Share News

పంచాయితీపై ఫైర్‌

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:45 PM

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 (సచివాలయ కార్యదర్శులు) ఉద్యోగుల బదిలీల్లో తిరకాసుపై పీఆర్‌ డైరెక్టర్‌ రవితేజ సీరియస్‌ అయ్యారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

పంచాయితీపై ఫైర్‌
విచారణకు హాజరైన పూర్వపు డీపీవో, సిబ్బంది(ఫైల్‌)

గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 ఉద్యోగుల బది‘లీలల’పై పీఆర్‌ డైరెక్టర్‌ సీరియస్‌

డీపీవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

పూర్వపు అధికారి ఉషారాణిపై విచారణకు ఆదేశం

కలెక్టర్‌ నివేదిక సమర్పించిన ఎస్డీసీ లోకేశ్వరరావు

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 10 : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 (సచివాలయ కార్యదర్శులు) ఉద్యోగుల బదిలీల్లో తిరకాసుపై పీఆర్‌ డైరెక్టర్‌ రవితేజ సీరియస్‌ అయ్యారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో డీపీవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిషోర్‌బాబును కలెక్టర్‌ అన్సారియా సస్పెండ్‌ చేశారు. పూర్వపు డీపీవో ఉషారాణిపై విచారణకు ఆదేశించారు. గ్రేడ్‌-5. గ్రేడ్‌-6 ఉద్యోగుల బదిలీల విషయంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పెద్దఎత్తున చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎస్డీసీ లోకేశ్వరరావు బుధవారం సాయంత్రం నివేదికను సమర్పించారు. అయితే ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం వెనుక వసూళ్ల మర్మం ఉందన్న ఫిర్యాదులు పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌కు వెళ్లాయి. దీనిపై ఆయన సీరియస్‌ అయ్యారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. దీంతో కలెక్టర్‌కు విచారణాధికారి నివేదిక సమర్పించడానికి ముందుగానే జూనియర్‌ అసిస్టెంట్‌పై వేటు పడింది. డైరెక్టర్‌ ఆదేశాల మేరకు డీపీవో గొట్టిపాటి వెంకటనాయుడు అందుకు సంబంధించిన ఫైల్‌ను బుధవారం కలెక్టర్‌కు పంపగా ఆమె ఆమోదముద్ర వేశారు. పూర్వపు డీపీవో ఉషారాణిపై విచారణకు ఆదేశించారు. మున్ముందు మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది.


విచారణలో అవాక్కయ్యే నిజాలు బహిర్గతం

బదిలీల్లో అక్రమాలపై విచారణాధికారిగా నియమితులైన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు రెండ్రోజుల క్రితం పూర్వ జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి. అప్పటి ఏవో శివప్రసాద్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లు కిషోర్‌, సాయిలను విచారించారు. వారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా సమాచారం తీసుకున్నారు. జిల్లాలోని వివిఽధ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులతో లోకేశ్వరరావు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విస్తుపోయే నిజాలను కార్యదర్శులు చెప్పినట్లు సమాచారం. ఎవరెవరికి ఎంత ఇచ్చింది పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది. ప్రధానంగా ముగ్గురు పేర్లను వారు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో వారి ఫోన్‌పే ఐడీల ద్వారా వారి బ్యాంకు ఖాతాలకు జమైన నగదు వివరాలను విచారణాధికారి సేకరించినట్లు సమాచారం. ఆ మొత్తం వివరాలను ఆయన తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కౌన్సెలింగ్‌ నిర్వహించి నెల దాటినా సకాలంలో ఆర్డర్లు ఇవ్వకపోవడం వెనుక మర్మాన్ని కూడా ఆయన అందులో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 09 , 2024 | 11:45 PM