Share News

అవినీతి అధికారి అవుట్‌

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:09 AM

జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేసే ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పూర్వపు ఇన్‌చార్జి డీపీవో టి.ఉషారాణిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అవినీతి అధికారి అవుట్‌
ఉషారాణిని విచారిస్తున్న త్రిసభ్య కమిటీ (ఫైల్‌)

పూర్వ ఇన్‌చార్జి డీపీవో, డీఎల్‌డీవో ఉషారాణి సస్పెన్షన్‌

ఉత్తర్వులు జారీచేసిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ

గాలిలో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేసే ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పూర్వపు ఇన్‌చార్జి డీపీవో టి.ఉషారాణిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు డీఎల్‌డీవోగా ఉన్న ఉషారాణి ఇన్‌చార్జి డీపీవోగా ఆరునెలలు పనిచేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా బదిలీలను చేపట్టాల్సిన ఉషారాణి ఇష్టారీతిన వ్యవహరించారు. ప్రధానంగా జిల్లా పంచాయతీ పరిధిలో పనిచేసే గ్రేడ్‌-5, 6(సచివాలయం) ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా బదిలీల ఉత్తర్వులు జారీచేయడంతో పెద్దఎత్తున రగడ నెలకొంది. బదిలీల్లో అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా త్రిసభ్య కమిటీని విచారణకు ఆదేశించారు. ఎస్‌డీసీ లోకేశ్వరరావు విచారణ చేసి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. పరిశీలించిన ఆమె దానిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు పంపారు. దీంతో ఉషారాణిని సస్పెండ్‌ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టడంపై పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి ఉషారాణిపై వేటు వేశారు.


గాలిలో ఉన్న ఉద్యోగులకు ఊరట

ఉషారాణి అవినీతి, అక్రమాల కారణంగా ఎక్కడా పోస్టింగ్‌లు లభించక గాలిలో ఉన్న 56మంది ఉద్యోగులకు ఊరట కలిగేలా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం గాలిలో ఉన్న సచివాలయ గ్రేడ్‌-5 ఉద్యోగులు ముగ్గురు, గ్రేడ్‌-6 ఉద్యోగులు 53 మందికి జీవో నెంబరు 11 ప్రకారం పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించారు. ఆమేరకు కలెక్టర్‌కు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే గాలిలో ఉన్న ఉద్యోగుల వివరాలను రూపొందించిన పంచాయతీ అధికారులు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు అందజేశారు. వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఆమె ప్రొసీడింగ్స్‌ ఇవ్వనున్నారు. అందుకు అవసరమైన ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు బుధవారం చేపట్టారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఆ ఉద్యోగులను నియమించనున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 01:09 AM