Share News

రంగు రంగులో.. ఎన్ని హంగులో..!

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:36 PM

సాదా చీరలపై రంగు, రంగుల డిజైన్లు, ఆకర్షణీయమైన హ్యాండ్‌ వర్క్‌ చీరాల ప్రత్యేకత. మండలంలోని తోటవారిపాలేనికి చెందిన ఇరువురు దంపతులు సాదా చీరలపై చేతి కుంచెలతో వివిధ రంగుల డిజైన్లు వేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మొదట రోజుకు ఒకటి, రెండు చీరలపై డిజైన్‌ చేసే వీరు ప్రస్తుతం రోజుకు సుమారు 15 నుంచి 20 చీరలు తయారు చేసే స్థాయికి ఎదిగారు.

రంగు రంగులో.. ఎన్ని హంగులో..!
చీరపై రంగులతో డిజైన్లు వేస్తున్న బాలశంకర్‌ దంపతులు

చీరలపై డిజైన్లు చీరాలకే సొంతం

తోటవారిపాలెంలో దంపతుల హ్యాండ్‌ డిజైన్‌ వర్క్‌

చేతి కుంచెలతో ఆకర్షణీయంగా తయారు

వివిధ ప్రాంతాలకు పెరుగుతున్న ఆర్డర్లు

చీరాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : సాదా చీరలపై రంగు, రంగుల డిజైన్లు, ఆకర్షణీయమైన హ్యాండ్‌ వర్క్‌ చీరాల ప్రత్యేకత. మండలంలోని తోటవారిపాలేనికి చెందిన ఇరువురు దంపతులు సాదా చీరలపై చేతి కుంచెలతో వివిధ రంగుల డిజైన్లు వేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మొదట రోజుకు ఒకటి, రెండు చీరలపై డిజైన్‌ చేసే వీరు ప్రస్తుతం రోజుకు సుమారు 15 నుంచి 20 చీరలు తయారు చేసే స్థాయికి ఎదిగారు. చీరాల మండలం తోటవారిపాలేనికి చెందిన బూదాటి బాలశంకర్‌, భ్రమరాంబ దంపతులు సాదా చీరలపై రకరకాల డిజైన్లు వేస్తూ మన్ననలు పొందుతున్నారు. బాలశంకర్‌ తన 12వ ఏట నుంచే రంగులతో హ్యాండ్‌ వర్క్‌ చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఆకురాతి నాగేశ్వరరావు అనే పెయింటర్‌ ఈయనకు స్ఫూర్తి. గోడలపై రంగులు వేసే నాగేశ్వరరావు వద్ద ఈయన శిక్షణ పొందారు. సాదా వస్త్రాలపై రంగులతో డిజైన్లు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ముందడుగు వేశారు. చూసిన వారందరూ బాగున్నాయని మెచ్చుకునేవారు. దీంతో బాలశంకర్‌ అదే పనిని తన వృత్తిగా ఎంచుకున్నారు. వివాహం జరిగాక తన భార్య భ్రమరాంబకు ఆ కళను నేర్పారు. అప్పటి నుంచి దంపతులు ఇరువురు సాదా చీరలపై ఫెవికాల్‌ కలర్స్‌తో వివిధ రకాల డిజైన్లు వేస్తున్నారు. ఆర్డర్లపైనే వారు ఎక్కువగా డిజైన్లు చేస్తుంటారు. వారు చేసే డిజైన్లు వినియోగదారుల అభిరుచి మేరకు రూ.600 నుంచి రూ.3వేల వరకు తీసుకుంటున్నారు. ఈ చీరలపై వేసే రంగులు ఉతికినా చెడిపోకపోవడం ప్రత్యేకత. చేతి కళలు అంతరించిపోతున్న తరుణంలో ఈ దంపతులు స్పజనకు మారుపేరుగా తమ వృత్తిలో రాణిస్తూ, మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 11:36 PM