AM

గ్రామాల్లో చంటిబిడ్డలకు గర్భిణులకు పౌష్టికాహారం అందించి వారికి ఆలంభన నిలిచే అంగన్‌ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి.

కునారిల్లుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు

ఎర్రగొండపాలెంరూరల్‌, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల్లో చంటిబిడ్డలకు గర్భిణులకు పౌష్టికాహారం అందించి వారికి ఆలంభన నిలిచే అంగన్‌ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. వై.పాలెం సీడీపీవో కార్యాలయంలో పరిధిలో కనీసం మూడో వంతు కూడా సొంత భవనాలు లేవు. ఉన్న భవనాలో కూడా వసతులు కరువవ్వడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఎర్రగొండపాలెం సమగ్ర శిశు సంక్షేమ శాఖ సెక్టార్‌ పరిధిలో మొత్తం 248 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 235 మంది కార్యకర్తలు, ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఊసే లేకుండా పోయింది. ఇక వారి సమస్యలు కూడా పట్టించుకోలేదు. దీంతో నేటికీ అవి సరైన వసతులు లేక కునారిల్లుతున్నాయి.

సొంత భవనాలు లేక అవస్థలు

సెక్టార్‌ పరిధిలో 248 కేంద్రాలు ఉండగా వాటిలో 90 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 158 కేంద్రాలు అద్దెభవనాల్లో నిర్వహిస్తున్నారు. 248 కేంద్రాలకు గాను 11 మంది సూపర్‌ వైజర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఐదుగురే ఉన్నారు. దీంతో ఆయా కేంద్రాల పర్యవేక్షణ తదితర వాటికి సూపర్‌ వైజర్లపై పనిఒత్తిడి పెరిగిపోయింది. అలాగే సెక్టార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెక్టార్‌ ప్రధాన కార్యాలయానికి ప్రహారీ లేకపోవడంతో మహిళలు పలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ఆ ప్రాంత మంతా మందుబాబులకు ఆడ్డాగా మారుతోందని సిబ్బంది వాపోతున్నారు. ప్రహరీగోడ నిర్మించి సమస్యను తీర్చాలని సిబ్బంది కోరుతున్నారు.

కూటమి ప్రభుత్వంలో నిధులు మంజూరు

పంచాయితీ రాజ్‌, ఆర్‌డబ్లూఎస్‌ శాఖ అధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 భవనాలకు గాను 82 కేంద్రాలకురూ.15వేలు నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. అలాగే కేంద్రాలలోని పిల్లల రక్షణ కోసం 72 కేంద్రాలకు రూ.10వేల నిధులతో కంచె, గార్డెన్‌ ఏర్పాటు చేస్త్తున్నారు. 71 కేంద్రాలకు మంచినీటి వసతి కల్పనకు పనులు 80 శాతం పనులు పూర్తి అయినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. ఉన్న భవనాల్లో వసతులు కల్పిస్తున్నప్పటికీ, సొంత భవనాల కొరత మాత్రం ఆశాఖను వెంటాడుతూనే ఉంది.

Updated Date - Dec 23 , 2024 | 12:20 AM