Share News

వామ్మో జ్వరం

ABN , Publish Date - Dec 05 , 2024 | 02:10 AM

fevers are rampant జిల్లావాసులను సీజనల్‌ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు వణికిస్తున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా జ్వరపీడితులు కన్పిస్తున్నారు. పది రోజుల నుంచి తీవ్రత అధికమైంది. వర్షాల కారణంగా దోమల ఉత్పత్తి పెరగడం, నీటి నిల్వలు చేరడం, పారిశుధ్యం అంతంతమాత్రంగా ఉండటమే వ్యాధుల వ్యాప్తికికారణమైంది.

వామ్మో జ్వరం
ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులు

ఎక్కువ మందికి గున్యా, మలేరియా

అక్కడక్కడా డెంగ్యూ కేసులు

మంచంపడుతున్న గ్రామాలు

కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు మంచం పడుతున్నాయి. ఎక్కువ మంది గున్యా లక్షణాలతో బాధపడుతున్నారు. తీవ్రత అధికంగా ఉన్న వారు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలల్లో చేరుతున్నారు. ఆర్థికస్థోమత లేని వారు ఇంటి వద్దనే ఉండి స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని డెంగ్యూ కేసులు నమోదు కావడం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ప్రైవేటు వైద్యశాలల్లో రోజుకు 50 నుంచి 70కిపైగా ఇవి బయటపడుతున్నట్లు తెలుస్తోంది. డెంగ్యూ పేరుతో ప్రైవేటు వైద్యశాలల నిర్వాహకులు రోగుల నుంచి రూ.వేలకు వేలు పిండుకుంటున్నారు. మలేరియా కేసులు తక్కువగానే ఉన్నా టైఫాయిడ్‌ కేసులు ఓ మోస్తరుగా నమోదవుతున్నాయి. అధిక వర్షాలు, పారిశుధ్య లోపమే వ్యాధుల వ్యాప్తికి ప్రాధాన కారణమైంది.

ఒంగోలు(కలెక్టరేట్‌)/మార్కాపురం/కొండపి, డిసెంబరు 4 : జిల్లావాసులను సీజనల్‌ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు వణికిస్తున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా జ్వరపీడితులు కన్పిస్తున్నారు. పది రోజుల నుంచి తీవ్రత అధికమైంది. వర్షాల కారణంగా దోమల ఉత్పత్తి పెరగడం, నీటి నిల్వలు చేరడం, పారిశుధ్యం అంతంతమాత్రంగా ఉండటమే వ్యాధుల వ్యాప్తికికారణమైంది. దీంతో వైద్యశాలలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ముందుగా స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద వైద్య సేవలు పొంది అక్కడ తగ్గకపోతే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ కూడా నయంకాకపోవడంతో ప్రైవేటు వైద్యశాలల్లో చేరుతున్నారు. విషజ్వరాలు ప్రధానంగా మార్కాపురం, కనిగిరి డివిజన్‌తోపాటు ఒంగోలు డివిజన్‌లో జిల్లాకేంద్రమైన ఒంగోలు, చీమకుర్తి, కొండపి మండలాల్లో మరింత ఎక్కువగా ఉన్నాయి.

పెరుగుతున్న బాధితులు

జిల్లావ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం పది రోజుల వ్యవధిలో 16వేల మందిపైగా విష జ్వరాల బారినపడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో సాధారణ వైరల్‌ ఫీవర్‌తోపాటు డయోరియా, గున్యా, చికెన్‌ ఫాక్స్‌, మలేరియా, డెంగ్యూ కేసులు కూడా నమోదవు తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకం వైరల్‌ ఫీవర్‌ బారిన పడుతున్నా పంచాయతీ పాలకవర్గాలు పారిశుధ్య నిర్వహణ గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.


నమోదుకాన వారెందరో

ప్రైవేటు వైద్యశాలల్లో కొన్నిరకాల వ్యాధులను మాత్రమే నమోదు చేస్తుంటారు. మిగిలిన వాటిని నమోదు చేసే పరిస్థితి లేదు. ఇక ప్రతి గ్రామంలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు విస్తరించారు. వారి వద్ద కూడా ప్రతిరోజూ వందలాది మంది జ్వరాలు, ఇతర వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. అటువంటి వారి లెక్కలు నమోదు కావడం లేదు. ఇక జిల్లావ్యాప్తంగా అనేక రకాల వ్యాధుల బారిన పడి మెరుగైన చికిత్స కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన వారు కూడా కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ విధంగా ప్రజానీకం వ్యాధుల బారిన పడుతున్నా వైద్యారోగ్యశాఖ మాత్రం కదలడం లేదు. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.

ఫీవర్‌ సర్వే ఎక్కడ?

వైద్యారోగ్యశాఖ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితుల అవగాహన కోసం ఫీవర్‌ సర్వే నిర్వహించాల్సి ఉంది. దీని ద్వారా కుటుంబంలో ఎవరికి జర్వాలు ఉన్నాయి, ఇంకేమైనా వ్యాధులు ఉన్నాయా.. అని తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఎంతమందికి వైరల్‌ ఫీవర్‌ ఉందో కూడా అధికారికంగా లెక్కలు తేలడం లేదు. కేవలం ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చిన కేసులను నమోదు చేసుకొని మమ అనిపిస్తున్నారు.

Updated Date - Dec 05 , 2024 | 02:10 AM