మరియదాస్ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా
ABN , Publish Date - Dec 24 , 2024 | 11:06 PM
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్‌సీఎం చర్చి ఫాదర్ ఎం.మరియదాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కంభం ఎస్సీపాలెం మహిళలు మంగళవారం జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
కంభం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్‌సీఎం చర్చి ఫాదర్ ఎం.మరియదాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కంభం ఎస్సీపాలెం మహిళలు మంగళవారం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. సుమారు గంటపాటు రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. కందులాపురం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న మరియదా్‌సను గుంటూరు వెళుతున్న కారు ఢీకొనడంతో మృతి చెందిన విషయం విదితమే. మృతుడు స్వగ్రామం దొనకొండ మండలం సిద్ధయ్యపాలెం. బుధవారం జరగబోయే క్రిస్మస్ వేడుకలకు చర్చిని అలంకరించాలని వెళుతుండగా ప్రమాదం బారినపడ్డారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మంగళవారం ఉదయం ప్రత్యేక వాహనంలో మరియదాస్ స్వగ్రామానికి తరలిస్తూ కందులాపురం సెంటర్‌కు రాగా ఒక్కసారిగా అతని బంధువులు కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ జాతీయ రహదారిపై బైటాయించారు.
ఎస్సై నరసింహారావు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు. ఆ కారు యజమానిని పిలిపించి జరిపిన చర్చలు ఫలించడంతో మహిళలు ఆందోళన విరమించారు.