దేశ అభివృద్ధిలో సీపీఐ పోరాటాలదే కీలక పాత్ర
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:09 AM
దేశంలో భూ పోరాటాల ద్వారా లక్షలాది మంది పేదలకు భూమిని పంపిణీ చేసి, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)దేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య చెప్పారు. సీపీఐ శతాబ్ధి ఉత్సవాలు గురువారం ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సీనియర్ నేత నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పేదల కోసం ప్రతి నిత్యం పోరాటం
పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య
ఒంగోలులో ఘనంగా సీపీఐ శతాబ్ధి ఉత్సవాలు
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో భూ పోరాటాల ద్వారా లక్షలాది మంది పేదలకు భూమిని పంపిణీ చేసి, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)దేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య చెప్పారు. సీపీఐ శతాబ్ధి ఉత్సవాలు గురువారం ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సీనియర్ నేత నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారీ కేక్‌ను శ్రేణుల మధ్య కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏడాదిపాటు ఈ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వందేళ్లుగా యువకులు, విద్యార్థులు, కళాకారులు, రచయితలు, మేథావులను ఏకం చేసి పోరాటాలు చేసిన ఘనత సీపీఐదేనని చెప్పారు. పార్టీ అధికారంలోకి రాకపోయినా దేశాభివృద్ధిలో కీలక పాత్రపోషించిందని తెలిపారు. భూస్వామ్య, జమీందారీ, జాగీరుదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ పీజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ సోషలిజం, సమసమాజం కోసం పోరాటాలకు పునరంకితం అవుదామన్నారు. రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) మాట్లాడుతూ దున్నేవారికే భూమి దక్కాలని, దేశంలో తొలిసారి నినాదం చేసిన పార్టీ సీపీఐ అన్నారు. జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ సీపీఐ శతాబ్ధి ముగింపు ఉత్సవాలను జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎర్రజెండాలు చేతపట్టి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరవది సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.వెంకట్రావు, ఎం.వెంకయ్య, నగరకార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసులు, సీనియర్ అడ్వకేట్ ముదవర్తి రాఘవరావు, కారుమూడి నాగేశ్వరరావు, కే అంజయ్య, ఎంఎల్ సలార్, సీహెచ్ వెంకటేశ్వర్లు, సుభాన్‌నాయుడు, ఎస్‌డీ సర్ధార్ పాల్గొన్నారు.