Share News

సాగు, తాగునీటి సమస్యలను తీర్చాలి

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:46 PM

సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు.

సాగు, తాగునీటి  సమస్యలను తీర్చాలి
చంద్రబాబుకు సమస్యలను వివరిస్తున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే బీఎన్‌

ఒంగోలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఆలాగే పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం జరిగిన గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి బీఎన్‌ పలు అంశాలను తీసుకెళ్ళారు. ఎన్‌జీపాడు, మద్దిపాడు మండలాల్లో గుండ్లకమ్మనది ప్రవహిస్తున్న అనేక గ్రామాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందడం లేదన్నారు. వాటి పరిష్కారం కోసం గుండ్లకమ్మనదిపై రెండు చోట్ల చెక్‌డ్యామ్‌లను గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేయగా వైసీపీ వచ్చాక పట్టించుకోలేదని చెప్పారు. అందువల్ల ఆ రెండు చెక్‌డ్యామ్‌లను తక్షణం నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలాగే నియోజకవర్గంలో జలజీవన్‌ మిషన్‌ పథకం పనులు, సీసీరోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాల మెరుగుకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. అదే సమయంలో ఎన్‌ఎన్‌పాడు నియోజకవర్గం నుంచి నాలుగు జాతీయ రహదారులు వెళ్తున్నాయని, వాటన్నింటిని కలుపుతూ ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని బీఎన్‌ వినతి చేశారు.

Updated Date - Sep 20 , 2024 | 11:46 PM