Share News

ముగిసిన పది పరీక్షలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:13 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కీలక సబ్జెక్టుల పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి.

ముగిసిన పది పరీక్షలు
పరీక్ష అనంతరం ఓ కేంద్రం వెలుపల కేరింతలు కొడుతున్న విద్యార్థులు

విద్యార్థుల కేరింతలు

హాస్టళ్ల నుంచి ఇళ్లకు పయనం

ఒంగోలు(విద్య), మార్చి 27 : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కీలక సబ్జెక్టుల పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. ఈసారి ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా డిబార్‌ కాలేదు. 4 ఎస్‌ పరీక్షకు ఈనెల 28న 94 కేంద్రాల్లో 3,407 మంది, ఓఎస్‌ఎస్‌సీ పరీక్షకు రెండు కేంద్రాల్లో 15మంది, ఈనెల 30న ఒకేషనల్‌ పరీక్షకు 22 కేంద్రాల్లో 2,226మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మిగిలిన విద్యార్థులందరి పరీక్షలు ముగిశాయి. జిల్లాలో బుధవారం జరిగిన సోషల్‌ స్టడీస్‌ పరీక్షకు రెగ్యులర్‌ విద్యార్థులు 28,160మందికిగాను 27,898 మంది (99శాతం) హాజరయ్యారు. 262మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు కేవలం 22.83 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. మొత్తం 600మందికి గాను 137 మంది మాత్రమే హాజరు కాగా 463 మంది డుమ్మాకొట్టారు. పరీక్షల పరిశీలకులు ఎం.ఆర్‌.ప్రసన్నకుమార్‌ ఏడు, జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర మూడు కేంద్రాలను సందర్శించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు మొత్తం 60 కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన పరీక్షలన్నీ ముగియ డంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పరీక్ష అనంతరం కేంద్రాల నుంచి బయటకు రాగానే విద్యార్థులు కేరింతలు కొట్టారు. బస్సుల్లో ఎక్కి తమ చేతుల్లోని పేపర్లను ముక్కలుగా చించి రోడ్లపై చల్లారు. ఒంగోలులోని హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు లగేజీ సర్దుకొని తల్లిదండ్రులతో తమ సొంత గ్రామాలకు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండు రద్దీగా మారింది.

Updated Date - Mar 28 , 2024 | 02:13 AM