భూప్రకంపనలతో భయాందోళన చెందొద్దు!
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:08 PM
భూప్రకంపనలతో భయాందోళన చెంద వద్దని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ డి.శశిధర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మండలపరిషత్ సమావేశం హాలులో ఒంగోలు ఆర్‌డీవో లక్ష్మీప్రసన్న అధ్యక్షతన భూకంపాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా శశిధర్ మాట్లాడుతూ అద్దంకి సమీపాన గల గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వల్ల భూకంపాలు వస్తుంటాయన్నారు. 1967 నుంచి తరుచూ భూకంపాలు వస్తున్నా రిక్టర్ స్కేల్‌పై 3.1 మించి ఉండటం లేదన్నారు.
తాళ్లూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భూప్రకంపనలతో భయాందోళన చెంద వద్దని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ డి.శశిధర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మండలపరిషత్ సమావేశం హాలులో ఒంగోలు ఆర్‌డీవో లక్ష్మీప్రసన్న అధ్యక్షతన భూకంపాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా శశిధర్ మాట్లాడుతూ అద్దంకి సమీపాన గల గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వల్ల భూకంపాలు వస్తుంటాయన్నారు. 1967 నుంచి తరుచూ భూకంపాలు వస్తున్నా రిక్టర్ స్కేల్‌పై 3.1 మించి ఉండటం లేదన్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవని చెప్పారు. రిక్టర్ స్కేల్‌పై 5.5 దాటితే ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయన్నారు. ఈప్రాంతంలో తక్కువ మోతాదులో భూకంపాలు వస్తుంటాయన్నారు. దీనివల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగవన్నారు. ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించినప్పుడు నేలలో పెద్ద శబ్ధాలు మాత్రమే విన్పిస్తున్నట్లు తమ పరిశీలనలో నిర్ధారణైందన్నారు.
ఆర్‌డీవో లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో మూడు రోజుల క్రితం వరుసగా భుకంపాలు వచ్చాయన్నారు. కలెక్టర్ ఆదేశానుసారం ప్రజలు భయాందోళన చెందకుండా ఉండేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెంద వద్దన్నారు. కార్యక్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ బస్వంత్‌రెడ్డి, జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ శశిధర్, డాక్టర్ సురేష్, తహసీల్దార్ కె.సంజీవరావు, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్‌రాజు, ముండ్లమూరు తహసీల్దార్ శ్రీకాంత్, టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్‌రెడ్డి, శాగం కొండారెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ అనూష, తదితరులు పాల్గొన్నారు.