సాగు జోరు
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:43 AM
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, పొగాకు, కందితోపాటు కూరగాయల పైర్లు ప్రాణం పోసుకున్నాయి. ప్రస్తుతం కళకళలాడుతున్నాయి.
వ్యవసాయ పనులు ముమ్మరం
ఉపకరించిన ఇటీవలి వర్షాలు
పశ్చిమాన మిర్చి, పొగాకు నాట్లు ప్రారంభం
నీటి వనరుల కింద వరి నారుమళ్లు
కళకళలాడుతున్న మెట్ట పైర్లు
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, పొగాకు, కందితోపాటు కూరగాయల పైర్లు ప్రాణం పోసుకున్నాయి. ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. గత నెలాఖరు వరకూ వర్షాభావంతో కొట్టుమిట్టాడిన రైతన్నలు ఊపిరిపీల్చుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో అధికంగా పత్తి పంట వేయగా ప్రస్తుతం అది ఏపు మీద ఉంది. తూర్పుప్రాంతంలో శనగ, పొగాకు సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. తాజా వర్షాలకు గుండ్లకమ్మతోపాటు చిన్నచిన్న వాగులు, వంకల్లో నీళ్లు పారాయి. చెరువులకు నీరు రావడంతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతన్నలు పైర్లలో కలుపు తీయించుకోవడం, బలం మందు పెట్టుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.
ఒంగోలు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి)/మార్కాపురం రూరల్/కొండపి : జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలు అందుకు ఉపకరించాయి. అప్పటికే వేసి ఉన్న మెట్ట పైర్లు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. కొత్తగా పంటల సాగు జోరందుకుంది. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 27వేల హెక్టార్లలో అదనంగా పంటలు సాగయ్యాయి. ప్రధానంగా పశ్చిమప్రాంతంలో మిర్చి, పొగాకు నాట్లు ఊపందుకొన్నాయి. నీటి వనరుల కింద అక్కడక్కడా వరినాట్లు వేస్తున్నారు. అలాగే వరి నారుమళ్లను సిద్ధం చేయడంతోపాటు ఇతర మెట్ట పైర్ల సాగుకు రైతులు భూములను సిద్ధం చేస్తున్నారు. ఇలా పొలం పనుల్లో అందరూ బిజీ అయ్యారు.
ఇటీవల వరకు వర్షాభావం..
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ముందుకు సాగలేదు. అవసరమైన స్థాయిలో వర్షం లేక ఈ పరిస్థితి ఏర్పడింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్ కాగా ఆ సమయంలో జిల్లాలో 2.02 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారు. అందులో అత్యధికంగా 73వేల హెక్టార్‌లలో కంది, 31,562 హెక్టార్లలో పత్తి ఉంటుంది. మిగిలిన వాటిలో సజ్జ, నువ్వు, మిర్చి, వరి ప్రధానమైవి. కాగా ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో పంటల సాగు ముందుకు కదలలేదు. ఆగస్టు ఆఖరు నాటికి సాధారణంగా సుమారు 1.50లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఈ ఏడాది కేవలం 62,530 హెక్టార్లలో (31శాతం) మాత్రమే వేశారు. ఇక ఈ ఏడాది ఖరీఫ్‌కు కరువు కాటు తప్పదన్న ఆందోళన రైతుల్లో కనిపించింది. ఈ సమయంలో వర్షం కురిసింది.
రెండు రోజుల్లో 95 మి.మీ సగటు వర్షపాతం
పంటల సాగుపై రైతుల్లో ఆశలు మోడువారుతున్న సమయంలో ఈనెల ఆరంభంలో భారీ వర్షాలు కురిశాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలో ఇంచుమించు 95మి.మీ. సగటు వర్షపాతం జిల్లాలో నమోదైంది. తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న పశ్చిమప్రాంతంలో భారీ వర్షాలే కురిశాయి. వాగులు, వంకలు, చెరువుల్లోకి నీరు చేరింది. మరోవైపు సాగుకు సాగర్ నీరు విడుదలైంది. ఈ పరిణామాలు రైతుల్లో మళ్లీ ఆశలను చిగురింపజేశాయి. దీంతో పొలం పనులకు ఉపక్రమించారు. ప్రధానంగా పశ్చిమప్రాంతంలో మిర్చి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎర్రనేలల్లో పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. సాగర్ ఆయకట్టులో వరిసాగుకు నార్లు పోస్తుండగా బోర్ల నీరు అవకాశం ఉన్న ప్రాంతంలో వరినాట్లు కూడా వేస్తున్నారు. అలా గత వారం రోజుల్లో సుమారు 27వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి.
89,706 హెక్టార్లలో పంటల సాగు
ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ సుమారు 89,706 హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు సమాచారం. ఇంకా మెట్ట పైర్లు వేసేందుకు వీలుగా పలుప్రాంతాల్లో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. తాజా వర్షాలు పొలంలో ఉన్న పైర్లకు బాగా మేలు చేశాయి. ప్రధానంగా వాడుముఖం పట్టిన సజ్జ, కంది, పత్తి, మొక్కజొన్న ఇతరత్రా పైర్లు జీవంపోసుకొని కళకళలాడుతు న్నాయి. రానున్న వారంపది రోజుల్లో మరింత విస్తారంగా పంటలు సాగు జరగనుంది.