ఆ క్వారీలతో ప్రమాదం!
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:16 PM
గ్రానైట్ క్వారీలలో పనులు నిలిపి వేసి ఉన్న ప్రదేశాలలో ఉన్న నీటితో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నిబంధనల మేరకు పనులు చేయాల్సిన వారు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ఎలాంటి ప్రతిఫలం లేకపోవడంతో క్వారీలను నిలుపుదల చేశారు. తవ్వకాలు చేసిన గుంటలలో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచి ఉంది.
బల్లికురవ మండలంలో పలు చోట్ల పనులు నిలిపివేత
ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున నిలిచిన నీరు
పొలాలకు వెళ్లే రైతులు, పశువులకు పొంచి ఉన్న ముప్పు
ఆందోళనలో ప్రజలు
బల్లికురవ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గ్రానైట్ క్వారీలలో పనులు నిలిపి వేసి ఉన్న ప్రదేశాలలో ఉన్న నీటితో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నిబంధనల మేరకు పనులు చేయాల్సిన వారు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ఎలాంటి ప్రతిఫలం లేకపోవడంతో క్వారీలను నిలుపుదల చేశారు. తవ్వకాలు చేసిన గుంటలలో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో పొలాలకు వెళ్లే రైతులు, ఈతకు వెళ్లే విద్యార్థులు, పశువులు ఏ సమయంలో ప్రమాదంబారిన పడతాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కనీసం పనులు నిలిపి ఉన్న నేల క్వారీల వద్ద చుట్టూ రక్షణ చర్యలు కూడా లేవని వారు తెలిపారు.
బల్లికురవ మండలంలోని కొణిదెన, బల్లికురవ, మల్లాయపాలెం, కొండాయపాలెం, ఉప్పుమాగులూరు గ్రామాల పరిధిలో అత్యధికంగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. కొన్ని కొండల భాగంలో ఉండగా, మరికొన్ని నేల భాగంలో ఉన్నాయి. ఈ క్వారీల నుంచి గ్రానైట్ నిక్షేపాలను తవ్వి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నేల క్వారీలలో పనులు చేసిన వారు నష్టాల బారిన పడుతున్నారు. ఖర్చు ఎక్కువ కావడంతో పాటు నాణ్యత సరిగా లేకపోవడంతో కొన్ని క్వారీలు కొంత కాలం నుంచి మూత పడి ఉన్నాయి. ఈ క్వారీలలో పనులు చేయకపోవడంతో ఇప్పటి వరకు తవ్వకాలు చేసిన గుంటలలో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిబడి ఉంది. సుమారు 20 అడుగుల లోతు వరకు నీరు ఉంది. మాజీ ఎమ్మెల్యేకు చెందిన నేల క్వారీ మల్లాయపాలెం, వేమవరం గ్రామాల మధ్య కొంత కాలం నుంచి పూర్తిగా మూతపడి ఉంది. ఈ క్వారీలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బావులను తలపించేలా నీరు ఉండడంతో పశువుల కాపరులు భయపడుతున్నాఉ. పశువులు లోపలికి వెళితే తమకు రక్షణ ఎక్కడని క్వారీ నలు వైపులా రక్షణ చర్యలు లేవని పనులు చేయకపోవడంతో అక్కడ ఎవరు ఉండడం లేదని అక్రమంగా తవ్వకాలు చేసి వదిలేసిన వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు అమలు చేయడంలో కూడా అధికారులు విఫలం అయ్యారని వారు అరోపిస్తున్నారు. ఎంతవరకు లోతు తవ్వకాలు చేపడితే ఎంత రక్షణ చర్యలు చేపడుతున్నారు అన్న విషయం గురించి అధికారులు పట్టించుకోకపోవడం వలనే ఇప్పుడు గ్రామాలలో ఎక్కడ చూసిన గుంటలలో నీరు ఉందని వారు తెలిపారు. బల్లికురవ మండల పరిధిలో సుమారు 10 చోట్ల నేల క్వారీలలో నీరు ఉందని అధికారులు వెంటనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు నిలుపుదల చేసిన క్వారీల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.