Share News

మార్కాపురం సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:42 AM

‘మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. కేవలం మార్కాపురం సమగ్రాభివృద్ధే మా లక్ష్యం. అందుకను గుణంగానే ఆక్రమణల తొలగింపులు చేపట్టాం.

మార్కాపురం సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం

మార్కాపురం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. కేవలం మార్కాపురం సమగ్రాభివృద్ధే మా లక్ష్యం. అందుకను గుణంగానే ఆక్రమణల తొలగింపులు చేపట్టాం. మీ పార్టీలాగా మాకు విధ్వంసం సృష్టించడం చేతకాదు. అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం’ అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మార్కాపురం మున్సిపాలిటీలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు విషయంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శనివారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురాన్ని సుందరంగా తీర్చిదిద్దడం మీకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. మున్సిపల్‌ అధికారులు చట్ట ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి, కొంత సమయాన్ని కూడా ఇచ్చి ఆక్రమణల తొలగింపు ప్రారం భించారన్నారు. కేవలం రహదారి ఆక్రమణలు మాత్రమే అధికారులు తొలగిస్తున్నారన్నారు. కనీస అనుమతులు తీసుకోకుండా డీకే పట్టా భూముల్లో నిర్మించిన భవనాల నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఒక సర్వే నంబరు చూపి, మరో సర్వే నంబరులో భవనాల నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఇవన్ని చట్ట సమ్మతం కాదన్నారు. అయితే మానవతా దృక్పథంలో వాటి జోలకి వెళ్లడం లేదన్నారు. కక్ష సాధిపు దోరణి తమది కాదన్నారు. పట్టణ సుందరీకరణ కోసం ముందుకు పోతుంటే తమపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మీకు చేతనైతే మున్సిపాలిటీకి వెళ్లి రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.

పట్టణ జనాభా 20 వేలు ఉన్నప్పుడు రోడ్లు విశాలంగా ఉన్నాయన్నారు. అప్పట్లో పట్టణ మంతా కలిపినా 500 వాహనాలు కూడా లేవన్నారు. కానీ నేడు 20వేల పైచిలుకు అన్ని రకాల వాహనాలు పట్టణంలో నిత్యం తిరుగుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణంలో ట్రాపిక్‌ సమస్యలు తలెత్తకుండా ఆక్రమణ లు తొలగించడం తప్పా అన్నారు. పట్టణంలోని పదుల సంఖ్యలో భవనాల్లో సెల్లార్లు నిర్మించుకుని వాటిని అద్దెకిచ్చుకుంటున్నారన్నారు. వాటిని పార్కింగ్‌కు వినియోగించుకోండని మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు.

మీ నేతల కబ్జాలపై నెలకొకటి బయటపెడతా

వైసీపీ హయాంలో మీ నేతలు చేసిన కబ్జాలపై నెలకు ఒకటి బయట పెడతా, చర్యలు తీసుకునే ధైర్యం మీకుందా? అని ఆయన అన్నా రాంబాబును ప్రశ్నించారు. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెడ్‌ చేస్తారా? అని సవాలు విసిరారు. స్థానిక మార్కెట్‌ యార్డు సమీపంలోని 206/బి సర్వే నెంబర్‌లో 6.30 ఎకరాల చెన్నకేశవస్వామి మాన్యం ఉందన్నారు. అది మా భూమి అని దేవాదాయశాఖ బోర్డు పెట్టింది. అంతేకాక రెవెన్యూ రికార్డుల్లో రెడ్‌ మార్కు ఉందన్నారు. మీ పార్టీకి చెందిన ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి దొంగ రిజిస్ట్రేషన్‌తో ఆక్రమించాడన్నారు. అదేవిధంగా నాదెళ్ల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కూడా అక్కడ దేవాదాయశాఖ భూమిని ఆక్రమించు కున్నారన్నారు. మీకు చేతనైతే వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించాలన్నారు. అదేవిధంగా కొనకనమిట్ల మండలంలో జిల్లాలోనే అందరూ గౌరవించే పెద్ద మనిషి పాటిబండ్ల గోపాలస్వామికి చెందిన పొలాన్ని దొంగ రిజిస్ర్టేషన్‌లతో కబ్జా చేశార న్నారు. వారిపై చర్యలు తీసుకునే ధైర్యం నీకు ఉందా? అని ప్రశ్నిం చారు. తమ కార్యకర్తలు ఎక్కడైనా ఆక్రమణకు పాల్పడితే తాము చర్యలు తీసుకుంటామన్నారు.

వెలిగొండ, మెడికల్‌ కళాశాలలపై మొసలి కన్నీరా!

ఈ ప్రాంత ప్రజల జీవనాడి అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో గత కాంగ్రెస్‌, వైసీపీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఈ ప్రాంత ప్రజలు మీ పార్టీలను ఎంతగా ఆదరించినా వారి ఆశలను అడియాసలు చేశారని విమర్శించారు. మళ్లీ 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హాయంలో బడ్జెట్‌లో రూ.3,518 కోట్లు బడ్జెట్‌లో పెట్టినా మీరు నిధులు ఖర్చు చేసింది కేవలం రూ.172 కోట్లు మాత్రమే అన్నారు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం అధికారం లో ఉంటే కేవలం 2 శాతం పనులు మాత్రమే చేసింద న్నారు. ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తైంది 73.8 శాతం మాత్రమే అన్నారు. ఇంకా 26.2 శాతం పనులు పూర్తి కావాల్సివున్నా గత ముఖ్యమంత్రి జగన్‌ ప్రాజెక్టును పూర్తిచేసినట్లు శిలాఫలకాలు వేయించి ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం హాస్యాస్పదం కాదా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో ఎంతో కీలకమైన టన్నెల్‌ పనులు ఇంకా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. అంతేకాక ఫీడర్‌ కెనాల్‌ సామర్థ్యంపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. మొదటి టన్నెల్‌ ద్వారా నీళ్లు వదలొచ్చుకదా అని మీరే ప్రశ్నిస్తున్నారు. నీళ్లు వదిలితే ఎన్ని గ్రామాలు మునిగిపోతాయో తెలుసా అని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదన్నారు. నేటి నుంచి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టినా ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం మరో రెండేళ్లు పడుతుందన్నారు. మెడికల్‌ కాలేజీ విషయంలో మీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా తాత్సారం చేసిందన్నారు. నేడు తరలి పోతోందని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజస మన్నారు. కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వక పోయినా గత ప్రభుత్వం ఇష్టారీతిన కళాశాలల పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలు తరలిపోకుండా ఆపిందన్నారు. పీపీపీ పద్ధతిలో మా ప్రభుత్వం మెడికల్‌ కళాశాలను తప్పకుండా పూర్తిచేస్తుందన్నారు.ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లిఖార్జున్‌, మాలపాటి వెంకట రెడ్డి, కనిగిరి బాల వెంకటరమణ, కౌన్సిలర్‌ నాలి కొండయ్య, రంగస్వామి, బి.మల్లిఖార్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:42 AM