Share News

సాగు జోరు

ABN , Publish Date - Nov 10 , 2024 | 11:37 PM

జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. రబీలో కీలక పంటలైన పొగాకు, వరి, మిర్చి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఖరీ్‌ఫలో సాగు చేసిన కంది, పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న వంటివి కళకళలాడుతున్నాయి.

సాగు జోరు
త్రిపురాంతకం ప్రాంతంలో మిర్చి పైరులో మందు పిచికారీ చేస్తున్న రైతు

ముమ్మరంగా రబీ పనులు

ఊపందుకున్న పొగాకు, మిర్చి, వరినాట్లు

కళకళలాడుతున్న ఖరీఫ్‌ పైర్లు

మరోసారి వర్షం కురిస్తే శనగ,

పొగాకు మరింత పెరిగే అవకాశం

ఒంగోలు నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. రబీలో కీలక పంటలైన పొగాకు, వరి, మిర్చి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఖరీ్‌ఫలో సాగు చేసిన కంది, పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న వంటివి కళకళలాడుతున్నాయి. ఆపైర్లతోపాటు రబీ ఆరంభంలో వేసిన వరి, మిర్చి పొలంలో ముమ్మరంగా కలుపు తీత, ఇతరత్రా పనుల్లో రైతులు, కూలీలు బిజీ అయ్యారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావం నెలకొనడంతో పూర్తిస్థాయిలో పంటలను రైతులు సాగు చేయలేకపోయారు. ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 2.02 లక్షల హెక్టార్లు కాగా సుమారు లక్షా 62వేల హెక్టార్లలో మాత్రమే వేశారు. అందులో సుమారు 70వేల హెక్టార్లలో ప్రధాన పంట అయిన కంది ఉంది. 22 వేల హెక్టార్లలో మిర్చి, 12వేల హెక్టార్లలో పత్తి, దాదాపు 10వేల హెక్టార్లలో వరి, మరో 6వేల హెక్టార్లలో సజ్జ సాగు చేశారు. సజ్జ కోతలు పూర్తయ్యింది. ఇతర పంటలు పూత, పిందె దశల్లో ఉన్నాయి. గత నెలలో విస్తారంగా కురిసిన వర్షాలు ఈ పంటలకు బాగా లాభించాయి.


32,315 హెక్టార్లలో రబీ పైర్ల సాగు

రబీ సాగు కూడా జిల్లాలో ముమ్మరమైంది. ఈ సీజన్‌ సాధారణ విస్తీర్ణం లక్షా 61వేల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు దాదాపు 32,315 హెక్టార్లలో పంటలు పడ్డాయి. ఈ సీజన్‌లో ప్రధానంగా సాగు చేసే పొగాకు, వరి, శనగ, మినుము, ఆలసంద, మిర్చి పంటలను ముమ్మరంగా వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 9వేల హెక్టార్లలో మినుము, ఆరువేల హెక్టార్లలో పొగాకు, మూడున్నర వేల హెక్టార్లలో వరి, మూడున్నర వేల హెక్టార్లలో శనగ, ఐదున్నర వేల హెక్టార్లలో అలసంద వంటివి సాగు చేశారు. గత నెలలో కురిసిన వర్షాలు సాగుకు బాగా ఉపకరించాయి. పుష్కలంగా సాగర్‌ నీరు వస్తుండటం కూడా లాభించింది. మరోసారి ఒక మోస్తరు వర్షం కురిస్తే మరింత విస్తారంగా పొగాకు, శనగ పంటలను రైతులు సాగు చేయనున్నారు. మొత్తంగా జిల్లాలో ప్రస్తుతం ఏప్రాంతంలో చూసినా వ్యవసాయ పనులతో రైతులు బిజీబిజీగా కనిపిస్తున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 11:37 PM