కలగానే సాగర్‌కాలువపై రెండవ వంతెన నిర్మాణం
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:21 AM
భక్తులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సాగర్ కాలువపై రెండో వంతెన నిర్మాణం ప్రభుత్వ పెద్దల హామీలకే పరిమితమైంది.
త్రిపురాంతకం, నవంబరు 3 : భక్తులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సాగర్ కాలువపై రెండో వంతెన నిర్మాణం ప్రభుత్వ పెద్దల హామీలకే పరిమితమైంది. త్రిపురాంతకం నుంచి ఆలయానికి చేరుకోవడానికి, తిరుగు పయనం కావడానికి వంతెన దాటడం ఒక్కటే మార్గం. ఈ మార్గ మధ్యలో సాగర్ కుడి కాలువ ఉండగా కాలువ నిర్మాణ సమయంలో సుమారు 12 అడుగుల వెడల్పుతో వంతెన కూడా నిర్మించారు. ఇప్పటికీ త్రిపురాంతకం నుంచి ఆలయాలకు, చెర్లోపల్లి, మిట్టపాలెం, రామసముద్రం, లేళ్లపల్లి, దువ్వలి, వై.పాలెం తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ వంతెన నుంచే ప్రయాణించాలి. ఏటా మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో వంతెన వద్ద ట్రాఫిక్ నిలుస్తూ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మూడు గంటల నుంచి ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో భక్తులు చిక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ఎన్నో ఏళ్ల నుండి భక్తులు వంతెనను వెడల్పు చేయాలని, రెండో వంతెనను నిర్మించాలని కోరుతున్నా అధికారులుకానీ, ప్రజా ప్రతినిధులుకానీ దీనిపై దృష్ఠి సారించడంలేదు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే డేవిడ్‌రాజు వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చినా అమలుచేయలేక పోయాడు. 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి సైతం అయిన ఆదిమూలపు సురేష్ 2020, 2021, 2022, 2023లలో వరసగా హామీల పరంపర కొనసాగించారు. సమీక్షల సందర్భంగా వంతెనను నిర్మిస్తామని మంత్రి హోదాలో హామీ ఇచ్చారు. ఆ హామీకి కూడా కాలం చెల్లిపోయింది. కాగా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోనైనా రెండో వంతెనను నిర్మిస్తే ఉత్సవాల సమయంలో భక్తుల ఇక్కట్లు, ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజలు కోరుతున్నారు.