రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నలుగురు ఎంపిక
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:21 AM
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈనెల 11న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేసి సత్కరించనున్నారు.
11న విజయవాడలో ప్రదానం
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈనెల 11న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేసి సత్కరించనున్నారు. గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి జడ్పీ హైస్కూలులో స్కూలు అసిస్టెంట్ (హిందీ)గా పనిచేస్తున్న ఎం.పిచ్చయ్య, మద్దిపాడు మండలం బసవన్నపాలెం జడ్పీ హైస్కూలులో ఎస్‌ఏ (హిందీ)గా పనిచేస్తున్న ఎస్‌కేఎం.బీబీ, సింగరాయకొండ మండలం మల్లికార్జుననగర్ ఎంపీపీఎస్ స్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న కె.రాంబాబు, జరుగుమల్లి మండలం బిట్రగుంట కేజీబీవీ స్కూలులో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న హెప్సిబా ఈ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో డాక్టర్ మొర్రి పిచ్చయ్య విద్యార్థులకు అత్యాధునిక ఉపకరణాలను ఉపయోగించి విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులకు సొంత నిధులతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. హెప్సిబా శిక్షణలో బిట్రగుంట కేజీబీవీకి చెందిన పలువురు విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఆమె 2018లో సావిత్రిబాయి పూలే అవార్డును అందుకు న్నారు. సింగరాయకొండ మండలంలోని సోమరాజు పల్లి గ్రామానికి చెందిన రాంబాబు ఏడేళ్ల నుంచి గిరి జన కాలనీ అయిన మల్లికార్జుననగర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. పలు సా మాజిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.