అనవసర రాద్ధాంతాల వేదికగా కౌన్సిల్
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:32 PM
చీరాల మున్సిపల్ పాలకవర్గం ప్రజల సమస్యలకన్నా తమ వ్యక్తిగత ఆధిపత్యాలను ప్రదర్శించేందుకు కౌన్సిల్ సమావేశాలను వేదికగా చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన కౌన్సిల్ సమావేశాలన్నీ దాదాపు అదే రీతిన (ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఎక్స్‌అఫిషియో మెంబరుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సమావేశం తప్ప) జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశం కూడా అదే వరసతో రసాభాసగా మారింది.
సభను వాయిదా వేసిన చైర్మన్
చీరాల మున్సిపల్ సమావేశం రసాభాస
చైర్మన్ కుర్చీకి విలువలేదన్న కౌన్సిలర్ సత్యానందం
అతన్ని సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన వైసీపీ కౌన్సిలర్లు
చీరాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : చీరాల మున్సిపల్ పాలకవర్గం ప్రజల సమస్యలకన్నా తమ వ్యక్తిగత ఆధిపత్యాలను ప్రదర్శించేందుకు కౌన్సిల్ సమావేశాలను వేదికగా చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన కౌన్సిల్ సమావేశాలన్నీ దాదాపు అదే రీతిన (ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఎక్స్‌అఫిషియో మెంబరుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సమావేశం తప్ప) జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశం కూడా అదే వరసతో రసాభాసగా మారింది. అజెండాలో మొత్తం 26 అంశాలు ఉన్నాయి. వాటిని సభకు తెలిపి ఆమోదం పొందే క్రమంలో 4 అంశాలు కొద్ది పాటి చర్చతో ఆమోదం పొందాయి. ప్రస్తుతం అజెండాలో పొందు పరిచిన విగ్రహాల ఏర్పాటుకు సంబంఽధించిన అంశాలు కాకుండా భవష్యత్‌లో ఎవరు విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నా కారంచేడు రోడ్డులోని ఎస్‌ఎస్ ట్యాంక్ వద్ద ఉన్న ఉన్న మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేసేవిధంగా సవరణ చేస్తూ వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటును ఆమోదించారు. తరువాత 5,6,7 అంశాలకు సంబంధించి మురుగు కాలువల్లో పూడికల తొలగింపునకు సంబంధించి కౌన్సిలర్ పాపిశెట్టి సురేష్ నిధుల వివరాలను అడిగారు. కౌన్సిలర్ మామిడాల రాములు మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో వ్యాపార సమూహాలు ఎక్కువగా ఉన్నందున సంక్రాంతి పండుగ తరువాత మురుగు కాలువల్లో పూడిక పనులు చేపట్టాలని అధికారులకు చెప్తూ, దూరదూరంగా ఉన్న మ్యాన్‌హోల్స్ వద్ద మాత్రమే కాకుండా కాలువలల్లో ఉన్న పూడికను పూర్తిగా తొలగించేవిధం గా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై కౌన్సిలర్ సత్యానందం మాట్లాడు తూ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు పారిశుధ్య చర్యలు బాగా జరుగుతున్నాయని, వాటిని వక్రీకరించవద్దన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు ఎవరు, ఎవరిని ఏం అంటున్నారో కూడా అర్థం కాకుండా పెద్దపెద్దగా వాదులాటకు దిగారు. పార్టీలు మారావని వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోషణలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చైర్మన్ జంజనం మాట్లాడుతూ చైర్మన్ కుర్చీలో ఉన్నప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా తాను వ్యవహరిస్తున్నానని సంయమనం పాటించాలని చెప్పారు. దీనిపై సత్యానందం చైర్మన్ కుర్చీకి విలువే లేదని ఒకటికి రెండుమూడు సార్లు అన్నారు. దీంతో సభలో మరలా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు మధ్య మాటల తూటాలు పేలాయి. ఈనేపథ్యంలో కౌన్సిలర్ సత్యానందంను సస్పెండ్ చేయాలని వైసీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ కుర్చీని కించపరుస్తూ సత్యానందం మాట్లాడినందుకు సభను వాయిదా వేనినట్లు ప్రకటించి జంజనం సభ నుంచి వెళ్లిపోయారు. తరువాత కౌన్సిలర్లు మూడు గ్రూపులుగా బయటకు వెళ్లారు. ఆ తరువాత కొంతసేపు అధికారులు తర్జన, భర్జన పడి వారు వెళ్లిపోయారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపం తెలిపారు.
సస్పెండ్ చేయాల్సింది ఎవరు?
వాస్తవానికి ఒక కౌన్సిలర్‌ను సస్పెండ్ చేయాలంటే అందుకు కౌన్సిల్ ఆమోదం కావాలి. అందులో ఓటింగ్ జరగాలి. తద్వారా మాత్రమే ఒక కౌన్సిలర్‌ను సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
గతంలో 3 నెలలు సస్పెండైన కౌన్సిలర్ సత్యానందం
గతంలో ఓ పర్యాయం కౌన్సిలర్ సత్యానందంను 3 నెలలు సభ నుంచి సస్పెండ్ చేశారు. అప్పుడు పోడియం ద గ్గరకు వచ్చి పేపర్లు విసిరినందుకు తరువాత 3 నెలలు సస్పెండ్ చేశారు. అయితే అప్పట్లో వైసీపీ కౌన్సిలర్లు అత్యధికంగా ఉండడంతో ఎలాంటి బలనిరూపణ లేకుండానే సత్యానందను సస్పెన్షన్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం సత్యానందంను సస్పెండ్ చేయాలంటే మరలా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. మెజార్టీ సభ్యుల ఆమోదం కావాలి. ప్రస్తుతం 33 మందిలో 14 మంది టీడీపీ, 14 మంది వైసీపీ, ఐదుగురు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. దీంతో సస్పెన్షన్ ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కమిషనర్‌కు పరస్పరం ఫిర్యాదులు
సభలో చైర్మన్ కుర్చీకి విలువలేదంటూ కౌన్సిలర్ సత్యానందం చేసిన వ్యాఖ్యలపై అతన్ని సస్పెండ్ చేయాలని చైర్మన్ జంజనం శ్రీనివాసరావు రాతపూర్వకంగా కమిషనర్ అబ్దుల్ రషీద్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాము మాట్లాడే సమయంలో చైర్మన్ అమర్యాదగా మాట్లాడి, సభను వాయిదా వేసి వెళ్లిపోవడం సరికాదని, అందుకు చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ సత్యానందం, మిగిలిన టీడీపీ కౌన్సిలర్లు కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అర్ధాంతరంగా ఆగిన అజెండాలోని అంశాలకు ఆమోదం
సభను వాయిదా వేయడంతో అజెండాలోని మిగిలిన అంశాల ఆమోదం లేదా రద్దు లేదా వాయిదా అనేది తేలకుండానే సభ ఆగింది. కౌన్సిల్ సమావేశం నిర్వహణకు కొన్ని వేల రూపాయాలను ప్రతి నెలా ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత రాద్ధాంతాలకు పాలకవర్గం ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.