కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:32 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు నెలల పాలనలో రాష్ట్రానికి 60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
డ్రైనేజి, తాగునీటి సమస్యలు పరిష్కరించండి
కొరిశపాడులోని ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి
మేదరమెట్ల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు నెలల పాలనలో రాష్ట్రానికి 60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. అప్పులు చేయడం తప్ప సంపద సృష్టించడం చేతకాని జగన్‌రెడ్డి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా, ఇప్పటికీ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజి, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి పంచాయతీ నిధులను ఉపయోగించాలన్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ వెయ్యి రూపాయలు పెంచడం, అన్న క్యాంటిన్‌లు తెరవడం, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం, రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కోనుగోలు చేయడం చేస్తున్నామన్నారు. తాగునీటి స్కీమ్‌ల నిర్వహణకు 40శాతం లెస్ టెండర్లు వేస్తున్నారని, పనులు నాణ్యతతో చేస్తేనే బిల్లులు చెల్లించాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరావును ఆదేశించారు. పలుగ్రామాలకు చెందన రైతులు రీసర్వేలో తమ భూమి తమ పేరుతో లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. రీ సర్వే కారణంగా వచ్చిన సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కారించాలని తహసీల్దార్ సుబ్బారెడ్డిని ఆదేశించారు. గ్రామాల్లో లోవోల్టేజి సమస్య తలెత్తకుండా అవసరమైనన్ని ట్రాన్స్‌ఫార్మర్లను బిగించాలని ఈఈ మస్తాన్‌రావుకు చెప్పారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి, జడ్పీటీసీ సభ్యుడు తుళ్లూరి వెంకట రమణ, ఎంపీడీవో రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.