వాగొచ్చినా.. వరదొచ్చినా రాకపోకలకు ఇబ్బందే
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:52 PM
మండలంలో రెండు గ్రామాల పరిధిలో లో చప్టాలు (ఫైపులకల్వర్టు) ఉన్నాయి. వాటి స్థానంలో బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. వాటిలో డేగరమూడి వద్దఉన్న లోచప్టా వద్ద వరద నీరు వచ్చినా, వాగు నీటి ప్రవాహం పెరిగినా మార్టూరు మం డలం నుంచి డేగరమూడి మీదుగా యద్దనపూడి మండలం చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలు ఆగిపోతాయి.
రెండు చోట్ల బ్రిడ్జిల నిర్మాణం అవసరం
మార్టూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలో రెండు గ్రామాల పరిధిలో లో చప్టాలు (ఫైపులకల్వర్టు) ఉన్నాయి. వాటి స్థానంలో బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. వాటిలో డేగరమూడి వద్దఉన్న లోచప్టా వద్ద వరద నీరు వచ్చినా, వాగు నీటి ప్రవాహం పెరిగినా మార్టూరు మం డలం నుంచి డేగరమూడి మీదుగా యద్దనపూడి మండలం చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలు ఆగిపోతాయి. అదేవిధంగా రెం డవ లోచప్టా రాజుగారిపాలెం గ్రామ పరిదిలో ఉంది. మార్టూరు నుంచి బొబ్బేపల్లి, ద్రోణాదుల గ్రామాలకు దగ్గరదారిగా రాజుగారిపాలెం మీదగా వెళతారు. అయితే రాజుగారిపాలెం వద్ద లోచప్టా వద్ద వాన నీరు పెరిగితే ఈ రోడ్డు ప్రజల రాకపోకలకు బంద్ అయినట్లే. వాస్తవానికి ఎగువన రాజుగారిపాలెం వాగు ఉంటే దిగువన డేగరమూడి వాగు ఉంది. ఈ వాగులపైనే రెం డు లోచప్టాలు ఉన్నాయి. భారీగా వర్షం కురిసినా, లేదా ఏదైనా తుఫాన్‌ల సమయంలో వాగు నీరు పెరగడంతో రెండు లోచప్టాల వద్ద భారీగా నీరు ఉధృతంగా, వేగంగా ప్రవహిస్తుంది. గతేడాది రాజుగారిపాలెం చప్టాపై ద్విచక్రవాహనదారుడు పారుతున్న నీటిపై వెళుతూ, నీటి వేగాన్ని అంచనా వేయలేక ద్విచక్రవాహనాన్ని నీటిలోనే వదిలేసి ప్రాణా లు దక్కించుకున్నారు. భారీగా వర్షపునీరు చేరినపుడు ఈ లోచప్టాల వద్ద పోలీసుల బందోబస్తు మాత్రం ఏర్పాటు చేస్తుంటారు.గత పాతికేళ్లు నుంచి ఈ చప్టాల వద్ద ఇదేపరిస్థితి నెలకొని ఉంది.
ఎమ్మెల్యే ఏలూరిపైనే ఆశలు పెట్టుకున్న ప్రజలు
రెండు లోచప్టాల స్థానంలో కొత్తగా బ్రి డ్జిల నిర్మాణంపై మండల ప్రజలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన జొన్నతాళి, చిమ్మిరిబండ గ్రామాల మధ్య ఉన్న లోచప్టా స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మాణం జరగడానికి 2017- 18 కాలంలో కృషి చేశారు. అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఏలూరి మూడోసారి విజయం సాధించడంతో రెండుచోట్ల కొత్త బ్రి డ్జిల మంజూరుకు ఆయన కృషి చేస్తారని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.