పంటలను కాపాడుకునేందుకు పాట్లు
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:27 AM
జిల్లాలో మూడు రోజులపాటు కురిసిన వర్షాలు శుక్రవారం తెరపి ఇచ్చాయి. దీంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ వర్షాల వల్ల లక్ష ఎకరాల్లోని పంట పొలాల్లో నీరు చేరింది. ప్రధానంగా పొగాకు, శనగ, మినుము నీటిలోనే ఉన్నాయి. కోత కోసిన వరి ఓదెలు, కల్లాల్లోని మిరపకాయలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో నీటిని తొలగించి నష్టాన్ని తగ్గించుకొనే ప్రయత్నాలను రైతులు చేస్తున్నారు.
నీటిలోనే లక్ష ఎకరాలు
పొగాకు, శనగ, మినుముపై వర్ష ప్రభావం
పలుచోట్ల వరి ఓదెలు, కల్లాల్లో మిర్చిదీ అదే పరిస్థితి
మూడు రోజుల్లో 31.30 మి.మీ సగటు వర్షపాతం
నీరు బయటకు పెడుతూ, మిరపకాయలు ఆరబెడుతూ అవస్థలు
గ్రామాల్లో పర్యటించి రైతులకు సూచనలు ఇస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
ఎండలు కాస్తే మరింత నష్టం వెలుగు చూసే అవకాశం
జిల్లాలో మూడు రోజులపాటు కురిసిన వర్షాలు శుక్రవారం తెరపి ఇచ్చాయి. దీంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ వర్షాల వల్ల లక్ష ఎకరాల్లోని పంట పొలాల్లో నీరు చేరింది. ప్రధానంగా పొగాకు, శనగ, మినుము నీటిలోనే ఉన్నాయి. కోత కోసిన వరి ఓదెలు, కల్లాల్లోని మిరపకాయలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో నీటిని తొలగించి నష్టాన్ని తగ్గించుకొనే ప్రయత్నాలను రైతులు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం ఆగి కొద్దిగా ఎండ వచ్చింది. మరో రెండు రోజులు ఎండ కాస్తే పంట నష్టాలు మరింత వెలుగు చూసే అవకాశం ఉంది. తాజా వర్షాలకు 11,505 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదించారు.
ఒంగోలు, డిసెంబరు 27 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లాలో మంగళ వారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం తెల్లవారు జాము వరకు పడుతూనే ఉన్నాయి. గురువారం పగలు, రాత్రి తెరపి లేకుండా చాలాచోట్ల భారీ వర్షం కురిసింది. అలా మూ డు రోజుల్లో జిల్లాలో సగటున 31.30 మి.మీ వర్షపాతం నమో దైంది. అందులో మూడో రోజే ఏకంగా 20.20 మి.మీ కురిసింది. శుక్రవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో పామూరు మం డలంలో అత్యధికంగా 80.60 మి.మీ వర్షపాతం నమోదైంది. కొత్తపట్నంలో 56.8, సీఎస్‌పురంలో 47.2, కొండపిలో 45.2, జరు గుమల్లిలో 38.40, టంగుటూరులో 38.20, సంతనూతలపాడుపొన్నలూరు, ఒంగోలు, కనిగిరి, సింగరాయకొండ, పీసీపల్లి, మార్కాపురం, మర్రిపూడి, పొదిలి, కొమరోలు, బేస్తవారపేట తదితర మండలాల్లో 15నుంచి 35 మి.మీ కురిసింది. ఈనెల తొలివారంలోనూ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అనంతరం ఎండలు లేకుండా మంగు వాతావరణం కొనసాగడంతో చాలా చోట్ల పొలాలు ఆరలేదు. ఈ సమయంలో వరుసగా మూడు రోజులు ముసురు పట్టి పలు చోట్లభారీ వర్షాలు కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పంట పొలాలను ముంచెత్తిన వర్షపు నీరు
జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లోని పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో పంటలను ముంచెత్తగా, మరికొన్ని చోట్ల నష్టపరిచేలా కనిపిస్తోంది. ప్రధానంగా పొగాకు, శనగ, మినుము పంటలు అత్యధిక విస్తీర్ణంలో నీటిలో ఉండిపోయాయి. చాలాచోట్ల కంది, కోసి ఉన్న వరి ఓదెలు నీటిలో తేలియాడుతున్నాయి. కోసి ఆరబోసిన మిరపకాయలు కల్లాల్లోనే తడిసిపోయాయి. శుక్రవారం వర్షం తెరపి ఇవ్వడంతో రైతులు పొలంలోని నీటిని బయటకు పంపి అవకాశం ఉన్న మేర పంటను రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
మినుము, లేత పొగాకు తోటలకు తీవ్ర నష్టం
ఎక్కువ ప్రాంతాల్లో మినుము, లేతశనగ, లేత పొగాకు తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాపు బాగా ఉన్న సమయంలో వర్షం కురవడంతో మినుము కాయలు ఉబ్బి పగిలిపోతున్నాయి. కొన్నిచోట్ల మొలకలు కూడా వస్తున్నాయి. తడిసిన వరి ఓదెల్లోనూ మొలకలు కనిపిస్తున్నాయి. లేత శనగ నీట మునిగి కుళ్లిపోతోంది. దీంతో ఆయా పంట పొలాల నుంచి నీటిని బయటకుపంపడంతోపాటు వరి ఓదెలను తిరగేయడం, కల్లాల్లోని మిరపకాయలను ఆరబెట్టడం వంటి పనుల్లో రైతులు నిమగ్నయ్యారు.
గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు
జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతినడంతో వ్యవసాయ. ఉద్యాన శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అఽధికారి (డీఏవో) శ్రీనివాసరావు శుక్రవారం వెలిగండ్ల మండలంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇతర మండలాల్లోనూ స్థానిక అధికారులు పొలాలను పరిశీలించి తక్షణ చర్యలపై రైతులకు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం తెరపి ఇచ్చి కొద్దిగా ఎండ వచ్చింది. మరో రెండు రోజులు ఎండ కాస్తే పంట నష్టాలు మరింత వెలుగు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం పొలాల పరిస్థితిని పరిశీలిస్తే నష్టం భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
11,505 హెక్టార్లలో పంటలకు నష్టం
జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు 11,505 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కనిగిరి, దర్శి, ఒంగోలు, గిద్దలూరు, సింగరాయకొండ, మార్కాపురం నియోజకవర్గాల్లోని 155 గ్రామాల్లో 8,853 మంది రైతులకు చెందిన ఏడు రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. వర్షం తెరిపి ఇచ్చి ఎండలు కాస్తుండటతో నష్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం వరి 776 హెక్టార్లు, మినుము 5,016 హెక్టార్లు, శనగ 1.686 హెక్టార్లు, పొగాకు 590 హెక్టార్లు, నువ్వు 126 హెక్టార్లు, అలసంద 3,266 హెక్టార్లు, జొన్న 45 హెక్టార్లలో దెబ్బతింది.