Share News

సరికొత్తగా.. అర్థవంతంగా..

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:44 AM

జడ్పీ సర్వసభ్య సమావేశం అర్థవంతంగా సాగింది. గత రెండు సమావేశాలకు భిన్నంగా అందరూ హాజరయ్యారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అంతా వైసీపీ వారే కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు వారే అధికంగా ఉండి గత మూడేళ్లు సమావేశాలు ఏకపక్షంగా సాగాయి.

సరికొత్తగా.. అర్థవంతంగా..
జడ్పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు (ఇన్‌సెట్‌లో)మాట్లాడుతున్న మంత్రి రవికుమార్‌, వేదికపై మరో మంత్రి స్వామి

జడ్పీ సమావేశంలో కీలక అంశాలపై విస్తృత చర్చ

క్రియాశీలకంగా మంత్రులు స్వామి, గొట్టిపాటి

ప్రజా సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు, సభ్యులు

అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూనే మెరుగైన చర్యలకు సూచనలు

రాజకీయ వివక్షకు తావులేకుండా అర్హులకు ప్రభుత్వ సాయం అందించాలని స్పష్టం

వైసీపీ ప్రతినిధుల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు

జడ్పీ సర్వసభ్య సమావేశం అర్థవంతంగా సాగింది. గత రెండు సమావేశాలకు భిన్నంగా అందరూ హాజరయ్యారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అంతా వైసీపీ వారే కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు వారే అధికంగా ఉండి గత మూడేళ్లు సమావేశాలు ఏకపక్షంగా సాగాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడో సమావేశం. తొలి రెండుసార్లు కూటమి ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. జిల్లా అధికారులంతా గత ప్రభుత్వంలో నియమితులైన వారే కావడం ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుదుటపడింది. అధికశాతం మంది అధికారులు మారారు. ఈనేపథ్యంలో మంగళవారం జరిగిన జడ్పీ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతేకాక కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఒంగోలు, అక్టోబరు 22 (ఆంఽధ్రజ్యోతి): ‘పథకాల అమలు, ప్రజా సమ్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం, లోటుపాట్లు లేకుండా చూడాలి. అంతకు మించి రాజకీయ వివక్షకు తావులేకుండా అర్హత కలిగిన లబ్ధిదారులకు పథకాలు చేర్చాలి. నష్టపోయిన బాధితులకు పరిహారం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. తదనుగుణంగా ఆయా శాఖల అధికారులు మసలుకోవాలి’ అని మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌ సూచించారు. స్థానిక పాత జడ్పీ సమావేశపు హాలులో మంగళవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత జరిగింది. మంత్రులు స్వామి, రవికుమార్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌. ఉగ్ర నరసింహారెడ్డి, నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, వైసీపీకి చెందిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా అజెండాలో ప్రకటించిన డ్వామా, డీఆర్‌డీఏ, వైద్యారోగ్యశాఖ, హౌసింగ్‌ శాఖలతోపాటు ఇటీవలి వర్షాలు, పంట నష్టాల అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారు.

ఆలస్యంగా ప్రారంభం

సమావేశం ఉదయం పదిన్నరకు ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. తొలుత ఒంగోలులోని టీడీపీ కార్యాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకొని అక్కడి నుంచి అందరూ కలిసి 11.40 గంటల ప్రాంతంలో సమావేశానికి వచ్చారు. అయితే సమావేశం ప్రారంభం నుంచి ఒక్క నిమిషం కూడా వృఽథాకాకుండా మధ్యాహ్నం 2.40 గంటల వరకు ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించారు. అది కూడా అర్ధవంతంగా నిర్ధిష్ట పరిష్కారాలు, ప్రశ్నలు, సమాధానాలతో సాగింది. తద్వారా సమస్యల పరిష్కారానికి, పథకాల పురోగతికి దోహదపడేలా చేయడంతోపాటు మూడు గంటల పాటు సమావేశంలో ఇరువురు మంత్రులు పూర్తి సమన్వయంతో వ్యవహరించారు. వివిధ అంశాలపై వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ప్రత్యేకించి మండల స్థాయి ప్రజాప్రతినిధులైన జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలకు అవకాశం ఇస్తూ వారు ప్రస్తావించిన విషయాలకు అధికారులు నుంచి వివరణలు ఇప్పించడంతోపాటు అవసరమైన వాటిని వారే స్వయంగా సమాధానాలు ఇచ్చి సంతృప్తిపరిచారు. ప్రధానంగా డ్వామా, పంట నష్టాలు, హౌసింగ్‌ తదితర అంశాలపై అలా వ్యవహరించారు.

వైద్యారోగ్యశాఖపై అసంతృప్తి

వైద్యారోగ్యశాఖ పనితీరులో లోపాలు, అధికారుల అలసత్వాన్ని మంత్రి స్వామి ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాను ప్రాతినిఽథ్యం వహిస్తున్న విద్యుత్‌ శాఖకు సంబంధించి జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలు, మరింత మెరుగైన చర్యలకు మంత్రి గొట్టిపాటి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. పలు కీలక అంశాలపై ఇలా అర్థవంతమైన చర్చ సాగేలా చేసిన మంత్రులు ఇరువురు పలు సందర్భాలలో ఆయాశాఖలను గాడిలో పెట్టేందుకు, ప్రభుత్వం ఆశించిన విధంగా పనులు సాగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, బాపట్ల జేసీ జైన్‌లను ఆదేశించారు.

గతంలో వలే వివక్ష, కక్షసాధింపులు ఉండవు

గత వైసీపీ ప్రభుత్వంలో వలే రాజకీయ వివక్ష, కక్షసాధింపు చర్యలు తమ ప్రభుత్వంలో ఉండవని మంత్రులు తేల్చిచెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించడం, ప్రజాసమస్యల పరిష్కారం చేయడంలో ఆ తరహా విధానాన్ని అధికారులు విడనాడాలని ఎక్కడైనా ఒకట్రెండుచోట్ల తమ పార్టీ నాయకులు ఒత్తిడి చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేశారు. త్వరలో ఇళ్ల స్థలాల మంజూరు, రూ.4 లక్షలతో గృహ నిర్మాణం, గ్రామాల్లో ఉపాధి పథకం మెటీరియల్‌ ద్వారా నిర్మాణాలు పూర్తి, వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగు, సబ్‌స్టేషన్ల ఏర్పాటు, తదితర అంశాలపైనా వివరిస్తూ వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధారణంగా జడ్పీ చైర్మన్‌, కలెక్టర్లు ఆయా అంశాలపై చొరవ తీసుకొని మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పరిష్కారాలు లేదా జిల్లాలో జటిలంగా ఉండే అంశాలపై మంత్రులు ఇలాంటి సమావేశాల్లో మాట్లాడతారు. అయితే ఈ సమావేశాన్ని అంతా తామై ఇరువురు మంత్రులు నడిపించారు.

Updated Date - Oct 23 , 2024 | 01:44 AM