Share News

మెప్మాలో మెక్కుడు

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:12 AM

మెప్మాలో కొందరురిసోర్స్‌ పర్సన్‌(ఆర్పీ)లు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పొదుపు సభ్యులకు అందుబాటులో ఉండి సంఘాల బలోపేతానికి అవసరమైన సమావేశాలు నిర్వహించాల్సిన వీరు రూటుమార్చి అక్రమార్జనే ధ్యేయంగా బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో నకిలీ గ్రూపులు సృష్టించి కోట్లు గోల్‌మాల్‌ చేసిన విషయం విదితమే.

మెప్మాలో మెక్కుడు

రెచ్చిపోతున్న రిసోర్సుపర్సన్లు

రూ.8వేల వేతనం.. లక్షల్లో ఆదాయం

నకిలీ గ్రూపులతో బ్యాంకులకు బురిడీ

పొదుపు సంఘాలకు రుణాల మంజూరుకు మామూళ్లు

ఎమ్మెల్యే చెప్పినా లోన్‌ ఇప్పించం.. కొందరు వైసీపీ ఆర్పీల తెగింపు

ప్రశ్నించిన మహిళలపై నోరు పారేసుకుంటున్న వైనం

మెప్మాలో అవినీతిపర్వం షరామామూలైంది. కొందరు రిసోర్సుపర్సన్లు రెచ్చిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో బోగస్‌ గ్రూపులతో రూ.40 కోట్లకుపైనే రుణ దోపిడీకి పాల్పడగా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. అయితే అప్పట్లో వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు మొక్కుబడి విచారణ చేసి కేవలం ఐదుగురు ఆర్పీలపైనే చర్యలు తీసుకుని ఆ కుంభకోణాన్ని వదిలేశారు. కాగా ఈ నకిలీ గ్రూపులలో చాలామంది కీలకంగా వ్యవహరించినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యమైంది. రుణ దందాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పనిలో పనిగా పొదుపు గ్రూపుల నుంచి దర్జాగా మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారి హెచ్చరించినా సరే ఆగడం లేదు. పోస్టు ఉన్నప్పుడే లక్షలు దండుకోవాలి అన్నవిధంగా దూసుకుపోతున్నారు.

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మెప్మాలో కొందరురిసోర్స్‌ పర్సన్‌(ఆర్పీ)లు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పొదుపు సభ్యులకు అందుబాటులో ఉండి సంఘాల బలోపేతానికి అవసరమైన సమావేశాలు నిర్వహించాల్సిన వీరు రూటుమార్చి అక్రమార్జనే ధ్యేయంగా బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో నకిలీ గ్రూపులు సృష్టించి కోట్లు గోల్‌మాల్‌ చేసిన విషయం విదితమే. అందులో కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించారు. రూ.40కోట్లకుపైనే రుణ కుంభకోణం జరిగినట్లు ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన అప్పటి ఉన్నతాధికారులు దీనిపై ఎల్‌డీఎం, పౌరసరఫరాల శాఖ అధికారి, డీఆర్‌డీఏ పీడీని విచారణాధికారులుగా నియమించారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 140మంది ఆర్పీలు మెప్మాలో పనిచేస్తుండగా, ఐదుగురిపైనే చర్యలు తీసుకుని ఆ వ్యవహారాన్ని మొక్కుబడిగా ముగించేశారు. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన కొందరు ఆర్పీలు తమపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ప్రస్తుతం రెచ్చిపోతున్నారు. మళ్లీ బోగస్‌ దందాకు తెరలేపారు.

పేదల సొమ్ముతో భారీగా ఆస్తులు

ఆర్పీల నెల వేతనం రూ.8వేలు. అయితే రుణాల మంజూరుకు సభ్యుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. కొందరైతే నకిలీ గ్రూపులను సృష్టించి లక్షలాది రూపాయల రుణాలను మింగేస్తున్నారు. వారు పేద కుటుంబానికి చెందిన వారై ఉండాలని ప్రభుత్వం చెబుతుండగా, ప్రస్తుతం చాలావరకు ఆధునిక భవంతులు, అందమైన కార్లు, బంగారు ఆభరణాలతో దర్జా అనుభవిస్తున్నారు. ఇటీవల శర్మ కాలేజీ సమీపంలోని ఓ ఆర్పీ కట్టిన ఇల్లు చూసి అటువైపుగా వెళుతున్న పీడీ రవికుమార్‌ ఆశ్చర్యపోయినట్లు సమాచారం. అలాంటి వారు నగరంలో చాలామంది ఉన్నట్లు ఆ శాఖలో చర్చ నడుస్తోంది. వారికి గత ప్రభుత్వ హయాం బాగా కలిసొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆర్పీలకు అండగా ఉంటూ వారికి పొదుపు సభ్యుల ఆధార్‌ కార్డులను మెప్మా కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కార్యాలయంలోని కొందరు సీవోలు తమ వంతుగా సహకరిస్తున్నారు. ఇదిలా ఉంచితే ఒంగోలు నుంచి ఇటీవల కందుకూరుకు బదిలీ అయిన ఓ కమ్యూనిటీ ఆర్గనైజర్‌ (సీవో) తాను ఒంగోలులో ఆర్పీగా ఉన్నపుడు ఉన్న పలుకుబడితో బ్యాంకర్లకు సిఫార్సులు చేస్తూ నకిలీ గ్రూపుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఆర్పీల అర్హతలూ.. విధులు..

ఆర్పీగా ఉండేవారు స్వయం సహాయక సంఘ మహిళా సభ్యురాలై ఉండాలి. అంతేకాకుండా నిరుపేద కుటుంబానికి చెంది, అదే స్లమ్‌/పట్టణ వాసి అయి ఉండాలి. 18ఏళ్ల నుంచి 40ఏళ్ల వయస్సు కలిగి చురుగ్గా ఉండాలి. స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌కు కనీస 10వతరగతి, టౌన్‌ లెవెల్‌ ఫెడరేషన్‌కు ఇంటర్‌ విద్యార్హత తప్పనిసరి. సంఘాలలో మూడు నుంచి ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.వీరు సంఘంలోని పేద కుటుంబాల కోసం పనిచేయగలిగి, సభ్యుల ఆర్థికాభివృద్ధికి సమావేశాలు నిర్వహించి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. సమర్థవంతగా ఉంటూ, ఆదర్శవంతమైన సభ్యురాలిగా ఉంటేనే ఆర్పీలుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి నిజాయితీ, సహనం, నిబద్ధత, సేవాతత్వం కలిగి, అన్నీ సంఘాల సభ్యుల ఆమోదం పొందిన వారై ఉండాలి. వాటితోపాటు మొబైల్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. నెలలో కనీసం 25 రోజులు సంఘ సమావేశాలు నిర్వహించి అందుకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్‌ చేసినప్పుడే వారికి నెలకు రూ.8వేలు వేతనంగా చెల్లిస్తారు.


దామచర్ల చెప్పినా రుణాలు ఇవ్వం

నగరంలో ఆర్పీల అవినీతి దందాపై పొదుపు సంఽఘాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన కొందరు ఆర్పీలు నేటికీ పనితీరు మార్చుకోలేదు. ఇటీవల ఓ పొదుపు సంఘానికి సంబంధించి సమాఖ్యలో రుణం ఇవ్వాలని సభ్యురాలు అడిగితే వైసీపీ ముద్ర ఉన్న ఆర్పీ దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. ‘ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పినా రుణం ఇవ్వం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’ అంటూ నెలరోజులపాటు తన ఇంటి చుట్టూ తిప్పించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా నగరంలోని అత్యధిక శాతం మంది ఆర్పీలు పొదుపు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్‌ గ్రూపునకు రూ.20లక్షలు మంజూరైతే కచ్ఛితంగా పర్సంటేజీ ఇవ్వాల్సిందే. ఎవరైనా సభ్యులు ప్రశ్నిస్తే వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బ్యాంకులలో పొదుపు, వ్యక్తిగత రుణాల మంజూరుకు అభ్యంతరాలు తెలియజేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి ఆర్పీలపై కనీస చర్యలు లేకపోవడం పట్ల పలువురు పొదుపు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్లు దాటినా మార్పులు లేవు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లమ్‌/పట్టణ సమాఖ్య రిసోర్స్‌ పర్సన్‌(ఆర్పీ)ల కాల పరిమితి మూడేళ్లు మాత్రమే. పనితీరు బాగుంటే కొనసాగించవచ్చు. లేదంటే కొత్త వారిని ఆ సమాఖ్యలు ఎంపిక చేసుకోవాలి. ప్రతి సంవత్సరం టీఎల్‌ఎఫ్‌ల పనితీరుపై సమాఖ్య మహాసభ సమావేశంలో సమీక్షించి, ఆ ఆర్పీల పనితీరు ఆధారంగా గౌరవ వేతనం నిర్ణయించాలి. వారి సేవల్లో విమర్శలు, అవినీతి, అవకతవకలు, సభ్యుల పట్ల దురుసు ప్రవర్తన, నిర్లక్ష్యం ఉన్నట్లయితే వారిని తొలగించే అవకాశం ఉంది. అయితే ఒంగోలులో 140మందికిపైగా పనిచేస్తుండగా గత పది, పదిహేనేళ్లు వాళ్లే కొనసాగుతున్నారు. కొత్తగా మార్పులేమీ లేవు. కొందరు ఆర్పీలు, అవినీతి, అక్రమాలతో కోట్లకు పడగలెత్తుతున్నా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా మెప్మాలో చోటుచేసుకున్న పరిణామాలపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారించి ఆర్పీల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పలువురు సభ్యులు కోరుతున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 01:12 AM