Share News

‘సహకారం’లో కలకలం

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:25 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో కదలిక మొదలైంది. అవినీతి, అక్రమాలపై విచారణ సమయంలో సహకార శాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ‘అక్కడంతే’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ఆయా వర్గాల్లో కలకలం రేపింది. సహకార అధికారులు కలవరపాటుకు గురయ్యారు.

‘సహకారం’లో కలకలం
ఎమ్మెల్యే దామచర్లను కలిసేందుకు ఒంగోలులోని ఆయన కార్యాలయానికి వచ్చిన సహకార శాఖ ఉద్యోగులు

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఉద్యోగుల్లో విస్తృత చర్చ

ఉలిక్కిపడిన జిల్లా, రాష్ట్ర అధికారులు

బ్యాంకు ఉద్యోగులతో మంతనాలు

సెక్షన్‌ 51 విచారణ ఆపాలంటూ దామచర్లను కలిసిన ఉద్యోగులు

తిరస్కరించిన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌

ఒంగోలు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో కదలిక మొదలైంది. అవినీతి, అక్రమాలపై విచారణ సమయంలో సహకార శాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ‘అక్కడంతే’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ఆయా వర్గాల్లో కలకలం రేపింది. సహకార అధికారులు కలవరపాటుకు గురయ్యారు. ఆశాఖ ఉద్యోగులు, అలాగే జిల్లాలోని సహకార సంఘాల పరిధిలోని రైతుల్లో విస్తృత చర్చకు దారితీసింది. గత వైసీపీ పాలనలో డీసీసీబీలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. అయితే ఆ విచారణ జరిగే సమయంలో ప్రస్తుత బ్యాంకు సీఈవో కోటిరెడ్డి అదేస్థానంలో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని, అలాగే బ్యాంకులో అక్రమాలపై సహకార శాఖ పరంగా సెక్షన్‌ 51 విచారణ చేయాలని ఆ శాఖ కమిషనర్‌, అప్కాబ్‌ ఎండీలను కోరుతూ గతనెల 21న కలెక్టర్‌ అన్సారియా ప్రత్యేకంగా లేఖ రాశారు. తదనుగుణ చర్యలు పైస్థాయి నుంచి లేకపోగా.. బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి అయిన జేసీకి కూడా ఆ లేఖ పంపాల్సి ఉన్నా జిల్లా సహకారశాఖ అధికారులు కలెక్టర్‌ను తప్పుదారి పట్టించారన్న విమర్శలు ఉన్నాయి.

విచారణ ఆపేందుకు ప్రయత్నాలు

‘ఆంధ్రజ్యోతి కథనం’తో ఈ వ్యవహారం బయటకు రావడంతో సీఈవోను ఇక్కడి నుంచి తొలగించడం మాట ఎలా ఉన్నా బ్యాంకుపై సెక్షన్‌ 51 విచారణ వేస్తే అనేక అక్రమాలు వెలుగుచూసి ఇబ్బంది పడతామన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమైంది. ఈక్రమంలో సెక్షన్‌ 51 విచారణకు ప్రభుత్వం ఆదేశించకుండా అడ్డుపడే ప్రయత్నాలు ప్రారంభించారు. బ్యాంకు వ్యవహారంలో భాగస్వామ్యం ఉండే ప్రస్తుతం జిల్లా సహకారశాఖలోని ఇద్దరు అధికారులు శనివారం ఉదయం తమకు అనుకూలంగా ఉండే పీడీసీసీబీ మెయిన్‌ బ్రాంచిలోని ఉద్యోగులతో మంతనాలు జరిపారు. అధికార పార్టీ కీలక నేత ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తే తప్ప 51 విచారణ ఆపడం సాధ్యం కాదని వారికి చెప్పారు. విచారణ కొనసాగితే బ్యాంకుపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని కనుక ఉద్యోగులు తదనుగుణ ప్రయత్నాలు చేపట్టాలని సూచించారు.


విచారణ జరగాల్సిందే : దామచర్ల

ఈనేపథ్యంలో కొందరు ఉద్యోగులు శనివారం మధ్యాహ్నం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కలిశారు. సెక్షన్‌ 51 విచారణ నిలుపుదల చేయాలని సహకారశాఖ అధికారులకు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. అయితే ఎమ్మెల్యే జనార్దన్‌ అందుకు తిరస్కరించారు. బ్యాంకులో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై విచారణకు తాను కూడా సంబంధిత మంత్రికి గతంలో లేఖ రాశానని తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటపడుతాయి కదా ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించడంతో వారు ఉసూరుమంటూ వెనుతిరిగారు. మరోవైపు బ్యాంకు ప్రస్తుత పాలకవర్గంగా ఉన్న ఉన్నతాధికారులు, ఆప్కాబ్‌, సహకార శాఖ కమిషరేట్‌లోని కొందరు అధికారులు కూడా పీడీసీసీ బ్యాంకులో ఏమి జరిగిందన్న దానిపై వివిధ మార్గాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టిన విజిలెన్స్‌ విభాగం అధికారులు తమ విచారణను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Nov 03 , 2024 | 01:25 AM