Share News

పంటలు, రోడ్లకు నష్టం

ABN , Publish Date - Oct 21 , 2024 | 10:50 PM

దర్శి ప్రాంతంలో విడవకుండా కురుస్తున్న వర్షంతో అటు పంటలు, ఇటు రోడ్లు దెబ్బతింటున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పైర్లు ఉరకలెత్తి దెబ్బతింటుండటంతో అన్నదాతలు ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు

పంటలు, రోడ్లకు నష్టం
దొనకొండలో వర్షపు నీటిలో మునిగిన పొగాకు పంట

ఉరకలెత్తుతున్న పైర్లు

అల్లాడుతున్న రైతులు

రోడ్లు మరింత ఛిద్రం

వెంటాడుతున్న గత పాలకుల నిర్లక్ష్యం

దర్శి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : దర్శి ప్రాంతంలో విడవకుండా కురుస్తున్న వర్షంతో అటు పంటలు, ఇటు రోడ్లు దెబ్బతింటున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పైర్లు ఉరకలెత్తి దెబ్బతింటుండటంతో అన్నదాతలు ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. మండలంలోని మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, చందలూరు తదితర గ్రామాల్లో సాగుచేసిన మిర్చి పొలాల్లోకి వర్షపునీరు భారీగా చేరింది. ఏపుగా పెరుగుతున్న మిర్చిపైరు ఉరకలెత్తుతోంది. సజ్జ పంట పండి కోతలు కోసి కల్లాలు చేసే సమయంలో వరుసగా వారం రోజుల పాటు వర్షం కురవటంతో అనేకచోట్ల ఓదెలు తడిసిపోయాయి. సజ్జలు రంగుమారే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వైట్‌ బర్లీ పొగాకు కూడా ఉరకెత్తుతోంది. పూత దశలో ఉన్న కంది పైరు కూడా దెబ్బతింటోంది. ఇంతటితో వర్షం ఆగిపోతే కొద్దిపాటి నష్టంతో రైతులు బయటపడే అవకాశం ఉంది. ఇంకా వర్షాలు కురిస్తే సాగుచేసిన అన్నీ పంటలు పూర్తిగా దెబ్బతింటాయని వారు ఆందోళన చెందుతున్నారు.

దొనకొండలో...

దొనకొండ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : మండలంలో సాగు చేసిన పొగాకు పంటలో నీరు నిలిచి ఉరకెత్తి ఆకు ఎర్రగా వాడిపోతోందని, పత్తి కాయలు నల్లగా మారి గుడ్డికాయలుగా మారుతున్నాయని, మిరప చేనులో నీరు నిలవటంతో తేమశాతం ఎక్కువై మొక్కలు కుళ్లిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. విడవని వర్షాలకు గ్రామాల్లో మట్టిరోడ్లు బురదమయమై ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధ్వానంగా కురిచేడు-పేరుంబొట్లపాలెం రోడ్డు

కురిచేడు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : కురిచేడు-పేరుంబొట్లపాలెం రోడ్డు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాటంవారిపల్లె, పేరుంబొట్లపాలెం గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులను పలుమార్లు రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల క్రితం రోడ్డు నిర్మాణానికి రూ.2.5 కోట్లు నిధులు మంజూరైనా పనులు పూర్తి కాలేదు. సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డంతా ఛిద్రంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాటంవారిపల్లె, పేరుంబొట్లపాలెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

గంటపాటు భారీ వర్షం

కురిచేడులో సోమవారం భారీవర్షం కురిసింది. గంటపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాల్వలు నిండి మురుగు నీరు రోడ్డు మీదకు వచ్చింది. పొలాల్లో నీరు నిలిచింది. మెట్ట పంటలు ఇప్పటికే దెబ్బతినగా తాజా వర్షంతో రైతులకు మరింత నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాలలో వేసిన పొగాకు పంట నేల వాలడమే కాక ఆకుపై ఉన్న జిడ్డు కారిపోయిందని రైతులు వాపోతున్నారు. ఆకులు సైతం ఎర్ర రంగులోకి మారాయి. మిర్చి పంట మొక్కలు సైతం నేలవాలాయి. పత్తికాయలు నల్లగా మారాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కాలువను తలపించిన రోడ్లు

కనిగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి పట్టణంలో సోమవారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ ఛిద్రంగా మారి పంట కాలువలను తలపించాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రామాలయం వీధి, ఓవీ రోడ్డులోని డ్రైనేజీలు పూడిపోవటంతో వర్షం నీరుతోపాటు మురుగుకూడా రోడ్లపైకి చేరింది. ఒంగోలు బస్టాండు, పామూరు బస్టాండు సెంటర్లలో రోడ్లపై నీరు కాలువలా ప్రవహించి పామూరు హైవే రోడ్డుపై పెట్రోలు బంక్‌ల వద్దకు చేరుకున్నాయి. అక్కడ పెద్ద నీటి గుంతగా మారింది. ఆ పక్కనే ఉన్న వాగు కబ్జాకు గురికావటంతో వాగులోని మురుగు నీరు కూడా రోడ్డుపైకి చేరింది. అదేవిధంగా కందుకూరు రోడ్డు నుంచి పాత శంఖవరం గ్రామానికి వెళ్లే రహదారి గుంతలు పడి అధ్వానంగా తయారైంది. గ్రానైట్‌ క్వారీ వాహనాలు ఆ రోడ్డులో రావటంతో రోడ్డంతా పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. గత వైసీపీ పాలనలో రోడ్ల బాగోగులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మరింత దరిద్రంగా తయారయ్యాయి.

Updated Date - Oct 21 , 2024 | 10:50 PM